- లీకేజీలపై హైకోర్టులో పిటీషన్
- నిమ్మగడ్డ పిటీషన్ వేరే బెంచ్ కు బదిలీ
ఏపీలో ప్రభుత్వానికి, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసినా వివాదం సద్దుమణిగేటట్లు కనిపించడంలేదు. తాజాగా నిమ్మగడ్డ మరో సంచలనానికి తెరలేపారు.
లీకవుతున్న గవర్నర్, ఎస్ఈసీ ల మధ్య సంభాషణలు:
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తనకు మధ్య జరిగిన సంభాషణను లీక్ చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ సమావేశమైన సందర్భాలలో ఆయనతో పంచుకున్న అత్యంత కీలక సమాచారంతో పాటు గవర్నర్ కు రాసిన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లీక్ అయ్యాయని పిటీషన్ లో తెలిపారు. ఈ వ్యవహారమంతా సామాజిక మాధ్యమాలలో కనిపించడంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. గవర్నర్ తో చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగా ఉంచాల్సింది పోయి ఇలా బహిరంగం కావడంపై దర్యాప్తు చేయాలని నిమ్మగడ్డ పిటీషన్ లో తెలిపారు.
Also Read: సీఐడీ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట
నిమ్మగడ్డ తన పిటీషన్ లో ప్రతివాదులుగా సీఎస్, రాజ్ భవన్ ముఖ్య కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణను చేర్చారు. ఎస్ఈసీ పిటీషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పిటీషన్ వేరే బెంచ్ కు బదిలీ అయింది. తన సెలవులకు సంబంధించి లేఖలు బయటకు రావడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రివిలేజ్ కమిటీ నోటీసుపై నిమ్మగడ్డ స్పందన:
మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసుపై ఏపీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ స్పందించారు. తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని, విచారణకు హాజరు కాలేనని ప్రివిలేజ్ కమిటీకి సమాచారం అందించారు. అయితే తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్ కమిటీలోకి రాదని, తనపై ఆరోపణలకు ఆధారాలు చూపించాలని నిమ్మగడ్డ కోరినట్లు తెలుస్తోంది. అసెంబ్లీపై, ఎమ్మెల్యేలపై తనకు పూర్తి గౌరవం ఉందని రమేష్‌కుమార్ తన సమాధానంలో తెలిపారు.
Also Read: తిరుపతి, నాగార్జున సాగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల