- హైకోర్టులో ప్రభుత్వం వ్యాజ్యం
- కరోనా నియంత్రణలో నిమగ్నమైన ప్రభుత్వ యంత్రాంగం
- ఎన్నికల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్లలేమన్న సర్కార్
గ్రామ పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహిస్తామంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటనను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. నవంబరు 17న ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను సవాలు చేస్తూ పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో వ్యాజ్యం వేశారు. కరోనా ఉధృతంగా ఉండటంతో ఎన్నికల సంఘం చర్యలను నిలుపుదల చేయించాలని కోర్టును కోరారు. ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రకటన చేశారని ప్రభుత్వం పిటీషన్ లో కోర్టుకు తెలిపింది. ఎన్నికల సంఘం కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చారు.
ఎన్నికలసంఘం ఏకపక్ష నిర్ణయం
ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తగిన ఆదేశాలివ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. గతంలో కరోనా కారణంతో ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. మళ్లీ ఇపుడు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తామనడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడటం ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్రంలో కరోనా ఉధృతంగానే ఉందని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమన్న ప్రభుత్వం
ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం కోరుతూ ఎన్నికల సంఘం ఆగస్టులో సీఎస్ కు లేఖ రాయగా అక్టోబరులో సీఎస్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నపుడు ప్రభుత్వం తన సంసిద్ధతను తెలియజేస్తుందని తెలిపారు. ఎన్నికలకు రాజకీయ పార్టీలు సానుకూలంగా ఉన్నాయని ఎన్నికల సంఘం చెప్పడం సరికాదని ద్వివేది అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎన్నికలను నిర్వహించలేమని ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోర్టును గోపాలకృష్ణ ద్వివేది కోరారు.
ఎన్నికల కమిషనర్ కింకర్తవ్యం ?
ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రభుత్వ పిటీషన్, హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా స్పందిస్తారోనన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.