- ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- రాష్ట్రంలో 13కి చేరిన కార్పొరేషన్లు
ఆంధ్రప్రదేశ్ లో మరొ కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి మున్పిపాలిటీలను ఒకే కార్పొరేషన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండింటిన కలిపి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ గా మారుస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి మున్పిపాలిటీతో పాటు దీని పరిథిలోని 11 గ్రామ పంచాయతీలు, తాడేపల్లి మున్పిపాలిటితో పాటు దాని పరిథిలోని 10 గ్రామ పంచాయతీలను కొత్త మున్పిపల్ కార్పొరేషన్ పరిథిలోకి రానున్నాయి. ఏపీ మున్పిపల్ యాక్ట్ 1994 ప్రకారం ఈ ప్రాంతాలను కార్పొరేషన్ పరిథిలోనికి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో స్పష్టం చేసింది. కార్పొరేషన్ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఇదీ చదవండి:ఏపీలో మూగ జీవాలకు అంబులెన్స్ సేవలు
కార్పొరేషన్ ఏర్పాటుపై జనవరిలోనే నిర్ణయం:
ఏపీలో ప్రధాన నగరాలైన విజయవాడ-గుంటూరు మధ్య కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జనవరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈమేరకు నగర అభివృద్ధికి వెయ్యి కోట్లతో డీపీఆర్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఏపీలో మరో కొత్తనగరం ఏర్పడింది. దీంతో విజయవాడ, గుంటూరు, రాజధాని అమరావతి, తాజాగా మంగళగిరి-తాడేపల్లి మున్పిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రికరణ జరిగినట్లయింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో కార్పొరేషన్ల సంఖ్య 13కి చేరాయి.
ఇదీ చదవండి: ఎన్నికలు జరపాలని ఎస్ఈసీని ఆదేశించలేమన్న హైకోర్టు