- స్థానిక సంస్థలలో ప్రత్యేక అధికారుల పాలన
- మరో ఆరు నెలలు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 5 నుంచి జిల్లా పరిషత్ లలో జనవరి 4 నుంచి మండల పరిషత్ లలో ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.
ప్రత్యేక అధికారుల పాలన
వాస్తవానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. స్థానిక సంస్థల పాలనను ప్రత్యేక అధికారులకు అప్పగిస్తూ టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక అధికారుల పాలనను ఆరునెలల కొకసారి పొడిగిస్తూ వస్తోంది.
ఇదీ చదవండి: అహం వీడి ఎన్నికలు జరిపించండి
ఈ నెల 4, 5 తేదీల్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ లలో ప్రత్యేక అధికారుల పాలన ముగియనుంది. దీంతో మరో ఆర్నెల్లపాటు ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తున్న సమయంలో ప్రత్యేక అధికారుల పాలనను పొడగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కాగా ఎన్నికల సంఘం మార్చిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఎఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఎస్ఈసీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు