అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య మందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆనందయ్య తయారు చేస్తున్న మందులో హానికరమైన పదార్థాలు ఏమీ లేవని తేల్చిచెప్పిన సీసీఆర్ ఎఎస్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆనందయ్య మొత్తం అయిదు రకాల మందులు కరోనా నివారణ పేరుతో పంచిపెడుతున్నారు. కరోనా నివారణకు శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి ఉద్దేశించిన మందు వీటిలో ఒకటి. కరోనా పొజిటివ్ తో వచ్చినవారికి నాలుగు రకాల మందులు ఆనందయ్య ఇస్తున్నారు. పీ, ఎల్, ఎఫ్, కె రకాలు ఇవి. ఆక్సిజిన్ స్థాయి తగ్గినవారికి నాలుగు రకాల చుక్కల మందు ఇస్తున్నారు. చుక్కల మందుపైన సీసీఆర్ఏఎస్ నివేదిక ఇంకా అందనందున కె. ఐ. పేరుతో ఇస్తున్న చక్కల మందులకు ఆమోదం ఇవ్వలేదు. ఆయుష్ , సీసీఆర్ఏఎస్ ల తుది నివేదిక అందడానికి మరి మూడు వారాలు పట్టవచ్చునంటున్నారు.
ఈ మందులవల్ల కరోనా తగ్గిపోతుందన్న హామీ లేదనీ, ఎవరికి ఇష్టం వచ్చిన మందు వారు వాడవచ్చుననీ, డాక్టర్లు ఇచ్చే మందులు వాడుతో వాటికి తోడుగా ఆనందయ్య ఇచ్చే మందు వాడటం క్షేమదాయకమని ప్రభుత్వం సలహా చెప్పింది. రోగుల కృష్ణపట్నం రావద్దనీ, ఎవరిచేతనైనా ఆనందయ్య మందు తెప్పించుకోవడం ఉత్తమమనీ ప్రభుత్వం చెప్పింది.