ఫొటో రైటప్: గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న ప్రముఖ పాత్రికేయుడు గోవిందరాజు చక్రధర్, పక్కన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి
జాన్ సన్ చోరగుడి
పరిపాలనను తాము సూక్ష్మస్థాయికి తీసుకువెళుతున్నాము అని చెప్పుకోవడానికి అన్ని ప్రభుత్వాలు ఇష్టపడతాయి. ‘ఎలక్షన్స్’ సమీపంలో అటువంటి ప్రయత్నం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, మా ప్రభుత్వంలో కేవలం పరిపాలన మాత్రమే కాదు, ప్రజలు ప్రాంతాలు విషయంలో మా పరిశీలనను మా పరిశోధనను మేము సూక్ష్మస్థాయికి తీసుకుని వెళుతున్నాము అని చెప్పడం వేరు. అందుకు- విశాలమైన దృష్టి ఉండాలి, దాన్ని ఆచరణలో చూపించడానికి అవసరమైన ‘ఘట్స్’ ఉండాలి. అందరికీ అవి ఉండవు. వరసగా మూడవ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం- ‘వై.ఎస్.ఆర్. అవార్డ్స్’ పేరుతో వివిధ రంగాల్లో అత్యున్నత సేవలు అందిస్తున్న వారికి నవంబర్ ఒకటిన పురస్కరాలు ప్రధానం చేసి, మొదటి నుంచి మన రాష్ట్రానికున్న- ‘పెద్దన్న’ హోదాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దక్షిణాది తెలుగు సమాజంలో నిలువెత్తున నిలబెట్టింది.
రాష్ట్ర విభజన తర్వాత నవంబర్ 1న మనం ఏమిచేయాలో తెలియని గందరగోళంలో 2014-19 మధ్య రాష్ట్ర ప్రజలు మిగిలారు. అప్పట్లో-జూన్ 2న ‘నవ నిర్మాణ దీక్ష’ అంటూ కొన్నిచోట్ల ప్రతిజ్ఞ చదివించారు. అంతేగాని మొదటినుంచి ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఒక ‘హెరిటేజ్’ ఉందని చెప్పుకోలేని స్థితిలో చరిత్ర లేని సమాజంగా మిగిలాము. చరిత్రలోకి చూస్తే, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ‘ఆంధ్రమహాసభ’ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు అస్తిత్వాన్ని పెంపొందించడానికి, తమిళుల ఆధిపత్యాన్ని అడ్డుకోవటానికి ప్రారంభమై, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి బీజాలు వేసింది. ‘తెలుగు ప్రజల నేటి పరిస్థితి’ శీర్షికతో ‘ది హిందూ’ పత్రిక 1911లో ఆరు వ్యాసాలు ప్రచురించింది. ప్రభుత్వ సర్వీసులలో ఆంధ్రులను ఎంత చిన్నచూపు చూస్తున్నారో వాటితో వెల్లడించింది.
జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ, చట్టి నరసింహారావు 1911లో ఆంధ్ర దేశ చిత్రపటం రూపొందించారు. 1912లో కొండా వెంకటప్పయ్య, కె. గురునాథం ఆంధ్రోద్యమం’ పేరుతో చిన్న పుస్తకం ప్రచురించి, ఆంధ్రప్రాంత అభివృద్ధికి సూచనలు చేశారు. వేమవరపు రామదాసు అధ్యక్షతన 1912 మే నెలలో నిడదవోలులో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది. నిడదవోలు సభ నిర్ణయం మేరకు 26 జూన్ 1913న బాపట్లలో ప్రథమ ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వేమవరపు రామదాసు ప్రతిపాదించారు. ఆంధ్ర మహాసభకు రెండుసార్లు అధ్యక్షత వహించిన ఇద్దరు వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకరైతే, కడప కోటిరెడ్డి రెండవ వాడు.
Also read: ఏ.పి. కొత్త ‘గ్రోత్ మోడల్’ తో కమ్మలు త్వరలోనే కలిసిపోతారు…
పై రెండు పేరాల్లో చూస్తున్న ప్రాంతాలు, వ్యక్తుల పేర్లు, సంవత్సరాలు ఇవన్నీ ఏమిటి? అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష, ఆయన మరణం తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగువారికి 1 అక్టోబర్ 1953 న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఇది జరిగిన మరో మూడేళ్ళ తర్వాత 1 నవంబర్ 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఒక రాష్ట్రం ఏర్పడడం ఎలా జరిగిందో చెప్పే చారిత్రిక అంశాల వరస ఒకసారి చూడండి… నిడదవోలు సభ నిర్ణయం 1913 ఇప్పుడు మనమున్నది 2023. సరిగ్గా 110 సంవత్సరాలు తర్వాత, మరోసారి మననుంచి తెలంగాణ పేరుతో విడిపోయి మిగిలిన- ‘ఆంధ్రప్రదేశ్’లో ఇప్పుడు మనం ఉన్నది,
బాగుంది. మరి జరిగింది ఏమిటి? పత్రికలు వాటిలో వ్యాసాలు రాసే ఆలోచనాపరులు ముందుగా తమ ‘పని’ మొదలుపెడితే, వాటిని చదివి ప్రభావితులై సమాజ సమష్టి మేలుకోసం మద్యతరగతి ఆలోచనాపరులు సభలు జరిపి ఆ వ్యాసాలపై చర్చించడం జరిగింది. అక్కడ వారు చేసిన తీర్మానాలను వాటి సారాంశాన్ని అప్పటి రాజకీయ నాయకులు ప్రజల ‘డిమాండ్లు’గా కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్లడం… అనే ఈ వరుస (‘చైన్’)ను ఇక్కడ మనం గమనించాలి.
Also read: మొదలయిన చోటే తప్పటడుగుల గుర్తులు చెరిగిపోతాయి…
మరి మన ‘డిమాండ్’ పరిష్కారం అయ్యాక, వ్యాసాలు రాసినవారు ఏమయ్యారు? వాటిని ప్రచురించిన పత్రికలు, వాటి సంపాదకులు వీరంతా ఏమయ్యారు? రాజకీయ నాయకులు తప్ప వారెవ్వరూ ఎక్కడ కనిపించరేమి? అనే సందేహం ఆ తర్వాత ఎవరికీ రాదు. దాంతో- ‘రాళ్ళెత్తిన కూలీలు’ అంతా కాలగర్భంలో కలిసిపోతారు. ఇలా ఏర్పడిన ఖాళీలోకి, కాలక్రమంలో ఎవరో ఒకరు అన్నీ- ‘నేనే’ అంటూ ముందుకు వస్తారు!
పత్రికలు అన్నంత మాత్రాన అలాఅని అన్ని పత్రికలు, ప్రజల్లో ఉన్న- ‘పాపులర్ డిమాండ్’ను ప్రజావాణిగా మన ముందుకు తీసుకువస్తాయి అనేమీ ‘రూలు’ ఉండదు. వాటిలోనూ తేడా ఉంటుంది. ఇటువంటి అన్నీ- ‘నేనే’ తరహా నాయకుల కోసం అవి ‘పాపులర్ డిమాండ్’ను తమకు కావాల్సినట్టుగా తయారు చేసుకుంటాయి. ఒకసారి అటువంటి ‘ట్రెండ్’ మొదలయ్యాక, ‘కెరియర్ మేనేజ్మెంట్’ చాలా తేలిక అవుతుంది. వడ్డించేవాడు ఒకడు ఉండి, పర్లేదు ఇందులో మనకు ఓనమాలు తెలుసు అనుకుంటే, అందులో మనల్ని- ‘హెడ్’గా చేయడం చాలా తేలిక! ఎటొచ్చి మన ఎనకమాల వస్తున్న ‘గుంపు’కు అవగాహనా స్థాయి పెరుగుతూ… వాళ్ళు మన డొల్లతనాన్ని యిట్టే పసిగడతారు అనే అజ మనకు లేకపోతేనే, ఆ కొని తెచ్చుకున్న ‘హోదా’ల్లో మనం సుఖంగా ఉండగలం. లేకపోతే, మళ్ళీ అదొక కొత్త- ‘టార్చర్’.
పల్లెకు పోదాం ప్రతిభను చూద్దాం ఛలో ఛలో… అన్నట్టుగా, ఇందుకోసం గత మూడేళ్ళుగా రాష్ట్రం నలుమూలలా సామాన్యుల్లో అసామాన్యులను వెదకడానికి రాష్ట్ర ప్రభుత్వం జల్లెడ పడుతున్నది. ఈ వెతుకులాటలో ఎంతగా పుటం వేసినప్పటికీ, జల్లెట్లోకి- ‘కెరియర్ మేనేజ్మెంట్ ట్రెయినీలు’ కొందరు వస్తూనే ఉంటారు. అది మరెవరికో పంటి క్రింద రాయిలా అనిపిస్తే అనిపించవచ్చు. ఇక్కడ సర్కారు ‘చూపు’ ఎటువంటిది అనేది ముఖ్యం, దాని సంకల్పం ప్రధానం. రాబోయే రోజుల్లో మేము ‘వెయిటింగ్ లిస్ట్’లో ఉన్నాము అనుకునేవారు, ‘నెక్స్ట్ టైమ్ బెటర్ లక్’ అనుకోవడమే మిగిలింది!
Also read: మోడీ అంబుల పొదిలో కొత్త బాణమైన ఏ.పి. జి.ఎస్. టి. కేస్!
.