- జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వాక్సినేషన్ ప్రక్రియ
- టీకా పంపిణీకి సిబ్బంది అవసరమన్న ప్రభుత్వం
ఏపీ పంచాయతీ ఎన్నికల పోరు మళ్లీ మొదటికొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేదుకు ఎన్నికల సంఘం తన సంసిద్ధతను ఇప్పటికే తెలిపింది. అయితే పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలకు అనుకూల పరిస్థితుల్లేవన్న ఏపీ
టీకా పంపిణీకే ప్రాధాన్యం
తొలి దశ వాక్సినేషన్ అనంతరం నాలుగు వారాలకు మలిదశ వాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని వాక్సిన్ పంపిణీ మార్గ దర్శకాలలో కేంద్ర ప్రభుత్వం సూచించిందని జగన్ సర్కార్ కోర్టుకు తెలిపింది. ఎన్నికల ప్రక్రియ లాగానే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తేల్చి చెప్పింది. అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో వచ్చే శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం తెలిపింది.
ఇదీ చదవండి:స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు