జాన్ సన్ చోరగుడి
ఇదంతా ఎలా మొదలయింది అంటే, ఆరంభం ఎలా అనే దాని కంటే, అంతిమంగా ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడమే, తేలికలాగా కనిపిస్తున్నది. ఎందుకంటే, అరంభంలోకి కనుక మనం చూపు సారిస్తే… నిర్లక్ష్యం ఎప్పుడు మొదలయింది? ఎలా అది మొదలయింది వంటి మౌలిక ప్రశ్నలు మనమే వేసుకుని, వాటికి జవాబులు వెతకాలి. అందుకే ఎటూ 2014 జూన్ 2 మన కొత్త చరిత్రకు ఒక ఆరంభం అయింది కనుక, దీన్ని అక్కణ్ణించి చూడ్డం మొదలెడదాం.
ఎన్టీఆర్ జ్ఞాపకార్థం కళారంగంలో ఒక పురస్కారం ఇవ్వాలని 1998 లో చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అలా మొదలైన ఆ అవార్డు బాధ్యత అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ చూస్తూ వచ్చింది. అయితే గడచిన పదేళ్లలో ఈ ప్రభుత్వం దాన్ని ఎలా చూసింది చేసిందీ అనేది పరిశీలించినప్పుడు, ఈ రంగంలో కొత్తగా చోటుచేసుకుంటున్న మార్పులు చేర్పులు గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది
ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం పేరుతో అవార్డును 1998 నుంచి ఇస్తున్నారు. నాటక రంగంలో వ్యక్తిగత స్థాయిలో విస్తృతమైన కృషి చేసినవారికి రూ. 1. 50 లక్షలు నగదు, జ్ఞాపికతో సత్కారం చేస్తున్నారు. దీనికి 2022 కోసం ఎంపిక అయిన డా. మీగడ రామలింగ స్వామి జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా లోని రాజాం పట్టణం. ఆయన తల్లి అప్పలనరసమ్మ. తన తండ్రి ప్రభావం తనపై పడటంతో ఆయన తొమ్మిదో తరగతి నుంచే నాటకరంగ ప్రవేశం చేశాడు. చిన్నప్పుడే అభిమన్యుడు, నారదుడు, బాలకృష్ణుడు వంటి పాత్రలు పోషించారు.
సంస్థ తరపున విశాఖలో డా. మీగడ రామలింగ స్వామిని అభినందిస్తున్న సమాచార శాఖ అధికారి
రాజాం హైస్కూలులో సంస్కృత పండితుడిగా పనిచేస్తోన్న ముట్నూరు అనంతశర్మ ప్రభావంతో తెలుగు, సంస్కృత భాషలపై ఆయనకు మక్కువ ఏర్పడింది. 1975లో విజయనగరం మహరాజా సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణలో చేరాడు. అక్కడ చదువుతూ అప్పటి ప్రముఖ రంగస్థల నటులు పీసపాటి నరసింహారావు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, షణ్ముఖ ఆంజనేయరాజు, సంపత్ లక్షణరావు, డివి.సుబ్బారావు వంటి గొప్ప నటులకు గ్రూపుగా హార్మోనియం సహకారం అందించారు.
భాషా ప్రవీణలో కాలేజీకి ఫస్ట్ గా నిలిచారు, 1981లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎం.ఎ తెలుగులో ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే 1983లో ఎం.ఫిల్, తిరుపతి వెంకటకవులు రచనలు పాండవ నాటకాలపై పరిశోధనలు చేసి, 1993 పిహెచ్‌డి పట్టా అందుకున్నారు. 1985లో బుల్లయ్య కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి, 2013లో పదవీ విరమణ చేశారు.
గుంటూరు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో 27 మంది న్యాయనిర్ణేతలు
శ్రీమీరా కళాజ్యోత్స్న నాటక సమాజాన్ని1982లో ఏర్పాటు చేశారు. స్వీయ రచన చేసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అశ్వత్ధామ, గుణనిధి, కుంతీకరణ, యామునాచార్య, ఉత్తర రామాయణం, భక్త ప్రహ్లాద వంటి నాటకాలు దేశ, విదేశాల్లోనూ పలు ప్రదర్శనలు చేశారు. వీటితోపాటు హరిశ్చంద్ర, నక్షత్రక, శ్రీరామ, ఆంజనేయ వంటి ప్రధానపాత్రలు పోషించారు.
ఈ రోజున ‘మీగడ’ ఇంటిపేరు ఉత్తరాంధ్ర పద్యనాటకానికి చిరునామాగా మారింది అనడం అతిశయోక్తి కాదు. అటువంటి కళాకారుడికి ఈ అవార్డు ఇచ్చి ఈ ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించింది.
డా. వైఎస్సార్ రంగ స్థల పురస్కారం 2023
ఇది సమష్టి కృషితో ‘థియేటర్’ కార్యకలాపాలను నిర్వహిస్తున్నవారికి ఇకముందు ఏటా ఇస్తారు. తొలి డా. వై.ఎస్.ఆర్. రంగస్థల పురస్కారానికి కాకినాడ ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ ఎంపిక కావడంతో, మన గతం గురించిన ఎరుక ఉన్నవాళ్లకు ఈ వార్త విన్నప్పుడు- ‘అబ్బా ఎంత గొప్ప ఎంపిక!’ అనిపించింది.
ఒకప్పటి మన ‘బ్లాక్ అండ్ వైట్’ రోజుల్ని ఇక మనం మర్చిపోవడమే అనుకుంటున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరుతో నాటక సమాజాలకు పరిషత్తులకు పురస్కారం ప్రకటించిన మొదటి ఏడాదే, రూ. 5,00,000 నగదు వైఎస్ఆర్ ప్రతిమ షీల్డుకు ఈ సంస్థ ఎంపిక అయింది.
సంస్థ తరపున కాకినాడలో యంగ్ మెన్స్ హ్యపీ క్లబ్ ప్రసిడెంట్ దంటు భాస్కర్ ను అభినందిస్తున్న సమాచార శాఖ అధికారులు
తప్పడం లేదు
ఈ వార్త విన్నవారికి ఇప్పటికి సరిగ్గా ఏడేళ్ల క్రితం ‘హిందూ’ ఆంగ్ల పత్రికలో వచ్చిన మరో వార్తను గుర్తు చేయక తప్పడం లేదు. 2016 డిసెంబర్ 22న ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్: లాస్టింగ్ ఇట్స్ లెగసి’ (Young Men’s Happy Club: Lasting legacy) శీర్షికతో ఒక వార్త రాసింది. అదేమీ చిత్రమో ఏడేళ్ల తర్వాత సరిగ్గా అదే 22 డిసెంబర్ 2023న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని ‘మీటింగ్ హాల్లో’ 27 మంది నంది నాటకాల న్యాయనిర్ణేతలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు వచ్చిన 44 ఎంట్రీలను మూడు గంటలు పైగా పరిశీలించి చేసిన కసరత్తు తర్వాత, వారు ఈ ఎంపికను ‘మీడియా’ ముందు ప్రకటించారు.
రాజకీయమా?
ఏడేళ్లు అంటున్నారు సరే. అయితే, ఈ ఏడేళ్ల వ్యవధిలో ఏమీ జరగలేదా? అంటే మళ్ళీ అటువంటి విషయాలు గురించి మాట్లాడ్డం అంటే, అవి రాజకీయాలు అవుతున్నాయి! దాంతో, వాటన్నిటికీ దూరంగా ఉంటూ, ఏమిటి- కాకినాడ ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ అని చూసినప్పుడు, ఒకప్పుడు విజయనగరంలో- ‘విజయ భావన’, నెల్లూరులో- ‘నెఫ్జా’, కాకినాడలో- ‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ సాహిత్య-సాంస్కృతిక, థియేటర్ కార్యకలాపాలకు తెలుగునాట శాశ్విత చిరునామాలుగా ఉండేవి, అనే పాత విషయం గుర్తు చేసుకోక తప్పడం లేదు.
గత తరం సినీ నిర్మాత సి. కృష్ణవేణికి 2016లో క్లబ్ సన్మాన దృశ్యం
అప్పట్లో- ‘యువ’, ‘స్వాతి’, ‘జ్యోతి’ వంటి తెలుగు మాసపత్రికలో కనీసం రెండు పేజీలు సాహిత్య-సాంస్కృతిక వార్తా చిత్రాలు ఉంటే, వాటిలో ఈ మూడు సంస్థల చిత్రాలు ఏడాది పొడవునా తప్పకుండా కనిపించేవి! ‘మెయిల్స్’, ‘వాట్సస్యాప్’ లేని ఆ రోజుల్లో సాంస్కృతిక – సాహిత్య రంగాల మధ్య బంధుత్వం అంత గాఢంగా ఉండేది. అటువంటిది, ఆ తరంతో పాటుగా ఆ గత వైభవం కూడా చరిత్రలో కల్సిపోయింది. సొమ్ములున్న ‘ఈనాడు’ గ్రూప్ గత రెండేళ్లలో నాలుగు పత్రికలు మూసివేసిందంటే, మారిన పరిస్థితి తీవ్రత అర్థంచేసుకోవచ్చు.
మొద్దు నుంచి చిగురు
ఇలా తలుచుకునే నాథుడు లేక కునారిల్లుతున్న సామాజిక వ్యవస్థల్ని ‘రాజ్యం’ మళ్ళీ బ్రతికించడాన్ని ఎవరైనా ఎలా చూడాలి? కొన్నికొన్ని మహా వృక్షాలు ఎంతగా ఎండినప్పటికీ దాని లోపల పచ్చిదనం ఉంటే, మొద్దు నుంచి కూడా చిగురు పుడుతుంది. ‘చరిత్ర’ కూడా అంతే, సామాజిక శాస్త్రాల చదువులు అటకెక్కాక, మనకు తెలియకుండా మనలోని ‘ఈస్థటిక్స్’ కూడా కొండెక్కాయి. సాంకేతిక మార్పులు చివరికి ‘వినోదం’ అర్ధాన్ని మార్చేశాయి.
మనోవైశాల్యం
ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత, అదీ ప్రభుత్వ పూనికతో- ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టి.వి. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ చైర్మన్ పోసాని కృష్ణమురళి తీసుకున్న చొరవతో మళ్ళీ ఇది సాధ్యమయింది. ఎందుకీ మాట అనడం అంటే, సూక్ష్మ అంశాలలోకి కూడా జోక్యం చేసుకుని మరీ ఆయన అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో కొత్త ఆంధ్రప్రదేశ్ ‘మ్యాప్’ తో ఏర్పడిన రాష్ట్రంలో ఎంతో కొంత మేర మళ్ళీ సాంస్కృతిక పునరుజ్జీవం మొదలవుతున్నదా?
గుంటూరులో జరుగుతున్న నంది నాటక ప్రదర్శనల దృశ్యం
సమాంతర సాంస్కృతిక శక్తుల్ని…
ఈ ప్రశ్నకు గాని ఇటువంటి ఆశలు మొదలవడానికి గాని కారణం లేకపోలేదు. ఐదేళ్ల క్రితం 13 జిల్లాలు ఉన్న రాష్ట్రం ఇప్పుడు 26 జిల్లాల రాష్ట్రం అయింది. ఇకముందు కొత్త జిల్లాల కేంద్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వ వేదికలు వల్ల, కొత్త ‘ట్యాలెంట్’ బయటకు వస్తుంది. “కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు…” అనే ఈ ప్రభుత్వం ‘లైఫ్ లైన్’ ఉండనే ఉంది! ఇటువంటి పరిస్థితుల్లో సమాంతర సాంస్కృతిక శక్తుల్ని కూడా తమతో కలుపుకుని పోయే మనోవైశాల్యం ప్రధాన స్రవంతి సమాజానికి ఉన్నప్పుడు, మొత్తంగా దీన్నిస్వాగతించాల్సిన పూనికగా చూడాల్సి ఉంటుంది.
చూడ్డం కష్టం
‘యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్’ విషయమే కనుక తీసుకుంటే, ఇప్పటికి ఏడేళ్ల క్రితం వందేళ్లు పూర్తిచేసుకున్న సంస్థ ఇది. ‘దంతు కళాక్షేత్రం’ పేరుతో కాకినాడలో స్వంత నాటకశాలను ఏర్పాటు చేసుకున్న అరుదైన సంస్థ ఇది. ‘ఈ క్లబ్ చరిత్ర నుంచి తెలుగు థియేటర్ చరిత్రను వేరుచేసి చూడ్డం కష్టం. ఇంత కాలం పాటు కేవలం నాటక ప్రదర్శనలు అనే ఒకే ఒక్క ‘ప్రోగ్రామ్’తో, మనుగడ సాగించిన సమాజాలు దేశంలో చాలా కొద్ది మాత్రమే ఉన్నాయి’ అంటారు ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు.
క్లబ్ నాటకాలు ద్వారా పరిచయం అయిన రేలంగి – సూర్యకాంతం
నిన్నటి తరంలో సుప్రసిద్ధులు అయిన- ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, రేలంగి వెంకట్రామయ్య, సూర్యాకాంతం, వారి తొలి రోజుల్లో ఈ ఆడిటోరియం ‘గ్రీన్ రూమ్’ లో మేకప్ వేసుకుని, ‘ఫ్లడ్ లైట్స్’ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినవారే అంటే ఆశ్చర్యం కలుగుతుంది. సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు ఈ సంస్థ నాటకాలకు ‘ట్యూన్స్’ కడుతూ సంగీత రంగ ప్రవేశం చేసారు.
ఇచ్చోటనే…
‘కీలుగుఱ్ఱం’ (1949) చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన, ఎన్ఠీఆర్ ఏఎన్నార్ ల తొలి రోజుల్లో వారి సినిమాలకునిర్మాతగా
క్లబ్ నాటకాల ద్వారా పరిచయం అయిన ఎస్వీఆర్ – అంజలి
వ్యవహరించిన సి. కృష్ణవేణికి 96 ఏళ్ళ వయస్సులో ఈ క్లబ్ సన్మానం చేసినప్పుడు, ఆమె “నేను ఈ క్లబ్ స్టేజి మీద ‘ఒక్కతే కూతురు’ నాటకంతో రంగప్రవేశం చేసాను” అని నాటక కళతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమ వందేళ్ల పండుగ సందర్భంగా ఈ ‘క్లబ్’ శ్రీమతి కృష్ణవేణి, ప్రముఖ రంగస్థల నటుడు శ్రీ బుర్రా సుబ్రమణ్య శాస్త్రిలకు ఘనంగా సన్మానం చేసింది.
‘క్లబ్’ గురించి ఇంతగా చెప్పుకుంటున్నాము సరే, మరి ఇన్నాళ్ల పాటుగా దీని ‘స్టేజి’ ముందు కూర్చున్న ప్రేక్షకులకు లేదా కాకినాడ, కోస్తా ఆంధ్ర పౌరులకు వారి కళా హృదయానికి పట్టం కట్టాల్సింది, సన్మానం చేయాల్సింది ఎవరు? ఇదిగో ఈ ప్రభుత్వం తొలి ‘వైఎస్సార్ అవార్డు’ ఇచ్చి ఆ పని పూర్తిచేసింది.
మీ సానుకూల దృక్పధం చాలా వున్నతమైనది ఘాడమైనది.
రాజకీయ ప్రత్యర్ధులకు వ్యక్తిగత శత్రువులకు తేడా తెలియని చెత్తమాటల
( క్షమించాలి ఇంతకంటే కటువైన భాష నాకు రాదు) కృష్ణమురళిగారి చొరవతో సాంస్కృతిక పునరుజ్జీవనం…. వొద్దు వొద్దు ఈ ఆలోచనే చాలా కష్టంగా వుంది 🙏🙏