- ఎన్నికల కోడ్ అమలుపై సీఎస్ కు లేఖ
- ఎస్ఈసీ నిర్ణయంపై ఏపీఎన్జీవో ఆగ్రహం
- ప్రజాప్రయోజనాల దృష్ట్యానే ఎన్నికల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వివాదస్పదమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడాన్ని జగన్ సర్కారు తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తోంది. ఎన్నికలను ఆపేందుకు కోర్టుకు వెళ్లేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటీషన్ దాఖాలు చేయాలని యోచిస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా లేమని చెప్పినా ఎస్ఈసీ నిమ్మగడ్డ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
నిమ్మగడ్డపై ఏపీ ఉద్యోగ సంఘాల ఆగ్రహం :
మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కు సహకరించేదిలేదని ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఉద్యోగులు,ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్ఈసీ తీరుకు నిరసనగా ఎన్నికల విధులు బహిష్కరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. తక్షణమే నోటిఫికేషన్ వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ నిర్ణయం ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసేది ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎన్నికల నియమావళిపై సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ:
పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగిరం చేసింది. ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడంతో కోడ్ అమల్లోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం (జనవరి 9) ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ప్రవర్తనా నియమావళి గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని లేఖలో నిమ్మగడ్డ స్పష్టం చేశారు. పట్టణ, నగర ప్రాంతాలలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండదని తెలిపారు. అలాఅని పట్టణ ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూర్చే పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లవుతుందని తెలిపారు.
ఎన్నికల సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న నిమ్మగడ్డ:
గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్ పాల్గొనే ఉద్యోగులకు పలు సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల మాదిరిగా శానిటైజర్, మాస్కులు సరఫరా చేయాలని కమిషన్ తెలిపింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు సిబ్బందికి కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సినేషన్ లో ఎన్నికల సిబ్బందికి తొలి ప్రాధాన్యత నివ్వాలని సూచించింది.
ఇదీ చదవండి: ఏపీలో ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు