తెలంగాణలో షర్మిల పెట్టబోయే పార్టీపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడటంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురతువున్నారు. షర్మిల పార్టీ ఏర్పాటు ప్రతిపాదనతో తమ పార్టీకి కాని,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి గాని ఎలాంటి సంబంధంలేదు. పైగా పార్టీ పెట్టవద్దని ఆయన నచ్చజెప్పచూశారు. పార్టీ పెట్టడం వల్ల కలిగే ఫలితాలకు ఆమే బాధ్యురాలవుతారు.పార్టీ పెట్టడం వల్ల ఎదురయ్యే కష్టాలను ఇన్నేళ్ల అనుభవంలో చూసిన జగన్ మోహన్ రెడ్డి చెల్లి పార్టీ పెడతానంటే అన్నగా బాధపడతారు అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే దీనికి భిన్నంగా ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. షర్మిల పార్టీకి జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదంటూ బుధవారం (ఫిబ్రవరి 10) శ్రీకాకుళంలో చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోణంలో తెలంగాణలో తమ వైసీపీని విస్తరించదలచుకోలేదని వైసీపీ పెద్దలు చెబుతున్నారు. తెలంగాణలో సమర్థ నాయకత్వం అవసరం ఉందని ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెట్టడాన్ని తప్పుబట్ట లేమని, ఆమె పెట్టబోయే పార్టీకి జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకం కాదని ధర్మాన వ్యాఖ్యనించడం విశేషం.
Also Read: అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాల్లేవు – సజ్జల
షర్మిల ఆత్మీయ సమావేశాలు :
పార్టీ పెట్టేముందు అభిమానుల అభిప్రాయాలు తెలుసు కునేందుకు జిల్లాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించా లని నిర్ణయించిన షర్మిల త్వరలో ఖమ్మం నేతలతో సమాలోచనలు జరుపుతారని తెలుస్తోంది. జిల్లాల నుంచి అభిమానులను హైదరాబాద్ కు రప్పించడం ఇబ్బందితో కూడుకున్న పని కావడంతో జిల్లాల్లోనే సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు.
కుట్రలో భాగమే-హర్ష కుమార్
తెలంగాణలో షర్మిల రాజకీయ రంగ ప్రవేశానికి కారకులు మీరంటే మీరని బీజేపీ, టీఆర్ఎస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండగా ఇది సమష్టి కుట్ర అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకే టీఆర్ఎస్, బీజేపీలు ఆడుతున్న నాటకమని హర్షకుమార్ అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే షర్మిల పనిచేస్తారని హర్షకుమార్ జోస్యం చెప్పారు.