అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి వంద శాతం పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఆర్థిక వ్యవహారాల కెబినెట్ కమిటీ (సీసీఈఏ) ఇచ్చిన అనుమతిపైన పునరాలోచించాలని కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దంటూ ప్రధానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ ఎల్) ఆధ్వర్యంలో పని చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వ్యూహాత్మకంగా నూరు శాతం పెట్టుబడులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనే నిర్ణయం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నవరత్నాలలో ఒకటి. సుమారు 20 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. పరోక్షంగా మరెందరో దీనిపైన జీవిస్తున్నారు. ఇది సముద్ర తీరంలో నెలకొల్పిన తొలి ఉక్కు కర్మాగారం.
సుదీర్ఘకాలం సాగిన ఉద్యమం
దశాబ్దకాలంపాటు ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అంటూ నినదించి, ఉద్యమాలు చేసి, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ ఇది. ఈ ఉద్యమంలో 32 మంది బలిదానం చేశారు. ఈ నేపథ్యంలో 17 ఏప్రిల్ 1970లో నాటి ప్రధాని (ఇందిరాగాంధీ) విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పబోతున్నట్టు ప్రకటన చేశారు. 2002 నుంచి 2015 వరకూ విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పనితీరుతో లాభాలు గడించిన విషయం ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఈ కర్మాగారం ప్రస్తుత మార్కెట్ విలువ లక్షకోట్లకు పైగానే ఉంటుందనీ, సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 73 లక్షల టన్నులు కాగా, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఆర్ఐఎన్ ఎల్ ఇటీవల అనేక చర్యలు తీసుకున్నదని జగన్ మోహన్ రెడ్డి తన లేఖలో వివరించారు.
Also Read : మళ్ళీ విశాఖ ఉక్కు ఉద్యమం
కేంద్రం అండగా నిలిస్తే తిరిగి లాభాల బాటలోకి
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో నెలకొన్న మాంద్యం కారణంగా 2014-15 నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం కూడా ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగి నష్టాల బాట పట్టిందని తెలియజేశారు. పెట్టుబడులు ఉపసంహరించుకోవడం కంటే ప్రభుత్వం అండగా నిలబడి సంస్థకు చేయూత నిచ్చినట్లయితే లాభాల బాటలోకి తిరిగి వస్తుందనే విశ్వాసాన్ని జగన్ మోహన్ రెడ్డి వెలిబుచ్చారు. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందనీ, ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చాలనీ, రుణాలను వాటాల రూపంలో మార్చాలనీ సూచించారు. ప్రధానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి ఈ కింది సూచనలు చేశారు:
- ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం సొంత గనులు: విశాఖ స్టీల్ ప్లాంట్ తమ ఉత్పత్తి కోసం ప్రస్తుతం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ ఎండీసీ)కి చెందిన బైలదిల్ల గనుల నుంచి మార్కెట్ ధరకు టన్ను ఇనుప ఖనిజాన్ని రూ. 5260కి కొనుగోలు చేస్తోంది. దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకూ వాటి సొంత ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి. వాటి ద్వారా ఆ కర్మాగారాల అవసరాలు 60 శాతం తీరుతుంటే తక్కిన ఖనిజాన్ని ఎన్ ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు కూడా 200 సంవత్సరాలకు సరిపడా ఇనుప ఖనిజం గనులు సొంతంగా ఉన్నాయి. కానీ విశాఖ కర్మాగారానికి అవసరమైన ఇనుప ఖనిజం మొత్తాన్ని ఎన్ ఎం డీసీకి చెందిన గనుల నుంచి కొనుగోలు చేయడం వల్ల ఇర్ఎన్ఎల్ఐపైన రూ. 3,472 కోట్ల భారం పడుతోంది. అందువల్ల ఈ రంగంలోని తక్కిన కర్మాగారాలతో పోటీ పడే విధంగా విశాఖ కర్మాగారానికి కూడా సొంత గనులు కేటాయించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీ దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఒడిశాలోని ఇనుప ఖనిజం గనిని కనుక విశాఖ కర్మాగారానికి కేటాయంచగలిగితే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
- విశాఖ స్టీల్ ప్లాంట్ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడం వల్ల సంస్థపైన రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గించడంతో పాటు రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గిపోతుందని సూచించారు. సంస్థ రుణభారం రూ. 22 వేలకోట్లు కాగా, దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీ చెల్లించవలసి వస్తున్నది. ఈ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మార్చితే వడ్డీ భారం తగ్గిపోవడంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా స్టాక్ ఎక్స్ చేంజీలో నమోదు అవుతుంది. తద్వారా స్టాక్ మార్కెట్ గుండా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా కలుగుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
Also Read : విశాఖ ఉక్కు : ఉపాధి కోసమే కాదు….`ఆత్మాభిమానం`
రాష్ట్ర సంస్కృతిలో భాగమైపోయింది
సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ రాష్ట్ర సంస్కృతిలో భాగమైపోయిందనీ, సంస్థ పునరుద్ధరణ కోసం కేంద్రంతో కలసి పని చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ జగన్ తెలియజేశారు. ఆర్ ఐఎన్ ఎల్ (విశాఖ ఉక్కు కర్మాగారం)లో వ్యూహాత్మకంగా 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయంపైన పునరాలోచన చేయాలనీ, సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలనీ ముఖ్యమంత్రి ప్రదానిని కోరారు.
Also Read : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటాం