- 2019 నాటికి 69 శాతం పనులు మిగిలి ఉన్నాయి
- అన్ని అనుమతులూ 2009 నాటికే వైఎస్ హయాంలోనే లభించాయి
- పోలవరం సందర్శన పేరుతో చంద్రబాబునాయుడు భజనకు రూ.81 కోట్లు వృధా
అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులపైన తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నది అసత్యాలూ, అతిశయోక్తులనీ, నిజానికి అక్కడ పని జరిగింది తక్కువ, చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం మాత్రం ఎక్కువని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధారాలతో సహా బుధవారంనాడు శాసనసభలో వివరించారు. పులిచింతల. కండలేరు, గండికోట, వెలుగొండ ప్రాజెక్టులలో సైతం చేసింది తక్కువనీ, ప్రచారం మాత్రం ఎక్కువనీ ముఖ్యమంత్రి విమర్శించారు.
యుద్ధప్రాతిపదికపైన పనులు
ప్రస్తుతం పోలవరంలో యుద్ధప్రాతికపైన పనులు జరుగుతున్నాయనీ, ఒక్క అంగుళం ఎత్తు కూడా తగ్గించేది లేదనీ, ఆర్ అండ్ ఆర్ పైన కూడా శ్రద్ధ చూపుతున్నామనీ చెప్పారు. తెలుగుదేశం నాయకులు పోలవరంలో 70 శాతం పనులు తామే చేసినట్టు చెప్పుకుంటున్నారనీ, ఇది అవాస్తవమనీ చెబుతూ, పోలవరం ప్రాజెక్టు నేపథ్యం చెప్పుకుంటూ వచ్చారు. పోలవరం మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఒక స్వప్నంగానే మిగిలిపోయిందనీ, ఎందరు ముఖ్యమంత్రులు వచ్చినా అది అంగుళం కూడా ముందుకు కదల లేదనీ, చంద్రబాబునాయుడు 1995 నుంచి 2004 వరకూ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పానని చెప్పుకున్నప్పటికీ పోలవరం విషయంలో చేసింది పూజ్యమనీ వివరించారు. చివరికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలైనాయనీ, అన్ని అనుమతులూ ఆయన హయాంలోనే సంపాదించారనీ ఉద్ఘాటించారు.
కుడి, ఎడమ కాల్వలకు అవసరమైన భూమిలో 95 శాతానికి మించి వైఎస్ హయాంలోనే సేకరణ
కుడి కాలువ (రైట్ బ్యాంక్ కెనాల్)కోసం 10, 625 ఎకరాల భూమిని వైఎస్ఆర్ ప్రభుత్వం సేకరించగా చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి వచ్కాక సేకరించింది 1700 ఎకరాలు మాత్రమేనని చెబుతూ, వైఎస్ హయాంలో 86 శాతం భూసేకరణ జరిగితే తక్కిన 14 శాతం చంద్రబాబునాయుడు హయాంలో జరిగిందని జగన్ అన్నారు. ఎడమ కాలువ (లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) కోసం అవసరమైన భూమిలో 98 శాతం వైఎస్ ప్రభుత్వమే సేకరించిందనీ, చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం సేకరించిన భూమి 95.2 ఎకరాలు మాత్రమేననీ అంటూ మొత్తం అవసరమైన భూమిలో అది 0.89 శాతమేననీ చెప్పారు.
2019 నాటికి 69 శాతం పనులు మిగిలి ఉన్నాయి
హెడ్ వర్క్, కుడి, ఎడమ కాల్వల మొత్తం పనులలో వైఎస్ హయాంలో 9.2శాతం పనులు జరిగాయనీ, 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబునాయుడు హయాంలో 20.66 శాతం పనులు జరిగాయనీ, 2019 మే నాటికి, అంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 69 శాతం పనులు చేయవలసి మిగిలి ఉన్నాయనీ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అంటే దాదాపు 70 శాతం పనులు 2019 మే నాటికి మిగిలి ఉన్నది. 70 శాతం పనులు తామే పూర్తి చేశామని టీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు కనుక ఈ వివరాలన్నీ సవిస్తరంగా చెప్పవలసి వస్తున్నదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వరా పోలవరం ఖర్చులో రూ. 1343 కోట్లు ఆదా చేశామని కూడా ఆయన తెలిపారు.
పోలవరం ఏటిఎం అయిందని ప్రధాని చెప్పారు
ఇది ఇలా ఉండగా టీడీపీ ప్రభుత్వం ప్రజలను పోలవరం సందర్శనానికి తీసుకొని పోయి భజన చేయించుకోవడానికి రూ. 81 కోట్లు వృద్ధా చేసిందని చెబుతూ ‘జయము జయము చంద్రన్నా, పోలవరం కట్టినావు చంద్రన్నా, నీకెవ్వరు సాటిలేరు చంద్రన్నా…. అంటూ మహిళల చేత చంద్రబాబునాయుడు కీర్తిగీతాలు పాడించారని చెప్పారు. ఆ గీతాలు పాడిన కేసెట్ ను అసెంబ్లీలో ప్రదర్శించినప్పుడు అక్కడ చంద్రబాబునాయుడు కూడా ఉన్నారు. కేవలం చంద్రన్నను కీర్తిస్తూ మహిళలు పాటలు పాడే సినిమా చూపించేందుకు కోట్ల రూపాయలు వృధా చేశారని జగన్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన నడవడమే కాకుండా విపరీతమైన అవినీతి జరిగిందనీ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2019లో ఎన్నికల ప్రచారానికి వచ్చి పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఏటీఎం (ఎనీ టైం మనీ)గా మార్చివేశారని విమర్శించారని జగన్ గుర్తు చేశారు.