దిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి సమావేశమైనారు. పోలవరం పూర్తి చేయడానికి సహకరించాలని కోరుతూ అమిత్ షాకి జగన్ వినతిపత్రం సమర్పించారు. రెండవ సారి సవరించిన అంచనాల ప్రకారం (2017-18 నాటి ధరల ప్రాతిపదికగా) పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 55, 656 కోట్లు అవసరం అవుతుందని చెప్పారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకూ, ఆర్థిక శాఖకూ సూచనలు చేయాలని కోరారు.
భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూసేకరణ, పునరావాస పనులకు కాగల ఖర్చును భర్తీ చేయాలనీ, 200506తో పోల్చితే 2017-18 నాటికి ప్రాజెక్టు ప్రాంతం నుంచి తరలించవలసిన కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి తెలియజేశారు. తరలించవలసిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కు పెరిగిందని తెలియజేశారు. దీనివల్ల పునరావాసం, సహాయం పద్దు కింద ఖర్చు పెరిగిందని వివరించారు. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో ఇంకా రూ. 1,779 కోట్లు భర్తీ చేయవలసి ఉన్నదని ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యమైన కొద్దీ ఖర్చు పెరుగుతూ ఉంటుందనీ, ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించాలనీ అమిత్ షాను జగన్ మోహన్ రెడ్డి కోరారు.
కోవిడ్ మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రికి వివరించారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణకూ, వారి ఉపాధిని కాపాడటానికీ ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. వివిధ పథకాలూ, కార్యాచరణ ద్వారా ప్రజలను కోవిడ్ మహమ్మారి నుంచి రక్షించేందుకు ఏమేమి చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అభ్యర్థనను మరోసారి చేశారు. కోవిడ్ దృష్ట్యా అదనపు రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అనుమతించిందనీ, దీనికి అవసరమైన యోగ్యతాపత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ జారీ చేయవలసి ఉన్నదనీ, ఆ పనిని త్వరగా పూర్తి చేయాలనీ అమిత్ షాకు జగన్ చెప్పారు.
జీఎస్ టీ వసూళ్ళ నుంచి రాష్ట్రానికి రావలసిన బకాయిల మొత్తం రూ. 4,308.46 కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని హోంమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రావలసిన రూ. 1111.53 కోట్ల బకాయిలను కూడా త్వరగా ఇప్పించాలని అభ్యర్థించారు. 15వ ఆర్థిక సంఘం బకాయిలు రూ. 1,954.5 కోట్లు చెల్లించేలా చూడాలని కోరారు.
Also Read : మంగళవారం రాత్రి అమిత్ షాతో జగన్ భేటీ
రాష్ట్రంలో ఆరోగ్యరంగాన్ని పటిష్ఠం చేయడంలో భాగంగా కొత్తగా 16 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని తలపెట్టామనీ, ఇందుకు అనుమతులు కోరుతూ అభ్యర్థనలు పంపామనీ, అవి పెండింగ్ లో ఉన్నాయనీ అమిత్ షా కు జగన్ గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం కింద చెల్లించవలసి ఉన్న రూ. 3,801.98 కోట్లను సత్వరం విడుదల చేయించాలని కూడా విన్నవించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు, బాలికలపై నేరాలు తగ్గించాలన్న సంకల్పంతో దిశను ఏర్పాటు చేశామనీ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లును సత్వరం ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలనీ కోరారు.
ఇలాగే ఇతర పెండింగ్ విషయాలు చర్చించినట్టు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. నిజానికి ఇందులో షాకు సంబంధించిన అంశాలు ఏమీ లేవు. ఆర్థిక మంత్రికీ, విద్యుత్ మంత్రికీ అమిత్ షా ప్రత్యేకంగా చెప్పేదంటూ ఏమీ ఉండదు. వాస్తవానికి అమిత్ షా, జగన్ లు ఏమి మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు. ఈ సారి జగన్ వెంట విజయసాయి రెడ్డి సైతం లేరు. జగన్, షా ఇద్దరే మాట్లాడుకున్నారు. దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితిని, ఒక దేశం-ఒక ఎన్నిక విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి నరేంద్రమోదీ ప్రభుత్వం చూపుతున్న చొరవను బట్టి ఎవరికి వారు జగన్, అమిత్ షాలు ఏమి మాట్లాడుకున్నారో ఊహించుకోవలసిందే.