నివర్ తుపాను తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని, నెల్లూరు జిల్లాలో పెన్నాలో ప్రవాహం ఉండొచ్చని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తెలిపారు. సోమశిల ఇప్పటికే నిండినందున ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని వారు సీఎం జగన్మోహనరెడ్డికి వివరించారు. తుపాను ప్రభావంపై సీఎం అధికారులతో సమీక్షించారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడులో, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు మొదలయ్యాయని వివరించారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి తెలిపారు.
వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలు కారణంగా బాగా నష్టపోయినవారికి సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాకుతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు.
ఇలా ఉండగా ఈ తుపాన్ ప్రభావంతో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయవచ్చని, ప్రకాశం సహా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి తేలిక పాటి వర్షాలు పడవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.