- లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీఎం జగన్
- ఈ నెల 28 వరకు స్వామి వారి కల్యాణోత్సవాలు
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం (ఫిబ్రవరి 19) ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్‌కు చేరుకున్న సీఎం అక్కడ నుంచి శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని ఆయన ప్రారంభించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.
Also Read: జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ
కొత్త హంగులతో సిద్ధం చేసిన రథం:
ఈనెల 28 వరకు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. గతేడాది సెప్టెంబరు 5న అంతర్వేదిలో స్వామివారి ఊరేగింపు రథం దగ్ధమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షల రూపాయలతో 41 అడుగుల ఎత్తైన చేయించిన కొత్త రథాన్ని సీఎం ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదిద్దుకున్న నూతన రథానికి మరిన్ని హంగులు జోడించి రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.