- అపూర్వ విన్యాసం
- జగన్ సాహసోపేతమైన నిర్ణయం
- సామాజిక సమీకరణాలకు పెద్ద పీట
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడింది. మంత్రివర్గంలో మార్పులుచేర్పులు జరగడం కొత్త విషయం కాదు కానీ, ఈ తరహా నిర్మాణం చరిత్రలో ఇదే తొలిసారి. దీనినొక సంచలన ఘట్టంగా దేశం చూస్తోంది. ఈ నెల 11 వ తేదీన కొత్తమంత్రులు వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో, గురువారం నాడు మంత్రులంతా తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు. వైసీపి అధికారంలోకి వచ్చి, మంత్రివర్గాన్ని రూపకల్పన చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఈ విషయాన్ని అందరికీ వెల్లడించారు. రెండున్నర సంవత్సరాల తర్వాత పునఃవ్యవస్థీకరణ ఉంటుందని, తద్వారా పదవీకాలం రెండున్నర ఏళ్ళు మాత్రమే ఉంటుందని తెలిపారు. శాఖలు నిర్వహించిన తీరును కూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. నిర్ణయాన్ని అమలుచేయడంలో, కరోనా కారణంగా అనుకున్నదానికంటే కాస్త ఆలస్యమైంది. ఒకవిధంగా చెప్పాలంటే అప్పట్లోనే అందరినీ మానసికంగా సిద్ధంగా ఉండాలని నేరుగా సంకేతం ఇచ్చారు. ఇప్పుడు ఆ ముహూర్తం వచ్చేసింది.
మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని తొలి విడతలో కేబినెట్ లో అవకాశం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తాజాగా తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో వీరందరి సేవలను సద్వినియోగం చేసుకుంటామని వివరించారు. భవిష్యత్తులో కూడా ఎవ్వరికీ గౌరవం తగ్గదని, పార్టీ కోసం పనిచేసినవాళ్లు మళ్ళీ మంత్రులుగా వస్తారని జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకూ మంత్రివర్గంలో పనిచేసిన వారంతా మంచివారని కితాబు ఇచ్చారు. వీరిలో కొందరు మంత్రులుగా కొనసాగుతారని కూడా తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళామనే సంతృప్తి మాలో ఉందని మంత్రులు స్పందించారు. మిగిలిన రెండేళ్ల పాటు పార్టీని పటిష్ఠం చేయడం కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రికి వీరంతా మాట కూడా ఇచ్చారు. లోపల ఎలా ఉన్నా, పైకి మాత్రం అందరూ సంయమనంతోనే మాట్లాడారు. వై ఎస్ జగన్ పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
“ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అనందంగా ఆమోదించారు. ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తాం. 2024 ఎన్నికల్లో మళ్ళీ వై ఎస్ ఆర్ సీ పీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం”- ఇవీ… మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యలు. కొడాలి నాని మొదలైన మిగిలిన మంత్రులు కూడా ఇదే తీరున స్పందించారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు, కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే… సామాజిక సమీకరణాల కారణంగా పాత మంత్రుల్లో ఐదారుగురు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరిత్రను గమనిస్తే ఈ తరహా నిర్ణయాన్ని ఏ ముఖ్యమంత్రి ఇంతవరకూ తీసుకోలేదు, ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయమని, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని రాజనీతిశాస్త్ర పండితులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి బలం, బలహీనత రెండూ వై ఎస్ జగన్ కాబట్టి, రేపటి ఎన్నికల్లో ఎటువంటి దుష్ఫలితాలు ఉండకపోవచ్చని, నిన్నటి ఎన్నికల్లో అద్వితీయమైన మెజారిటీతో వై సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఆ ఘనత పూర్తిగా ఆ పార్టీ అధినేత జగన్ కే చెందుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలోని నేతల్లో ఎక్కువమంది ఇదే అభిప్రాయంలో ఉన్నారని, మళ్ళీ అధికారంలోకి వస్తే, మళ్ళీ పదవీ అవకాశాలు వస్తాయనే భరోసా వారిలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉన్న మంత్రివర్గంలో సీనియర్లతో పాటు జూనియర్లు కూడా ఉన్నారు. శాఖాపరంగా, నియోజకవర్గ పరంగా ఒక్కొక్కరి పనితీరు, ప్రవర్తన, ప్రభావం సమీక్షస్తే మిశ్రమమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వారిలో కొత్తవారు, పాతవారు, పార్టీకి, అధినేతకు వీరవిధేయులు ఉన్నారు, తటస్థులు కూడా ఉన్నారు. ఆ మాటకు వస్తే అత్యంత విధేయులకు, అనుభవజ్నుల్లో అందరికీ తొలివిడతలో మంత్రిపదవులు దక్కలేదు. తొలిసారిగా మంత్రివర్గ కూర్పులో, అనేక అంశాలను బేరీజు వేసుకొని నియామకాలు జరిపారు. రేపు కూడా అనేక కోణాలను దృష్టిలో పెట్టుకొనే విస్తరణ ఉంటుందని భావించాలి. నేడు మొత్తంగా 24 మంది మంత్రులు రాజీనామా చేశారు.
చట్టసభల నియమనిబంధనలకు అనుగుణంగానే సంఖ్య ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న నిర్ణయం వల్ల పార్టీలో ఎక్కువమందికి మంత్రిపదవిని అనుభవించే అవకాశం దక్కిందని చెప్పుకోవాలి. కాకపోతే, పదవీకాలం మూడేళ్ళ లోపే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో, కొంతకాలం పాటు కొందరికి సంతృప్తి,కొందరికి అసంతృప్తులు ఉంటాయన్నది సహజం. గతంలో తమిళనాడులో,కామరాజు నాడార్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నపుడు వినూత్నమైన ఆలోచన చేశారు. సీనియర్ మంత్రులను పదవి నుంచి తప్పించి,పార్టీకి విశేషమైన సేవలు చేయిస్తే… పార్టీ మరింత బలపడుతుందని అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రుకు సూచించారు.
కామరాజ్ నాడార్ సూచనకు నెహ్రు అంగీకారం తెలిపారు. అప్పుడు మంచి ఫలితాలే వచ్చాయి. అది కాంగ్రెస్ పార్టీ. నెహ్రు, ఇందిరాగాంధీతో పాటు ఆ పార్టీకి కూడా కామరాజ్ వీరవిధేయుడు. కింగ్ మేకర్ అనే పేరు కూడా తెచ్చుకున్నారు.1989లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంత్రివర్గం మొత్తాన్ని బర్తరఫ్ చేసి అంతా కొత్తవారిని తీసుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. కాకపోతే, ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఎన్టీఆర్ ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. కామరాజ్ నాడార్,ఎన్టీఆర్ కాలపు పరిస్థితులు వేరు.ఇప్పటి తీరుతెన్నులు వేరు. ఆ సందర్భాలను నేటితో పోల్చలేం.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్ర ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. రేపటి ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని తలపండిన పాత్రికేయలు కూడా వ్యాఖ్యనం చేస్తున్నారు. ప్రజల్లో,పార్టీలో విశ్వాసాన్ని కాపాడుకున్నంత కాలం ఏ నేతకు,ఏ పార్టీకీ ఢోకా ఉండదు.