- టీడీపీ మాజీలు, అసంతృప్త నేతలకు గాలం
- పార్టీ బలోపేతానికి బీజేపీ భారీ స్కెచ్
- పవన్ మద్దతుతోనే బీజేపీ వ్యూహరచన
టీడీపీ మాజీ మంత్రులు, జిల్లాల్లో ఉన్న ప్రముఖ నేతలపై బీజేపీ దృష్టిసారించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని కాపునేతలను పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ముందుగా టీడీపీలోని కాపునేతలను బీజేపీలో చేర్చుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం జనసేనతో జట్టుకట్టిన బీజేపీ రాష్ట్రంలో కాపులను దగ్గరకు తీసుకుని రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. దీంతో కుటుంబ రాజకీయాలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. టీడీపీ మాజీలతో పాటు, ఆ పార్టీలోని అసంతృప్త నేతలతో సోము వీర్రాజు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీ లోని అసంతృప్త నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రథయాత్ర
ముద్రగడతో భేటీ అయిన సోము వీర్రాజు:
ఇప్పటికే పలువురు నేతలతో చర్చలు జరుపుతున్న సోము వీర్రాజు ఈ రోజు (జనవరి 16) కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు కాపు ఉద్యమాన్ని నడిపించిన ముద్రగడ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోము భేటీ తరువాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని కాపు నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. టీడీపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పడాల అరుణ, ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావులతో సోము వీర్రాజు చర్చలు జరిపినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏపీ టీడీపీ బాధ్యతలు అచ్చెన్నాయుడికి కట్టబెట్టినప్పటినుంచి కళా వెంకటరావు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: రణరంగం రామతీర్థం
కాపులకు బీజేపీ ప్రాతినిథ్యం వహించనుందా?
ఏపీలో రాజకీయాలు అసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో బలపడేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఆలయాల దాడుల అంశం కలిసొచ్చినట్లుగానే కనిపిస్తోంది. సోము వీర్రాజు ముందుగా కాపు నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నించడానికి బలమైన కారణం లేకపోలేదు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి టీడీపీ, రెడ్డి సామాజిక వర్గానికి వైసీపీ ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. రాష్ట్రంలో కాపులకు బీజేపీ ప్రాతినిథ్యం వహించేందుకు సోము ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.
సోము వీర్రాజుకు పవన్ మద్దతు:
గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జనసేన ఉన్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైసీపీవైపు ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నాయి. దీంతో కాపులు బీజేపీలో చేరితే న్యాయం చేస్తామని సోము వీర్రాజు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలోని మహిళానేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే సాదినేని యామినిని పార్టీలో చేర్చుకున్న బీజేపీ సినీనటి వాణీ విశ్వనాథ్ ను పార్టీలోకి అహ్వానించినట్లు సమాచారం. త్వరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీజేపీని బలోపేతం చేసి వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాలని బీజేపీ పావులు కదుపుతోంది.
ఇదీ చదవండి: ఆలయాల దాడులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం