• ఉత్తర్వులిచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
• వ్యవసాయ భూములపై మాత్రం ఆంక్షలు
• విద్యా, వైద్య సంస్థలకు మినహాయింపులు
• కశ్మీర్ ని అమ్మకానికి పెట్టారు: ఒమర్, మహబూబా
జమ్ము కశ్మీర్, లద్దాక్ లలో దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు భూములను కొనుగోలు చేయడం, ఇల్లు నిర్మించుకుని శాశ్వతంగా నివసించ వచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన భూ చట్టాల నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు జమ్ము-కశ్మీర్ అభివృద్ధి చట్టం 17 వ సెక్షన్ లో స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకుడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. జమ్ము-కశ్మీర్ లో శాశ్వత నివాసం ఉన్న వారే అక్కడ భూమి కొనుగోలు చేయాలని గతంలో ఉన్న నిబంధనను హోం మంత్రిత్వ శాఖ తొలగించింది. వ్యవసాయ భూమిని సాగు చేసే వారు మాత్రం కొనుగోలు చేయాలని జమ్ము-కశ్మీర్ లెఫ్ట్ నెంట్ జనరల్ మనోజ్ సిన్హా వెల్లడించారు. విద్య వైద్య సంస్థల ఏర్పాటుకు సంబంధించి వ్యవసాయ భూములను సాగు చేయని వారు సైతం కొనుగోలుకు మినహాయింపులు ఇచ్చారు. జమ్ము-కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 5 న రద్దు చేసింది. అనంతరం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడి చట్టాల్లో కీలక మార్పులు చేస్తోంది.
మండిపడుతున్న నేతలు
మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పై ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ లు మండిపడ్డారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కశ్మీర్ ను అమ్మకానికి పెట్టారని దీనివల్ల పేదలు నష్ట పోతారని ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ ను దోచుకోవడానికి రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం ఇపుడు కశ్మీర్ ను అమ్మకానికి పెట్టిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై అందరూ ఒకటై పోరాటం చేయాలని ముఫ్తీ పిలుపునిచ్చారు.