పాతికేళ్ళ అక్షరజ్వాల, అంటరాని వసంతం!
(అట్టడుగు మహిళ ధిక్కార విస్ఫోటనం)
మహిళా దినోత్సవం పేరిట అనేకానేక తతంగాలు జరుగుతున్న వేళ మీకో మహిళ కథ పరిచయం చేయాలి. “నా బిడ్డ వో ఆచరణ” అని తలెత్తి చెప్పగల యోధురాలి మాటల్లోనే ఆమె కథ వినాలి. తెలుగు సాహిత్యానికి, సమాజానికి ఆమె చిరపరిచిత వ్యక్తే అయినా ఒక పాత్రగా ఆమెకు 25 ఏళ్ళు. ఆమె ఈ దేశంలోని వేలాదిమంది అణగారిన బడుగు వర్గాలకి ప్రతీక. ఆమె పేరు రూతు. భర్త పేరు రూబేను !
“క్రీస్తు నా విశ్వాసం. పోరాటం నా అవసరం. శతాబ్దాల సంఘర్షణకి ప్రతిరూపం నా బిడ్డ. ఓ మాలాడికి, మాదిగాడికి అది అలంకారం కాదు. అది ఆదర్శం కాదు. అవసరం. అంటరానివాడిగ పుట్టాను. సెంటు భూమి లేనివాడిగా పుట్టాను. విసిరేయబడ్డాను. వెలివేయ బడ్డాను. అన్నిటికీ నా బిడ్డ జవాబులు వెతికి ముందుంచాడు..”
యిమ్మానుయేలు కోసం తండ్రి రూబేను ఒక పోలీసు సి. ఐ. తో అన్న మాటలివి. రూబేను చర్చి పాస్టరు. చనిపోయిన కొడుకు కోసం ఏమన్నాడు ? “నాకు దేవుని బిడ్డల్ని పంపటం మాత్రమే తెలుసు. జనం బిడ్డల్ని ఎట్టా పంపాలో నాకు తెలీదు.” జనం బిడ్డ , రూతు బిడ్డ జనం బిడ్డ ఎట్టా అయ్యాడు? మరి ఆ జనం బిడ్డకి ఏమైంది?
“అనుకుంటాంగాని భూమ్మీద త్యాగానికి ఉన్న విలువ దేనికీ లేదు. అది ఎంత చిన్నదైనా కావచ్చు. దాన్ని ఎంత చిన్న వాడైనా చెయ్యొచ్చు. దాని శక్తి దానిదే. మనుషుల గుండెల్లో గూడుకట్టుకొని, వాళ్ళ మాటల్లో మరణం లేకుండానే ఉంటుంది..”
Also read: కరపత్రాల ఊసులు – కార్యాచరణ బాసలు
అక్షరాల్లో రచయిత రాసిన ఈ మాటలు అంటరాని వసంతానికి సరిగ్గా సరిపోతాయి. జి. కళ్యాణ రావు రాసిన ఈ నవల మొట్టమొదట 1998 లో అరుణతార లో వచ్చింది. తర్వాత 2000లో పుస్తకంగా విరసం ప్రచురించింది. ఎలాంటి పుస్తకం అది! ఎంత గొప్ప జీవిత చిత్రమది! ఎడతెగని పోరాటాల చరిత్ర, ఎల్లల్లేని త్యాగాల చిత్రణ! ఈ దేశంలో శతాబ్ధాలుగా శకలాలుగా బతుకీడుస్తున్న పీడిత ప్రజల ధిక్కార స్వరం. తరతరాల అణిచివేతకి వ్యతిరేకంగా బిగించిన శ్రామికవర్గాల ఉక్కు పిడికిలి. కష్టాలు, కన్నీళ్ళు, కళలు, కవిత్వం, యుద్దం..వెరసి ఇంత గొప్ప అద్భుతమైన నవలగా, కాదు కాదు… వాస్తవంగా తెలుగు సాహిత్యంలో వెల్లివిరిసింది !
“ఆకలి, అంటరానితనం, దోపిడీ, దౌర్జన్యం ఎల్లన్న మొదలు యిమ్మానుయేలు దాకా. సుభద్ర మొదలు మేరీ సువార్త దాకా. చూడాల్సిన పదాలు. కారణాలు వెతకాల్సిన పదాలు…”
Also read: ఏకవ్యక్తి సైన్యం: మేకా సత్యనారాయణశాస్త్రి
వెతికితే ఎలాగుంటుందో ఈ అక్షరాల్లో జీవం పోసుకున్న ప్రాణాలు చెబుతాయ్. వెలివేయ బడ్డ కళాకారుడి గుండె లోతుల్లో మండిన సమిష్టి దుఃఖం చెపుతుంది. ఒక జీవిత కాలపు అణిచివేతకు గురై తిరగబడ్డ వేదనా భరిత ఆవేశం చెబుతుంది. ఎన్నెలపిట్ట చెబుతుంది, అంటరానివసంతం చెబుతుంది!
మరి, వినాలంటే ఏం చెయ్యాలి ? గొప్పకు పోకుండా, భూమికి చెవులాన్చాలి. మొక్క అంటు కట్టినట్లు జాగ్రత్తగా పోరాటాన్ని ప్రేమతో వెతకాలి. అప్పుడది గొప్పగా ఉంటుంది. చాలా ఉన్నతంగా ఉంటుంది. అప్పటిదాకా చూడని చరిత్రనూ, భవిష్యత్తునూ ఒకేసారి చూపిస్తుంది. ఆక్రందనలు వినిపిస్తూనే ఆశాదీపాన్ని వెలిగిస్తుంది. ఆ వెలుతురులో మనక్కూడా రూతు లాగానే ఆకాశంలో ఒంటరి చుక్కొక్కటే కనిపిస్తుంది. మళ్ళీ, ఈ రూతు ఎవరంటారా?
“మొదటగా మీకు రూతుని పరిచయం చేస్తాను. తర్వాత కథలోకి వెళ్తాను. ఆమెని రచయిత్రిగా ఎరిగిన వాళ్ళు మా అభిమాన రచయిత్రిని మాకు కొత్తగా పరిచయం చేయాల్సిన సాహసం చెయొద్దనచ్చు. నిజమే. ఆమె బోలెడు కథలు రాసింది. కవితలు రాసింది. అయితే నేను యిప్పుడు పరిచయం చేస్తోంది రచయిత్రి రూతుని, ఆమె రచనల్ని కాదు. కేవలం రూతుని. నాకు తెలిసిన రూతుని.”
Also read: తత్వ విచారణ – తర్క వివేచన
వసంతం ప్రారంభ వాక్యాలివి. మీకూ రూతును పరిచయం చేసుకోవాలనుందా? రూతు కథ తెలుసుకోవాలని ఉందా? 25 ఏళ్ళుగా తెలుగు సాహిత్యంలో అద్వితీయ మైన ప్రజాగొంతుకల్ని వాటి నోటితోనే అనుభూతి చెందాల్నుందా? ఇంకెందుకు ఆలస్యం, అంటరాని వసంతం వెంటనే చదివేయండి మరి! మర్చేపోయాను, ఇది రూతు కథ మాత్రమే!! మేరీ సువార్త కథ త్వరలోనే వస్తుందని ఆశిద్దాం!!!
(ఆసక్తి ఉన్న వారు నా నంబర్ 9032094492 కి వాట్సప్ రిక్వెస్ట్ పెడితే సాఫ్ట్ కాపీ పంప గలను. అనుకుంటాంగానీ ఏదో ఓసారి చదివి పక్కన పడేసే పుస్తకం కాదిది. అనేక రాత్రుళ్ళు మనల్ని వెంటాడేది, అసంఖ్యాక ఆలోచనల్ని తట్టిలేపేది. అపరిమితమైన అలజడుల్ని పరిచయం చేసేది. రెండు దశాబ్దాలుగా నా జీవితంలో, కలల్లో భాగమైన ఈ కల్లోల వసంతం తెలుగు సాహిత్యంలో పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక చర్చా కార్యక్రమమో, ఒక చిన్న సమాలోచనో పెట్టాలని ఉంది. అంటరాని వసంతం పై వచ్చిన వ్యాసాలు కనీసం కొన్నింటి నయినా సంకలనంగా కూర్చాలనుంది. నా అసహాయత్వానికి గుర్తుగా పాతికేళ్ళు నిండిన ‘అంటరాని వసంతం’ గురించి, మహిళా దినోత్సవం సందర్భంగా రూతు గురించి, ఇప్పటికిలా ఈ చిన్న రైటప్.)
Also read: మానవాళి వికాసమే విజ్ఞాన మార్గం…రేవతి సైన్స్ ఫౌండేషన్ పురస్కారం
– గౌరవ్