తెలుగు వారి ఆదరణకు నోచుకున్న అత్యంత గొప్ప నటులలో అక్కినేని కూడా ఒకరు. అక్కినేని అంటేనే క్రమశిక్షణ. వృత్తి పట్ల నిబద్ధత. ఆ నిబద్దతే ఓ సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన అక్కినేనిని గొప్ప నటుడ్ని చేసింది. దేశంతో పాటు తెలుగు చిత్ర సీమ గర్వపడేంత గొప్ప స్థానంలో కూర్చోబెట్టింది.
Also read: జాతి గర్వించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
క్రమశిక్షణకు, నిబద్ధతకు, పట్టుదలకు చిరునామా అక్కినేని. రాశి కన్నా వాసే ముఖ్యమని నమ్మి, ఆ దిశలోనే తన అడుగులు వేసిన నట సమ్రాట్ ఆయన. సినీ వినీలాకాశంలో ఓ ధృవతారలా వెలిగి, తెలుగు చిత్ర సీమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేసిన మహానటుడాయన. అక్కినేని నాగేశ్వరరావు అంటే తరతరాలకు తరగని గని. ఆయన చేసిన ప్రతి పాత్ర నిత్య జీవితంలో మనం ఎక్కడో చూసినట్టుగా, మన కళ్ళముందే తిరుగుతున్నట్టుగా అగుపిస్తుంది. అందువల్లే అక్కినేని ఓ మరుపురాని నటుడిగా తెలుగు ప్రేక్షకులలో మిగిలిపోయారు.
స్త్రీపాత్రతో నటజీవితం ప్రారంభం
ప్రపంచంలోనే ఓ గొప్ప నటుడిగా పేర్గాంచిన అక్కినేని సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1923, సెపెంబర్ 20న ఆయన ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పున్నమ్మ, అక్కినేని వెంకటరత్నం దంపతులు. పేద కుటుంబంలో పుట్టినప్పటికీ, అనేక కష్టసుఖాలకోర్చి, పట్టుదలతో రాణించి పుట్టిన గడ్డ గర్వపడేలా ఎదిగారు. నటన మీదున్న ఆసక్తితో నాటకాల్లో స్త్రీ పాత్రలు పోషించి, జన హృదయాలను మెప్పించారు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య తాను నిర్మిస్తున్న ‘ధర్మపత్ని’ చిత్రంలో అక్కినేనికి మొదటి సారిగా అవకాశం ఇచ్చారు. 1941 లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ద్వారా ఆయన బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన “సీతారామ జననం” సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత సినీరంగంలో ఎన్నో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో తనదైన హావభావాలు, నటనతో నట సామ్రాట్‌గా చరిత్రలో నిలిచిపోయారు.
Also read: వివేకానందుని మాటలు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు
రాశి కంటే వాసికి ప్రాధాన్యం
రాశి కన్నా వాసి మిన్న అని నమ్మిన వ్యక్తి అక్కినేని. ఆయన తన ప్రతి చిత్రం ఏదో ఒక సామాజిక అంశంతో, నేపధ్యంతో ముడిపడి ఉంటుంది. అలా ఉండేట్లు అక్కినేని జాగ్రత్తలు తీసుకునేవారు. కుటుంబ సంబంధాలు, ఆత్మీయతా, అనురాగాలు, మానవ విలువలకు ప్రాధాన్యం ఉండేలా చూసుకునే వారు. అక్కినేని సినీ ప్రస్థానంలో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఎన్నో. అలాంటి చిత్రాలలో ‘దేవదాసు’ అగ్రభాగాన నిలుస్తుంది. 1953 లో ‘దేవదాసు’ చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ‘కీలుగుర్రం’ చిత్రంలో బాలరాజుగా అద్భుత నటనతో తొలి జానపద హీరోగా శభాష్ అనిపించుకున్నారు.
ఆయన నటించిన ‘బాలరాజు,’ ‘రోజులు మారాయి,’ ‘నమ్మినబంటు,’ ‘మిస్సమ్మ,’ ‘చక్రపాణి,’ ‘ప్రేమించుచూడు,’ ‘లైలామజ్ను,’ ‘అనార్కలి (1955),’ ‘బాటసారి,’ ‘ప్రేమనగర్,’ ‘సంసారం,’ ‘బ్రతుకు తెరువు,’ ‘ఆరాధన,’ ‘దొంగ రాముడు,’ ‘డాక్టర్ చక్రవర్తి,’ ‘అర్థాంగి,’ ‘మాంగల్యబలం,’ ‘ఇల్లరికం,’ ‘శాంతి నివాసం,’ ‘వెలుగు నీడలు,’ ‘దసరా బుల్లోడు,’ ‘భార్యాభర్తలు,’ ‘ధర్మదాత,’ ‘బాటసారి,’ ‘కాలేజి బుల్లోడు,’ ‘ప్రేమాభిషేకం,’ ‘మేఘసందేశం,’ ‘సీతారామయ్య గారి మనమరాలు’ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాగే ‘మహాకవి కాళిదాసు,’ ‘భక్త జయదేవ,’ ‘అమరశిల్పి జక్కన,’ ‘విప్రనారాయణ,’ ‘భక్త తుకారాం’ చిత్రాలను చేసి వైవిధ్యమైన పాత్రలకు ఆయన ప్రాణ ప్రతిష్ట చేశారు.
Also read: అద్భుత చిత్రాల సృష్టికర్త… విక్టరీ మధుసూదనరావు
రాకార్డు సృష్టించిన దాసరి ప్రేమాభిషేకం
అలాగే, ‘రోజులు మారాయి,’ ‘అనార్కలి,’ ‘దసరాబుల్లోడు,’ ‘ప్రేమ్ నగర్,’ ‘ప్రేమాభిషేకం’ ఇలా ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ప్రధానంగా పూర్తి రంగుల హంగులతో వచ్చిన ‘దసరా బుల్లోడు,’ ‘ప్రేమ్‌నగర్’ చిత్రాలు ఆ కాలంలో పెద్ద సంచనలనం సృష్టించాయి. వీటితోపాటు అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మరెన్నో చిత్రాలు వంద రోజుల పండుగను జరుపుకున్నాయి. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రం అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా రికార్డులకెక్కింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం ‘దసరాబుల్లోడు.’ 1971లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు రికార్డులను తిరగ రాసింది.
నటన పరంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని రూపొందించుకున్న అక్కినేని , సీన్ ని పండించడం కోసం విపరీతంగా శ్రమించేవారు. అలాగే తెలుగు చిత్రాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని నవరాత్రి చిత్రంలో తొమ్మిది పాత్రలను పోషించారు. ఆయన నటనా చాతుర్యానికి నిదర్శనంగా ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి ఆయన తొలి నందిని అందుకున్నారు. దీంతోపాటు ‘అంతస్తులు,’ స్వీయ నిర్మాణంలో వచ్చిన ‘సుడిగుండాలు’ చిత్రాలకు కూడా నంది అవార్డులు దక్కాయి. ‘మహాకవి కాళిదాసు’గా అద్భుత నటనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కాళిదాస సమ్మాన్’ బిరుదుతో ఆయనను సత్కరించింది. అలాగే ‘మేఘసందేశం’ చిత్రం 18 అవార్డుల తోపాటు, మరో బంగారు నందిని దక్కించుకోవడం విశేషం. మలిదశలో ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో ‘ఫిలింఫేర్ అవార్డు’ సొంతం చేసుకుని శభాష్ అనిపించుకున్నారు.
Also read: పాత్రలకు ప్రాణం పోసిన మహానటి సావిత్రి
పద్మశ్రీ, పద్మవిభూషణ్ అందుకున్న తొలి తెలుగు హీరో
అలాగే, 1968లో పద్మశ్రీ అందుకున్న తొలిహీరో ఆయనే. అంతేకాదు 1988లో గౌరవ పద్మభూషణ్ అందుకున్న తొలి తెలుగు హీరో కూడా ఆయనే. 1990లో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు సొంతం చేసుకున్న ఏకైక దక్షిణాది నటుడిగా ఆయన రికార్డులకెక్కారు. 1989 లో రఘుపతి వెంకయ్య, 1996లో ఎన్టీఆర్ అవార్డు, 2011లో పద్మ విభూషణ్ పురస్కారాలు కూడా ఆయన నటనకు అసలు సిసలైన నిదర్శనాలు. భారత తపాలా శాఖ 2018 లో అక్కినేని 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ ను విడుదల చేసింది. వీటితో పాటు వందలాది పురస్కారాలు ఆయనను వరించాయి. 1975 లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి. అన్నపూర్ణ బ్యానర్ లో అనేక చిత్రాలు నిర్మించారు. అక్కినేని చివరగా నటించిన చిత్రం ‘మనం.’ తెలుగు, తమిళ రంగాన 75 సంవత్సరాల పాటు 256 చిత్రాలలో నటించి భారత దేశం గర్వించదగిన నటుడిగా కీర్తి బావుటా ఎగురువేసిన గొప్ప నటుడాయన.
తన చివరి శ్వాస వరకు సినిమాల కోసమే పరిశ్రమించిన ఆయన , 91 సంవత్సరాల వయసులో 2014, జనవరి 22 న తుది శ్వాస విడిచారు. తాను నటించిన ప్రతి చిత్రానికి ప్రాణం పోసిన గొప్ప నటుడు అక్కినేని. ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. తెలుగు చిత్ర సీమ బతికున్నంత కాలం ఆయన అమరజీవిగా ప్రేక్షక హృదయాలలో సజీవంగా నిలిచే ఉంటారు.
Also read: తెలుగు సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బాపు బొమ్మ
(జనవరి 22 అక్కినేని వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం)
దాసరి దుర్గా ప్రసాద్
మొబైల్ : 7794096169