- ఖమ్మంలో భారీ బహిరంగ సభ, పార్టీ ప్రకటన
- లక్ష మంది అభిమానుల రాక
- సభ ఏర్పాట్లలో నిమగ్రమైన ముఖ్య నేతలు
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేయడానికి వైఎస్ షర్మిల దాదాపు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 9న ఆమె రాజకీయ పార్టీపై ప్రకటన చేసేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరిగిపోతున్నాయి. ఖమ్మంలో లక్షమంది అభిమానుల మధ్య పార్టీ ఏర్పాటు, అజెండాను ప్రకటించేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అభిమానులతో వరుస భేటీలు నిర్వహిస్తూ అభిప్రాయాలు సేకరిస్తున్న షర్మిల త్వరగా పార్టీ ప్రకటన చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
పార్టీ ప్రకటన తేదీపై ముమ్మర కసరత్తు :
2004 మే 14న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మే 14న షర్మిల పార్టీ ప్రకటన చేస్తారని సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం జరిగింది. మరోవైపు జులై 8న వైఎస్ జయంతి సందర్భంగా ఆ రోజు పార్టీ ప్రకటన ఉంటుందనీ ప్రచారం జరిగింది. అయితే వేసవి కావడంతో పార్టీ ప్రకటన మరింత ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఆయా తేదీలను పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 9న పార్టీని ప్రకటించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఏప్రిల్ 9న పార్టీ ప్రకటన చేయాలన్న నిర్ణయానికి బలమైన కారణం కూడా ఉంది. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన 1500 కిలో మీటర్ల పాదయాత్ర ఏప్రిల్ 9న ముగిసింది. 60 రోజుల పాటు ఆయన చేసిన పాదయాత్ర తో ప్రజల్లో విశేష ఆదరణ లభించింది.
Also Read: సొంత మీడియా ఏర్పాటుకు షర్మిల సన్నాహాలు
సభను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు:
పార్టీ ప్రకటన తేదీ దాదాపు ఖరారు కావడంతో ఖమ్మంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మంది అభిమానులు వస్తారని అంచనావేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సభలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారీ కటౌట్ ను ఏర్పాటు చేయనున్నారు. వైఎస్సార్, విజయమ్మల ఫ్లెక్సీలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాలనుంచి అభిమానులను వస్తారని అంచనావేస్తున్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ ల నుంచి భారీగా వలసలు ?
తెలంగాణలో షర్మిలకు మెల్ల మెల్లగా మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు షర్మిలకు మద్దతునిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వీరంతా షర్మిల పార్టీ ప్రకటించబోయే పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ జానపదాలతో ప్రజల్లోకి వెళ్లనున్న షర్మిల:
షర్మిల పెట్టబోయే పార్టీని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తెలంగాణలో విశేష ప్రాచుర్యం పొందిన జానపదాలను తమ పార్టీకి ఆయువుపట్టులా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. దీంతో ప్రత్యేక ఆకర్షణగా పాటలను కూర్చే పనిలో ఉన్నారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పార్టీ ప్రచార బాధ్యతలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సిన సమాచార సామాగ్రి, పాటలు సోషల్ మీడియా ప్రచారానికి ముందుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ పై షర్మిల విమర్శనాస్త్రాలు తొందరపాటు చర్యా?
మహిళా అధ్యక్షురాలిగా రికార్డులకెక్కనున్న షర్మిల:
తెలంగాణ రాజకీయాల్లో లో షర్మిల పార్టీ ప్రకటనతో రికార్డు సృష్టించనున్నారు. ఓ మహిళానేత ఆధ్వర్యలో పార్టీ ఏర్పాటు కానుండటంతో తెలుగు రాష్ట్రాలలోని వైఎస్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ టీడీపీ పేరుతో పార్టీ ఏర్పాటు చేసినా ఎక్కువకాలం మనుగడ సాగించలేకపోయారు. వైఎస్ కుమార్తెగా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లనుండటం తెలంగాణ రాజకీయాల్లో నూతన శకంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లో ఉన్న రాజకీయ ఉద్ధండులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.