తెలంగాణ పీసీసీ సారథి త్వరలో ఖరారవుతారని సమాచారం. ఈ నెల 9వ తేదీన పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా పీసీసీ కొత్త అధ్యక్షుడి పేరు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఆమె పుట్టిన రోజు కానుక గానే ప్రకటించిన సంగతి తెలిసిందే.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన రాజీనామా అధిష్ఠానానికి అందింది. గోవాలో ఉన్న సోనియా గాంధీ హస్తినకు తిరిగి రాగానే ఆ లేఖను అందచేస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలరావు చెప్పారు. ఆ మర్నాడు హైదరాబాద్ లో నాయకులతో పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ సమావేశమవుతారు. వాస్తవానికి ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడే ప్రకటించినా అదిష్ఠానం పట్టించుకోకుండా కొనసాగించింది.పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడిని మార్చినా ఆయనను కొనసాగించింది. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో ధరావతు కోల్పోవడం,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానాలు మారినా ఆ రెండే నిలుపుకోవడంతో అధ్యక్షుని మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.
రేవంత్ వైపే మొగ్గు:
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి పేరు పీసీసీ నేతగా గట్టిగా వినిపిస్తోంది. మరోవంక సీనియర్ నాయకులు వి. హనుమంతరావు లాంటి వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మధ్యలో వచ్చిన వారికి ఈ కీలక పదవేమిటన్నది వారి ప్రశ్న.కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి కూడా ఈ పదవిపై ఆశపెట్టుకున్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ ఆపరేషన్ చేపట్టబోతోందని, దాని కన్ను మొదటి రేవంత్ మీదే ఉందంటూ ఆయనను కాపాడుకునేందుకుఆయన పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.