ఆకాశవాణిలో నాగసూరీయం – 24
‘‘జూన్ పదహారవ తేది నా పుట్టినరోజు. ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రము పుట్టినరోజు జూన్ పదహారే…’’ అని ఆచంట జానకిరామ్ స్వీయచరిత్ర ‘సాగుతున్న యాత్ర’ ఏడో అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది. 1938 జూన్ 16న దక్షిణాదిలో తొలి ఆల్ ఇండియా రేడియో కేంద్రం మద్రాసులో మొదలైంది. అప్పటికి సంస్థానాధీశులకు మాత్రమే రేడియో కేంద్రాలున్నాయి. కానీ బ్రిటీషు ప్రభుత్వానికి దక్షిణ భారతదేశంలో లేవు.
Also read: రండి చూసొద్దాం… తారామండలం!
అదే సంవత్సరం రెండవ ప్రపంచయుద్ధం మొదలు కావడం కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, అదే సంవత్సరం ప్రాంతీయభాషలలో వార్తల ప్రసారం ఢిల్లీ నుంచి మొదలైందని కూడా తెలుసుకోవాలి. అది అప్పటి వారి రాజకీయ అవసరం! అలా మొదలైన తొలి దక్షిణాది ఆకాశవాణి కేంద్రంలో తొలి తెలుగు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆచంట జానకిరామ్. ఆయన తండ్రి లక్ష్మీపతి పేరుపొందిన ఆయుర్వేద వైద్యులు. ఆరోగ్య యాత్రలు చేయమని గాంధీజీ నుంచి ఆ కాలంలోనే ఆహ్వానం అందుకున్న ప్రముఖులు వారు. జానకిరామ్ సవతితల్లి , లక్ష్మీపతి రెండవభార్య రుక్మిణమ్మ అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో మంత్రిగా చేశారు.
లక్ష్మీపతికి 1903 జూన్ 16న జన్మించిన జానకిరామ్ తొలుత జీవితబీమాలో పనిచేసి, పిమ్మట ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరారు. మద్రాసు కేంద్రం టెస్ట్ ప్రసారాల్లో కూడా వారి గొంతుకతో ప్రారంభపు ప్రకటన ప్రసారమవుతుందని స్వీయచరిత్ర చదివితే తెలుస్తుంది. వారి జన్మదినం మద్రాసు కేంద్రం జన్మదినం ఒకటే కావడం ఇక్కడ విశేషం.
Also read: నింగిని పరికిద్దాం!
తిరుపతిలో ఇలాంటి సందర్భమే…
ఇలాంటి సందర్భం మనకు తిరుపతి ఆకాశవాణిలో తారసపడింది. 1991 ఫిబ్రవరి 1న మొదలైన ఈ కేంద్రం పాతికేళ్ళు పూర్తిచేసుకున్న తర్వాత 2016 ఆగస్టులో నేను బదిలీ మీద అక్కడ చేరాను. తర్వాత బోధపడింది ఈ తేదీల సంగమం! సర్టిఫికెట్ల ప్రకారం నా బర్త్ డే 1961 ఫిబ్రవరి 1. కనుక 2017, 2018 సం॥ తిరుపతి ఆకాశవాణి కేంద్రపు వార్షికోత్సవం సమావేశాలలో నా అధికారిక బర్త్ డే సందడి కలిసిపోయింది. నిజానికి బర్త్ డేల హడావుడి పదేళ్ళ క్రితం దాకా ఈ స్థాయిలో లేదు. కానీ ఫేస్‌బుక్ వచ్చాక, వివరాలు ఐడెంటిటీ కోసం నమోదు చేయాలి కనుక అందరి బర్త్‌డేలు అందరికీ తెలిసిపోతున్నాయి. దాంతో ఫేస్‌బుక్ తద్వారా మొబైల్ ఫోన్‌లో గ్రీటింగుల పర్వం విపరీతంగా పెరిగింది.
సెలవు దుర్లభం
కనుక వీలైతే ఫిబ్రవరి 1 సెలవు పెట్టేవాడిని (మద్రాసులో, అంతకు ముందు ఫేస్బుక్ లేదు కనుక బర్త్ డే పూర్తిగా వ్యక్తిగతంగా ఉండేది కదా) ఫోన్ పలకరింపులు అందుకోవాలని! అయితే తిరుపతిలో నాకు ప్రోగ్రాం హెడ్‌గా, హెడ్ ఆఫ్ ఆఫీసుగా బాధ్యతలుండేవి. సెలవు లభించడం అంత సులువుకాదు. అయితే ఏ నెపంతో జరిగినా పండుగ వాతావరణంలో మనం భాగమైనప్పుడు, అందులో రెండురకాలుగా మనకు ప్రమేయం కలిగి ఉన్నపుడు ఆనందదాయకమే కదా!
Also read: తెలుగు కథానిక శతవార్షిక సందర్భం
2017 సంవత్సరం ఫిబ్రవరి 1న తిరుపతి ఆకాశవాణి కేంద్రం అందరు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశాం. అది కూడా ఆ కేంద్రం రజతోత్సవ సంవత్సరం తర్వాతి సంవత్సరం కనుక, కొంత ఫెస్టివ్ హ్యాంగ్ ఓవర్ అదనంగా క్యాంపస్‌లో మిళితమై అప్పటికే ఉంది. ప్రజల భాషలో కవిత్వం పలికించిన అన్నమయ్య చిత్రపటాన్ని ఆకాశవాణి కేంద్రంలో ప్రసారభారతి ఛైర్మన్‌తో ఆవిష్కరింప చేశాననే తృప్తి ఉంది. ‘మీతో ఆకాశవాణి’ అనే కొత్త కార్యక్రమం కూడా ప్రారంభించాం. మా యువసిబ్బంది నగరంలో గృహ సముదాయాలకు వెళ్ళి చాలా అంశాలకు సంబంధించి అభిప్రాయాలు రికార్డు చేసి, సినిమా పాటలతో కలిపి – శ్రోతల భాగస్వామ్యంతో నడిపే కార్యక్రమమది. ఆ రోజు 2017 ఫిబ్రవరి ఉదయం పని ముగించి, భోజనానికి వెళుతున్న సమయంలో మదనపల్లె నుంచి ఫోన్! ఢిల్లీ నుంచి తెలుగువార్తలు చదివిన తొలి తెలుగు మహిళ జోలెపాళెం మంగమ్మ ఆ రోజే మరణించారని, ఆ విషయం వార్త విభాగానికి పంపమని, రేడియోలో ప్రకటించమని. మంగమ్మగారి మేనల్లుడి ఫోన్ అది! ఈ విషయం బాగా గుర్తుండిపోయింది.
బాధ్యతలు బోధించే రంగస్థలం
ఆకాశవాణి అంటే విద్యాసాంస్కృతిక కేంద్రం, సామాజికంగా, సంస్కారం, బాధ్యతలు బోధించే రంగస్థలం! నేను పనిచేసిన రెండేళ్ళలో తిరుపతి కేంద్రంలో–
– ప్రాంగణం లోపల (బడ్జెట్ వచ్చి) మంచిగా రోడ్లు వేయించాం. ర్యాంప్ కూడా వచ్చి భవనం లుక్ పెరిగింది.
– సిబ్బంది తోడ్పాటుతో ఆవరణ అంతా శుభ్రంచేసి, మంచి చెట్లు, మొక్కలు పెంచాం. 2017లో వేయబడిన టేకు మొక్కలు ఇప్పటి భవనం మించి ఎత్తు ఎదిగి ఉంటాయి. మొత్తానికి పచ్చదనం క్వాలిటీ కూడ పెరిగింది. ఇటీవల తిరుపతి వెళ్ళలేదు.
Also read: కదంబ కార్యక్రమాలకు పునాది
– అధికారుల వివరాలు; ప్రధాని, రాష్ట్రపతి ఫోటోలే కాదు స్వర్ణముఖినది పెద్ద ఛాయాచిత్రం; ఆ జిల్లాకు చెందిన ఏడుకోటల చిత్రాలు; పన్నెండుమంది జిల్లా ప్రముఖుల ఫోటోలు; తలకోన, కపిలతీర్థం జలపాతాల ఫోటోలు భవనం లోపల అలంకరింపచేశాం.
– కార్యక్రమ వివరాలను, విశేషాలను అక్కడి తెలుగు పత్రికల స్థానిక అనుబంధాలు ప్రతిరోజు ప్రచురించేవి. అలాగే మా కార్యక్రమ విశేషాలను ఫేస్‌బుక్‌లో కూడా అందుబాటులో ఉండేలా చేశాం.
– ఆఫీసు ఆవరణలో ఒకసారి, పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మరోసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశాం. మొబైల్‌కు ఆధార్ అనుసంధించే క్యాంప్ మరోసారి కార్యాలయం ఏర్పాటు చేశారు.
ఇది ఏ ఒక్కరి కృషి మాత్రం కాదు. అందరి సమిష్టి కృషి!
Also read: రేడియోకూ, పత్రికలకూ పోలిక ఉందా?
–డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 440732392