ఆకాశవాణిలో నాగసూరీయం – 8
శతవసంత సాహితీ మంజీరాలు; మన తెలుగు; జీవనబింబం; ఆదివాసీ అంతరంగం; తారామణిహారం; నాన్నకు నమస్కారం; శ్రామిక శకటం; తమిళ తెలుగు సొబగు; వినుడు, వినుడు …నాగాథ; విశాఖా… నా విశాఖ; చిత్తూరు జిల్లా జీవనచిత్రం – ఇవి వివిధ ఆకాశవాణి కేంద్రాలలో నా కార్యక్రమాలకు రూపొందించుకున్న పేర్లు! ఇంకా చాలా ఉండవచ్చు, కానీ, పెన్ను తీసుకుని రాయడానికి ఉపక్రమించే ముందు స్ఫురించిన వాటిలో కొన్ని ఇవి!!
పత్రికల్లో, టెలివిజన్ తెర మీద కార్యక్రమం పేరు కనబడే అవకాశం ఉంది, వీలుంటే అక్షరాలకు రంగులు కూడా వేయవచ్చు! కానీ రేడియోలో కేవలం చెవులకు మాత్రమే కనబడుతుంది!! కనుక ఈ పరిమితిని గుర్తించి, కొంత సంగీతాన్ని నేపథ్యంగా మేళవింపచేయవచ్చు…అంతే!
పేరు పెట్టడానికి ఐదు సూత్రాలు
అయితే, ఆ రేడియో మాధ్యమానికి నామకరణం ఎలా? క్రమం తప్పకుండానో, లేదా కొన్ని వారాలపాటు ప్రసారమయ్యే రీతిలో ప్రణాళిక చేసుకున్నప్పుడు ఈ నామకరణం తీరు డిమాండ్ చేసేది ఏమిటి?
అ) రెండు, మూడు పదాలతో ముగిసిపోవాలి.
ఆ) వినడానికి బావుండాలి, చెడు పొరపాటుగా కూడా ధ్వనించకూడదు, స్ఫురించకూడదు.
ఇ) ఇంతవరకు ఆ మాట లేదా పదబంధం వినియోగించి ఉండకూడదు.
ఈ) అందులో ప్రసార కార్యక్రమాల పరిధికి న్యాయం చేసేట్టు ఉండాలి.
ఉ) మొత్తంగా– వినూత్నంగా, ఆకర్షణీయంగా, శ్రోతలకు సులువుగా గుర్తుండిపోయేలా ఉండాలి!
స్థూలంగా ఈ ఐదు అంశాలకు న్యాయం చేకూరిస్తే విజయం సాధించినట్లే! ఇదివరకటి ప్రయోగాల, ప్రయత్నాల తీరు తెన్నుల గురించి, ఆ రంగపు నిష్ణాతుల విజయాల గురించి అవగాహన ఉంటే త్వరగా మంచి ఫలితం వస్తుంది.
తృప్తినిచ్చిన నామకరణం
ఈ రీతిలో నాకు నామకరణం లో కూడా బాగా తృప్తి, ఆనందం కల్గించిన కార్యక్రమం – ‘అన్నమయ్య పదగోపురం’! ఇది 2013 మే నెలలో ఆకాశవాణి కడప కేంద్రంలో మొదలైన విజయవంతమైన కార్యక్రమం. ఇందులో అన్నమయ్య, పదం, గోపురం అనే మూడు మాటలే ఉన్నాయి. అది అన్నమయ్య కీర్తనలకు సంబంధించిన కార్యక్రమం. కనుక మొదటి రెండు పదాలు తప్పని సరి. ఇక, మిగిలిన అవకాశం లేదా పరిమితి మూడోపదం! దీనికి దాదాపు రెండు, మూడు నెలలు తనకలాడానని నేను చెబితే మీరు నమ్మకపోవచ్చు. ఇందులో నా విజయం, సృజన – అనే వాటికి కేవలం ‘గోపురం’ అనే పదమే తార్కాణం! అది ఆ కార్యక్రమపు ‘షేడ్’ను కూడా చెబుతున్నది, అలాగే అన్నమయ్య సృజన, నైపుణ్యం, పాండిత్యాలు కూడా శిఖరప్రాయమని సూచిస్తున్నది.
ఈమాట స్ఫురించిన పిదప, మనసులో స్థిరపరచుకున్న తర్వాత సహృదయ మిత్రులు, ఐఏఎస్ అధికారి డా. కే. వీ. రమణాచారి గారితో ఈ పేరును ఫోన్లో పంచుకున్నప్పుడు వారి అభినందన, మెచ్చుకోలు (తొమ్మిదేళ్ళ అవుతున్నా) నా చెవుల్లో ఇంకా మధురధ్వనులు గా నృత్యం చేస్తున్నాయి!
బదిలీల వల్ల కలిగిన కష్టాలూ, నష్టాలూ, యాతనలూ ఇపుడు మరచిపోయి; కేవలం కలిగిన ప్రయోజనాలు, మిగిలిన మంచి సన్నిహితులు గురించి మాత్రమే గుర్తుపెట్టుకునే తత్వం నాది! కానీ – ఆ సమయంలో అవి కల్గించిన సమస్యలూ ఖేదం తక్కువ కానే కాదు! 2012 అక్టోబరు 8న కడప ఆకాశవాణిలో చేరాను, అదే నెల 31న లగేజితో కడపకు మేమిద్దరం వెళ్ళిపోయాము. చాలాసార్లు నేను కోరుకోని రీతిలో బదిలీలు నడిచాయి. కనుక, వెళ్ళిన తర్వాతే అక్కడి ఆఫీసునూ, వ్యక్తులను అర్థం చేసుకోవడం సాధ్యపడింది ! అలాగే ఆయా రేడియో కేంద్రాల పరిధిలోని కళాకారుల నైపుణ్యాం, ఆ సమాజపు ఆర్తిని, ఆ ప్రాంతపు సాంస్కృతిక అవసరాలను గురించి నా అధ్యయనం అక్కడికి వెళ్లిన తర్వాత మొదలయ్యేది. దీనికి కనీసం మూడు నెలలు పడుతుంది. మరో మూడు నెలల వ్యవధి కార్యక్రమ ప్రణాళికకు అవసరం!
అన్నమయ్య కార్యక్రమానికి సన్నాహాలు
అలా 2013 ఫిబ్రవరి ప్రాంతంలో కడప ప్రాంతానికి కొండ గుర్తుగా భాసించే అన్నమయ్య గురించి కార్యక్రమం చేయాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను. అప్పటికే ఆరుదశాబ్దాలుగా ఆకాశవాణి వివిధ కేంద్రాలు అన్నమయ్య కీర్తనల గురించి చాలా రికార్డింగులు చేశాయి. అయినా విజయపతాకం విజయపతాకమే! ఆలోచన రాగానే మిత్రులు, సహృదయులు డా.కె.వి.రమణాచారిగారికి ఫోన్ చేసి ఆ కార్యక్రమాన్ని టిటిడి ప్రాయోజితం చేయగలరేమో సాయం చేయమని కోరాను. మరోవైపు ప్రతి వారం ఒక అరగంట కార్యక్రమం – అందులో తప్పనిసరిగా అన్నమయ్య కీర్తనలుండాలి – అవే కదా అసలు ఆకర్షణ! ఇంతకుమించి కొంత స్పోకన్ వర్డ్స్ గా విశ్లేషణలుండాలి – అని ప్రణాళిక నా మనోస్థాయిలో సాగుతోంది. ఇంకోవైపు ఈ కార్యక్రమాన్ని చేయడం కాదు, విజయవంతంగా, గౌరవప్రదంగా సాకారం చేయగలిగే సమర్థులెవరెవరున్నారు– అక్కడి సిబ్బందిలో … అనే అన్వేషణ నా మస్తిష్కంలో నడుస్తోంది.
తిరుపతి నుంచి హైవే మీద కడప వైపు వెళ్తే, రాజంపేట దాటిన తర్వాత మనకు కుడివైపున ఎత్తైన అన్నమయ్య విగ్రహం తారసపడుతుంది! దీని ఏర్పాటుకు డా. కె వి రమణాచారి మూల కారణం. సంస్కృతాన్ని దూరం పెట్టి, అచ్చతెలుగులో హాయి అయిన రీతిలో పాటలు రాసినవారు అన్నమయ్య! అంతకు మించి శ్రామిక వృత్తులతో సహా వ్యవసాయం లోని అన్ని ప్రక్రియలూ, పదజాలాలూ ఆయన పాటలలో విరివిగా కనబడతాయి. ఈ రీతిలో చూస్తే అన్నమయ్య ‘బ్రాహ్మణేతరుడు’! ఏ దృష్టితో చూసినా వేమన సరసన నిలబడే మరో ఏకైక గొప్ప తెలుగు మహాకవి అన్నమయ్య!
అబ్బూరి గోపాలకృష్ణ పుస్తకం
నిజానికి, చాలా విషయాలు కొంత మాత్రమే తెలిసిన వ్యక్తిని నేను. అయితే 2004-2008 మధ్య కాలంలో విశాఖపట్నంలో ఉన్నప్పుడు చిత్రకారులు, సాహితీవేత్త అబ్బూరి గోపాలకృష్ణ పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం ‘శ్రీ అన్నమాచార్యులు యక్షగాన సంప్రదాయం’ చాలా జాగ్రత్తగా చదివి ఉన్నాను. గోపాలకృష్ణగారు మహా ప్రతిభావంతులు. అది గొప్ప పుస్తకం. అన్నమయ్య మీద గౌరవం పెరగడానికి నా వరకు ఇదీ నేపథ్యం. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదులలో పనిచేయడం వల్ల అన్నమయ్య గురించి విలువైన, నిజమైన అధ్యయనం చేసిన వారెవరో కొంత అవగాహన ఉంది, వారితో పరిచయమూ ఉంది! అన్నమయ్యలోని ఒక లక్షణాన్ని సోదాహరణంగా, ఒక్కో వ్యక్తితో 13, 14 నిమిషాలు రికార్డు చేసి; వారు ప్రస్తావించే కీర్తనలను కూడా సందర్భోచితంగా మేళవించి ‘అన్నమయ్య పదగోపురం’ కార్యక్రమం రూపొందించాలని నా ప్రణాళిక!
ప్రాణం పోసిన మంజులాదేవి
అప్పటికి బడ్జెట్ కటకట! అన్నమయ్య గురించి పండితులను టెలిఫోన్లో రికార్డు చేయాలని నిర్ణయించుకున్నాం. పారితోషికం లేదు, కనుక ఏ ప్రాంతం వారినైనా రికార్డు చేసే వీలు కలిగింది. పరిమితులు బలవర్ధకాలుగా మారాయి! బ్రాడ్ కాస్ట్ మీద మక్కువా, మంచిగా సంగీత పరిచయం, రేడియోనాటక నిర్మాణంపై పట్టు ఉన్న గొల్లపల్లి మంజులాదేవి ఈ కార్యక్రమం రూపొందించడానికి ఆసక్తి చూపి సిద్ధమయ్యారు. 2020 డిసెంబర్ 6న క్యాన్సర్ తో కనుమూసిన మంజులాదేవి తన గళంతో నేను రాసిన వ్యాఖ్యానపు అక్షరాలకు ప్రాణం పోశారు, ప్రొడ్యూసర్ గా కార్యక్రమాన్ని గొప్పగా రక్తి కట్టించారు!
మహామహుల అభిప్రాయాలు
మహామహులు నేదునూరి కృష్ణమూర్తి, కామిశెట్టి శ్రీనివాసులు, శోభారాజు, బాలకృష్ణ ప్రసాద్, సముద్రాల లక్షణయ్య, రవ్వా శ్రీహరి, గల్లా చలపతి, కె.వి.రమణాచారి, వి.ఎ.కె.రంగారావు, శోభానాయుడు, వేటూరి ఆనందమూర్తి, శలాక రఘునాథ శర్మ, యన్. అనంతలక్ష్మి, కొండవీటి జ్యోతిర్మయి, గరికపాటి వెంకట్, వెనిగళ్ళ రాంబాబు, జి.బి. శంకరరావు మొదలైన వారికి నేను ఫోనులో వివరించి, సిద్ధం చేసేవాడిని. మంజులాదేవి టెలిఫోన్ లో రికార్డు చేసి, ఎడిట్ చేసి, తగిన రీతిలో కీర్తనలు జోడించేవారు. ఒకే కీర్తనను వేర్వేరు గాయనీ గాయకులు పాడివుంటే వాటన్నిటినీ సేకరించి మంజులాదేవి ఆ కార్యక్రమానికి మంచి శోభ నింపింది. ఈ కార్యక్రమం రూపొందించినందుకు ఆవిడకి జిల్లా కలెక్టరు నుంచి గౌరవం రావడం విశేషం!
రమణాచారి సాయం
కె.వి.రమణాచారి గారు శ్రమించి టిటిడిని వొప్పించి స్పాన్సర్ షిప్ సాధించిపెట్టారు. ఆకాశవాణి కి కొంత రాబడి కలిగింది. కార్యక్రమం 2013 మే నెలలో బ్రహ్మాండంగా మొదలైంది. మూడు వారాలు గడిచిందో లేదో నాకు మదరాసుకు బదిలీ తాకీదు! అయితే, ఈ కార్యక్రమం నా బిడ్డ కనుక ఆరునెలలు పాటు మదరాసు నుంచి ఫోన్ లో ఎక్స్ పర్ట్ ను సంప్రదించి, సిద్ధం చేసేవాడిని. మంజులాదేవి రికార్డు చేసి అందులోని కీలక అంశాలు ఫోన్ లో నాకు చెప్పడం తో దానికి తగిన వ్యాఖ్యానం నేను రాసి మెయిల్ లో పంపడం, తర్వాత దానికి ఆమె తన గానంతో ప్రాణం పోసి, పాటలు జోడించి ప్రసారానికి సిద్ధం చేయడం.
అలా మదరాసు నుంచి నేను, కడప నుంచి మంజులాదేవి ‘అన్నమయ్య పదగోపురం’ ఆరు నెలలు ధారావాహికను నిర్మించాం. నేడు శోభానాయుడు, పి.వి.ఆర్.కె ప్రసాద్, నేదునూరి కృష్ణమూర్తి, కామిశెట్టి శ్రీనివాసులు, గొల్లపల్లి మంజులా దేవి సజీవులుగా లేరు, కానీ ‘అన్నమయ్య పదగోపురం’ కార్యక్రమం పలు కేంద్రాలలో ప్రసారమైంది, ముందు ముందు చిరస్థాయిగా ఉంటుంది!
మహాతృప్తి కల్పించిన కార్యక్రమం, శ్రోతలు బాగా మెచ్చిన విలక్షణ ధారావాహిక ‘అన్నమయ్య పదగోపురం’ !
– డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్: 9440732392