అప్పుడప్పుడే విచ్చుకుంటున్న చిన్ని గులాబీ లో
గుబాళించిన ఒక జీవితేచ్చ…
పలుచటి గులాబీ రంగు మొగ్గ నుండి పెరిగి
ఎర్ర ఎర్రని రెక్కలుగా వికసించిన
విచిత్ర మైన కోరిక…
తనను పెంచిన కొమ్మను వీడి పోవాలని.
సంధ్యా సమీరాలను నిరసించింది
ప్రేమార్థులై మూగిన భ్రమరాల
వైపు పెడ ముఖం పెట్టింది.
రాత్రి ఝాములు గడిచే కొద్దీ
అసురుసురంటూ నిట్టూర్పుల సెగలు కక్కింది.
గుబులుగా, కోపంగా, ఆతృత గా, అసహనం గా
కాసేపు తనలో తను ఎదో స్మరించుకుంటూ
అటూ ఇటూ ఊగిపోతూ
నిశ్శబ్ద తపస్సు లో నిశ్చల యోగిలా స్తంభించి మరి కాసేపు
ఆ నిశీధి వేళ వ్యగ్ర నిరీక్షణ లో
తమస్సు ఆవరించిన తాత్విక తేజస్సులా…
ఆ కుసుమ యోగిని…
తోటపై పరచుకున్న తొలి కిరణాల కాంతిలో
కలియ చూసింది.
అదిగో… ఆమె రానే వచ్చింది పూల సజ్జతో…
ఒక్కొక్క మొక్కను పలుకరిస్తూ,
గోరాన్చక తొడిమెలు తుంచుతూ
తనవద్దకే వస్తోంది… తన వంతు వస్తుందా?
అదిగో దగ్గరకు వచ్చింది… నా వైపే చేయి చాచుతోంది…
ఎన్ని సుదీర్ఘ వ్యర్ధ జన్మల దాట గ వచ్చే
ఈ అల్పాయుర్దాయ సఫల జన్మ
ఇదిగో నా మహా ప్రస్థానం ప్రారంభం కాబోతున్నది
గుడిలో దేవుని పాదాల చెంతకు…
ఇదే జనన మరణ చక్రభ్రమణం నుండి
వేరుపడి కొత్త రెక్కలతో ముక్తి మార్గం వైపు
ఎగిరిపోయే తరుణం.
నా వేల జన్మల నిరీక్షణ ఫలం, నా పూర్వ జన్మ కర్మ బలం
ఇది నా నిర్యాణ సమయం, ఇది నా నిర్వాణ క్షణం.
Also read: తపస్సు
Also read: యుగసంధి
Also read: విజేతలు
Also read: పూలవాడు
Also read: రాగాలు