రామాయణమ్ – 184
రాజధర్మాన్ని పాటిస్తూ విభీషణుని అనుమతి కోరి ఆయన సలహా మీద అంగదుని రావణ సముఖమునకు రాయబారిగా పంప నిశ్చయించుకున్నాడు రామచంద్రుడు. అంగదుని పిలిపించి రావణునితో ఏమి పలుకవలెనో సవివరముగా తెలిపాడు.
Also read: లంకను చుట్టుముట్టిన రామసైన్యం
‘‘ఓయీ రావణా, నీవు మదాంధుడవై నిఖిలలోకమునకు చేసిన పాపములు నేడు పండినవి. బ్రహ్మవరప్రసాదము వలన నీకు కలిగిన గర్వము సర్వము నశించు సమయమాసన్నమైనది. నీకు దండనము నేను విధించబోతున్నాను, అందుకు సన్నద్ధుడనై నీ నగరము వెలుపల వేచియున్నాను. ఏ బలము చూసుకొని సీతను అపహరించినావో ఆ బలము నేడు చూపుము. నీవు సీతను అప్పగించి శరణు వేడుము. లేకపోయిన ఎడల నా వాడియైన బాణములు నీ గుండెలు బ్రద్దలు కొట్టగలవు. లోకములో రాక్షసుడు అనెడివాడు లేకుండా చేసెదను. అటుపైన విభీషణుడు లంకాసామ్రాజ్య పట్టాభిషిక్తుడు కాగలడు.’’
రాముని మాటలు ఆలకించి తారాసుతుడు తారపథమునకు తారాజువ్వలాగ పైకిఎగసి మరు నిముషములో రావణ సభా మంటపమున ప్రవేశించెను.
Also read: రావణుడితో సుగ్రీవుడి మల్లయుద్ధం
మరుక్షణమే రామసందేశమును రావణునకు మంత్రి సామంత దండనాయకుల సమక్షములో ఉన్నదున్నట్లుగా నివేదించెను.
‘‘నేను ఎవరో నీకు తెలుసా? వాలిని ఎరుగుదువుగా నీవు? ఆ వాలి. అంగద నామధేయుడను’’ అని తనగురించి తాను సగర్వముగా ఎరిగించి మరల ఈ విధముగా రావణుని హెచ్చరించాడు అంగదుడు.
“ఓయీ రావణా, కపటవేషధారివై నేను లేని సమయములో జానకిని తీసుకుని వచ్చినందుకు నీవు ఫలితము అనుభవించవలసిన రోజు దగ్గరపడ్డది. ముల్లోకములలో నీవు ఎచట దాగి ఉన్నా వాడియైన నా బాణములకు ఎరగాక తప్పదు. నిన్నుగాచువాడెవ్వడూ ఈ బ్రహ్మాండమంతావెదకినా నీకు కనపడడు. సపుత్రబాంధవముగా నీవు యమపురికేగుట తథ్యము” ….
అని శ్రీరాముని సందేశమును అంగదుడు వినిపించాడు.
Also read: రావణుడి యుద్ధసన్నాహాలు, రాముడి రణవ్యూహం
ఆ మాటలు విన్న వెంటనే ఎర్రబారికన్నులతో తీవ్రమైన క్రోధముతో ‘‘వీడిని పట్టి కొట్టి చంపుడు’’ అని భటులను ఆజ్ఞాపించినాడు రావణుడు.
తనను చుట్టుముట్టిన భటులను ఇరువురిని చంకన ఇరికించి మరియొకడిని వాలముతో బంధించి ఇంకొకడిని కాళ్ళ మధ్యలో పట్టుకొని ఉన్నపళముగా ఆకసానికి ఎగిరి ఎంతో ఎత్తునుండి ఆ రాక్షసులను దులిపివేశాడు. వారు నేలనుబడి తలలుపగిలి నెత్తురు కక్కుకొని దారుణముగా చనిపోయినారు. అంతటితో ఆగక ఆ వాలిసుతుడు వాయువేగముతో రావణభవన గోపురమును కాలితో ఒక్కతాపుతన్ని నేలకూల్చి బిగ్గరగా తన పేరుచెప్పి తిరిగి రాముని వద్దకు వచ్చి చేరెను.
అంగదుని ఆ అసమాన పరాక్రమము చూసి అప్రయత్నముగా రాక్షసరాజు ఒక నిట్టూర్పు విడిచెను.
Also read: సీతమ్మను రామునికి అప్పగించమని రావణుడికి తల్లి కైకసి హితబోధ
అంగదుడు తిరిగి రాగానే వానర సైన్యములన్నీ తమ కదలికలను ముమ్మరము చేసి లంకను ఆక్రమించ ఉద్యమించిరి.
ఆ అశేష వానర సేనావాహినిని చూసి కొందరు రాక్షసులు భయపడిపోయిరి. కొందరు ఆశ్చర్యపడిరి. మరికొందరు రణోత్సాహముతో శరీరములను పెంచి పెద్దవి చేసిరి.
లంక ముట్టడి మొదలయ్యింది
ఆ వార్త తెలిసికొని తన భవన ప్రాకారమునుండి సమస్త వానరసైన్యమును పరికించి చూసినాడు రావణుడు.
వానరులతో పసుపుపచ్చగా మారిన భూమిని, రణకోవిదుడు రాముని ఆశ్చర్యముగా రావణుడు తన భవనమునుండి చూసినాడు.
పెద్దపెద్ద పర్వత శిఖరములు చేతబూని లంకపై దండెత్తిన వానరులను సమర్ధముగా ఎదుర్కొనుటకు నిశ్చయించి అందుకు తగిన ఏర్పాట్లు గావించినాడు రాక్షసేశ్వరుడు రావణాసురుడు.
Also read: వానరవీరుల వివరాలు తెలుసుకున్న రావణుడు
వూటుకూరు జానకిరామారావు