Sunday, December 22, 2024

విశాఖ ఉక్కు దక్కాలంటే పోరాటమే శరణ్యం

‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదం కాలగర్భంలో కలిసిపోయింది. చేసిన త్యాగాలు, దానాలు గాలిలో కొట్టుకుపోయాయి. ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100శాతం వాటాను విక్రయించేందుకు ఈ ఏడాది జనవరి 27 వ తేదీనాడే కేంద్ర క్యాబినెట్ ఆమోదం జరిగిపోయింది. ఉభయసభల్లో, మన సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిసారీ దానిని ముగిసిన అధ్యాయంగానే చూడమని కేంద్ర మంత్రులు పదేపదే చెబుతున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ జరగకపోతే, సంస్థనే మూసేస్తామని బెదిరింపు స్వరంతో స్పందిస్తున్నారు. కరోనాను, ఎండ,వానలను లెక్కచేయకుండా కార్మికలోకం ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తూనే ఉంది. అయినా  దిల్లీ పెద్దలు కనికరించడం లేదు. ఎప్పటి విశాఖ ఉక్కు ఉద్యమం, ఎన్నేళ్ల ఉద్యమం, ఎందరి బలిదానం?

Also read: సృజనాత్మక సంపాదకుడు ఆంధ్రపత్రిక వీరాజీ

చరిత్రగర్భంలో నాయకులు

చరిత్ర తెలిసిన నాయకులు కనుమరుగవుతున్న కాలంలోనే బతుకుతున్నాం. తెలిసిన నాయకులు,ఉద్యమంలో పాల్గొన్న నేతలు, ప్రత్యక్షంగా ఆ వేడి ఎరిగినవారు కొందరు మౌనముద్రలో ఉన్నారు. దక్షిణాదిపై కాదు,ఆంధ్రప్రదేశ్ పైనే ప్రధానంగా ప్రభుత్వాలు సీతకన్ను వేశాయి.జవహర్ లాల్ నెహ్రు మొదలు నేటి నరేంద్రమోదీ వరకూ ఏ పాలనా కాలాన్ని గమనించినా, అదే తీరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అది జగమెరిగిన సత్యం. విశాఖపట్నంకు స్టీల్ ప్లాంట్ రాత్రికి రాత్రి దక్కింది కాదు. తెలుగువాడు నీలం సంజీవరెడ్డి కేంద్ర ఉక్కుమంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి ఏ మాత్రం సుముఖత లేదు. నాయకులంటే లెక్కకూడా లేదు. నాటి ఉద్యమం నాయకుల నుంచి ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజాగ్రహం సముద్రమై పొంగింది. ఉద్యమ సందర్భంలో కొందరు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థిలోకం పెల్లుబికింది. ఆ ఉద్యమం తీవ్రత తట్టుకోలేక అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నాయకత్వం వహించినవారు కూడా సామాన్యులు కారు. తెన్నేటి విశ్వనాథం వంటి నిస్వార్ధ నాయకులు,మేరు నగధీరులు. ఉద్యమం దశాబ్దాలు సాగింది. చివరికి ప్రజాబలానికి లొంగక తప్పలేదు. ఏ మాత్రం ఇష్టంలేకపోయినా,స్టీల్ ప్లాంట్ ఇవ్వక తప్పలేదు. ఇచ్చినట్లు ఇచ్చారు,పెత్తనమంతా ఒరిస్సా మొదలు పరాయివారికే అప్పచెప్పారు. శ్రమ,త్యాగం తెలుగువారిది, పెత్తనం ఆంధ్రేతురులది అయిపొయింది. అయినా, మనవాళ్ళు కష్టపడి స్టీల్ ప్లాంట్ ను గొప్పగా నిలబెట్టారు. కేంద్రం గనులు కేటాయించకపోయినా, ఎటువంటి సహకారం అందించకపోయినా, ఉద్యోగులు అహరహం శ్రమించి లాభాల బాట పట్టించారు.భారీ వడ్డీమోత నడుమ కూడా అనేక సార్లు లాభాలే వచ్చాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం కూడా చాలా బాగా నడుస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

Also read: అఫ్ఘానిస్తాన్ పాఠాలు అనేకం

దారుణమైన ఆలోచన

ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో విశాఖ ఉక్కును సైతం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ఆలోచనే దారుణమైంది. ఉత్పాదకత పెంచడానికి, లాభాలు పెంచడానికి, ఉద్యోగుల నుంచి మరింత నాణ్యమైన ఫలితాలు రాబట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి.ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియనవికావు. ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం అస్సలు లేదు. సౌత్ కొరియాకు చెందిన పోస్కో ( పోహాన్ ఐరన్ & స్టీల్ కంపెనీ ) కు తరలిపోవడం ఖాయమైందనే వార్తలు విరివిగా విహరిస్తున్న వేళ, టాటా గ్రూప్ కొత్తగా వార్తల్లోకి వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపిస్తోందని ఆ సంస్థ సీఈఓ టీవీ నరేంద్రన్ ధృవీకరించడం తాజా మలుపు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగివుందని విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమనేతలు మండిపడుతున్నారు. మిగిలిన సంస్థలతో పోల్చుకుంటే  టాటా గ్రూప్ భారతీయమైనదే కాక, సమాజంలో ఎంతో గౌరవం, ప్రతిష్ఠ ఉన్న సంస్థ. ఉద్యమకారులను, ఉద్యోగులను పక్కదోవ పట్టించేందుకు కేంద్రం వేసిన సరికొత్త వ్యూహంగానే అనేకులు భావిస్తున్నారు. సంస్థ ఏదైనా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోతే ఉద్యోగులపై పెద్దవేటు పడుతుందని, అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాలు వీడడం లేదు. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకే ఇంతవరకూ పరిష్కారం లభించలేదు.పరిశ్రమ వస్తే బతుకులు బాగుపడతాయనే గంపెడు ఆశలతో భూములను వదులుకున్నారు.

Also read: అయ్యో అఫ్ఘానిస్తాన్!

ఉక్కు సంకల్పమే పరమావధి

ఆ దానాలకు, ఆ త్యాగాలకు, ఆ శ్రమకు ఫలితం లేకుండా పోయిందనే బాధ విశాఖతీరంలో అలముకుంది. ప్రస్తుతం 73లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం సంస్థకు ఉంది. 22000 ఎకరాల భూసంపద ఉంది. వేలాదిమంది కాంట్రాక్టు కార్మికులు,ఉద్యోగులు ఉన్నారు.శాశ్వత సిబ్బంది ఉన్నారు. పరోక్షంగా లక్షలమంది ఆధారపడి ఉన్నారు.వీరందరూ భవిష్యత్తుపై తీవ్రంగా కలత చెండుతున్నారు. ఉద్యమ ప్రస్థానం పూర్వుల స్ఫూర్తితో మరింత బలంగా సాగాలని, యావత్తు తెలుగువారందరినీ ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాలనే సూచనలు పలు సమాజాల నుంచి వినపడుతున్నాయి. తెలంగాణ మంత్రి, టీ ఆర్ ఎస్ అగ్రనేత కె టి ఆర్, తెలుగుసినిమా అగ్రనాయకుడు చిరంజీవి వంటివారు ఇప్పటికే తమ మద్దతును సంఘీభావాన్ని ప్రకటించారు. తెలుగువారి సత్తాను చూపించాల్సిన చారిత్రక తరుణం ఇది. ఈ సందర్భంలో సరియైన పద్ధతిలో వ్యవహరించకపోతే, విశాఖ ఉక్కుతో పాటు భవిష్యత్తులో చాలావాటిని పోగొట్టుకోవాల్సి వస్తుందని భావించాలి. తీరప్రాంతంలో ప్లాంట్ ఉన్నందున అందరి కళ్ళూ విశాఖ ఉక్కుపరిశ్రమపైనే పడ్డాయి. ‘ఉక్కునగరం’ విశాఖకు ఉన్న మరోపేరు. ఉక్కును దక్కించుకోవడంలో ఉక్కుసంకల్పమే పరమావధి కావాలి.

Also read: స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినప్పుడే పండుగ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles