Sunday, December 22, 2024

నవ్యాంధ్ర నిర్మాణానికి నడుం బిగించాల్సిన రోజు

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తేదీ. ఇది ఒకప్పుడు పర్వదినం. ఇప్పుడు,  సమరోత్సాహంతో పునర్నిర్మాణం జరగాలనే స్ఫూర్తిని నింపుకొని, బాధ్యతను గుర్తుచేసుకొనే  రోజు. “ఆంధ్ర” శబ్దం జాతిపరంగానూ, భాషా పరంగాను ఏర్పడింది. ఆంధ్రం,తెలుగు, తెనుగు.. ఇవ్వన్నీ ఒకే శబ్దాలు. అక్షరరూపాలలో మాత్రమే తేడాగా కనిపిస్తాయి. తెలుగు మాట్లాడే ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆచార్య డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్నట్లుగా… తెలుగుజాతి మనది: ‘రెండుగ’ వెలుగుజాతి మనది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిన ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా వెలుగులబాటలో నడవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కే ఉంది. హైదరాబాద్ అనే మహానగరం తెలంగాణలో ఉండడం వల్ల,  ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ సంపన్నమైన రాష్ట్రంగా విరాజిల్లుతోంది.

సాధించింది ఏమీ లేదు

ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కొత్త రాష్ట్రం. “స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి, సంబరపడగానే సరిపోదోయి” అని శ్రీశ్రీ ఏనాడో అన్నాడు. సాధించిన దానికి సంతృప్తి పొంది, అదే విజయమనుకొనే పరిస్థితులు తెలంగాణలో ఎలా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో అస్సలు లేవు. 2014 నుండి పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మహానిర్మాణం జరిగినప్పుడే..  నవ్య ఆంధ్ర అవతరించినట్లుగా భావించాలి. అప్పుడే నిజమైన పండుగరోజు. మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రాంతం విడిపోయిన సందర్భంలో,  మద్రాస్ నుండి వెళ్లగొట్టబడ్డారు. తెలంగాణ విడిపోయినప్పుడు,  హైదరాబాద్ ను పోగొట్టుకున్నారు. నీరు, నిధులు, నియామకాలు అనే సమస్యలు రావణకాష్టంగా కాలుతూనే ఉన్నాయి. గతంలో కంటే, 2014 నుండీ  ఆంధ్రప్రదేశ్ లో అంతర్గత కలహాలు  పెరిగిపోతున్నాయి. 1953లో తొలిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు వంటి త్యాగధనుడు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత వచ్చిన బెజవాడ గోపాలరెడ్డి కూడా భాషా సంస్కృతులకు గౌరవమిచ్చిన పెద్దమనిషి. 1953నుండి 1956వరకూ, మూడేళ్లు మాత్రమే  ఈ ఇద్దరు మహనీయులు ముఖ్యమంత్రులుగా పదవిలో ఉన్నారు. 1956లో తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆన్నీ కలిసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాయి.

విభజన దరిమిలా ఆంధ్రప్రదేశ్ కష్టాలు

అప్పటి నుండి ఇప్పటి వరకూ అనేకమంది నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇది గడచిన చరిత్ర. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. రెండు తెలుగు  రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండే ఆంధ్రప్రదేశ్ కు కష్టాలు ప్రారంభమవ్వడమేకాక, మరింత ఎక్కువయ్యాయి.  శ్రీబాగ్ ఒప్పందం, పెద్దమనుషుల ఒప్పందం మొదలైన అంశాలన్నీ చర్విత చర్వణాలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కావాల్సింది న్యాయం, అభివృద్ధి, నిర్మాణం, సామాజిక శాంతి, ఆర్ధిక ప్రగతి. ఇవ్వన్నీ సాధించాలంటే?  కేంద్ర ప్రభుత్వ   సహకారం చాలా అవసరం. అదే సమయంలో ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్నేహ హస్తం అందించాల్సిన అవసరమూ ఎంతైనా ఉంది. విభజన చట్టంలో ఉన్న హక్కులు నెరవేరకపోతే, దిల్లీ పెద్దలు చేసిన హామీలు  తీర్చకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంత సులభం కానే కాదు.

మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలి

పదమూడు జిల్లాల్లో కొన్ని జిల్లాలు వ్యవసాయ పరంగా సస్యశ్యామలంగా ఉన్నా, చాలా జిల్లాలు, ప్రాంతాలు వెనుకబడే ఉన్నాయి.రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలా? మూడు రాజధానులు ఉండాలా? అన్నదొక్కటే అంశం కాదు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. అదే ముఖ్యం. 13జిల్లాలు, రేపు 26గా ఏర్పడినా! ఎన్నిగా ఏర్పడినా, అన్ని  జిల్లాలు, అన్ని ప్రాంతాలు ప్రగతి పథంలో నడవాలి.అన్ని కులాలకు, మతాలకు, వయసులవారికి అభివృద్ధి ఫలాలు అందాలి. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండాలి. డబ్బు, అధికారం ఉన్న వారికి మాత్రమే హక్కులు సొంతం కాకూడదు. ఓట్ల శాతం ఎక్కువ ఉన్నవారికే అన్ని మేళ్లు  జరగడం కాదు, జనాభా పరంగా, ఆర్ధికంగా వెనుకబడి, మైనారిటీగా ఉన్నవారందరికీ వాక్ స్వాతంత్ర్యం, రాజకీయ అధికారం, సంక్షేమం, ఉద్యోగ, ఉపాధిలలో న్యాయమైన భాగస్వామ్యం అందాలి. వీరందరూ చాలా వరకూ అసంతృప్తిగానే ఉన్నారు. వీరందరూ ఏదో ఒక రోజు తిరగబడతారు. ఆ రోజు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే,నాయకులదే.

విజయనగరం, ప్రకాశం, అనంతపురం వెలగాలి

ఒక విశాఖపట్నం తప్ప,  మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతమంతా మొదటి నుండీ అనాధగానే ఉంది. అభివృద్ధికి నోచుకోవడం లేదు.వెనుకుబాటుతనం నుండి బయటపడడం లేదు. విశాఖపట్నం వంటి మహా నగరాన్ని సద్వినియోగం చేసుకుంటూ,  ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేలా కార్యాచరణ చేపట్టాలి. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  సంకల్పం చేసుకున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నిర్మాణం జరగాలి. కోస్తాలో ప్రకాశం జిల్లాది చాలా విచిత్రమైన పరిస్థితి. ఇటు కోస్తా-అటు రాయలసీమ సమ్మేళన స్వరూపంగా ఉండే ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి. పేరులో తప్ప, వెలుగులేని ప్రకాశం జిల్లా ఇది. గుంటూరు నుండి విడిపోయిన ప్రాంతాలు తప్ప, మిగిలిన ప్రాంతాలన్నీ అభివృద్ధికి ఆమడదూరంగానే ఉన్నాయి. సాంస్కృతిక వైభవం పుష్కలంగా ఉంది. కానీ, ఆర్ధిక, సామాజిక ప్రగతి లేదు. రాయలసీమ ప్రాంతంలో అనంతపురం జిల్లా పరిస్థితి కూడా, చాలా వరకూ ప్రకాశం జిల్లా వంటిదే. ఉత్తరాంధ్రలో విజయనగరం, కోస్తాలో ప్రకాశం, రాయలసీమలో అనంతపురం ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ప్రగతి ప్రయాణం ప్రారంభమైనట్లు భావించాలి.

సుదీర్ఘమైన తీరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

రాష్ట్రంలో సుదీర్ఘమైన తీరం వుంది. ఈ తీర ప్రాంతపు అభివృద్ధి ఇంకా మొదలవ్వలేదు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తవ్వాలి. వంశధార, గాలేరు-నగరి, పెన్నా డెల్టా ఆధునీకరణ మొదలైన ప్రాజెక్టులన్నీ సంపూర్ణమవ్వాలి. రాష్ట్రంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. అభివృద్ధి,పాలనలో వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందే. నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తించాలి. అక్కడ వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటు చేపట్టాలి.ప్రతి రంగంలో అభివృద్ధి జరగాలి. ప్రతి ఒక్కరికీ ఫలాలు అందాలి. తమిళనాడులో ఎన్నికలప్పుడే రాజకీయ పార్టీలు కొట్టుకుంటాయి. మిగిలిన కాలమంతా,  అన్ని పార్టీలూ ఏకమై, ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తాయి. నాయకులందరూ ఒక్కటై,  కేంద్రం నుండి రావాల్సిన వాటన్నింటినీ ముక్కుపిండి వసూలు చేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత అనైక్యత, ఏ రాష్ట్రంలోనూ  లేదు. అందుకే, ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఒక నాయకుడు ఒకడుగు ముందుకు వేస్తే, ఇంకొక నాయకుడు అతన్ని పది అడుగులు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తాడు. ఒకే పార్టీలోనూ అంతర్గత పోరు చాలా ఎక్కువ. అదేంటి అంటే? అదే రాజకీయం అంటారు.

నష్టబోతున్నవారు సామాన్య ప్రజలే

ఈ రాజకీయాల వల్ల నాయకుల, పార్టీల లాభనష్టాలు ఎలా ఉన్నా, నష్టపోతోంది, కష్టాల పాలవుతోంది సామాన్య ప్రజలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు,  విద్యావంతుడు. జాతీయ స్థాయిలో బిజెపి పార్టీతో కానీ, ఎన్ డి ఏ ప్రభుత్వంతో కానీ పెద్దగా విభేదాలు ఏమీ లేవు. ప్రధాని నరేంద్రమోదీతో అస్సలు లేవు. 2019ఎన్నికల్లో,  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలవాలని బలంగా కోరుకున్నవాళ్ళల్లో నరేంద్రమోదీ కూడా ఉన్నారు. రాజకీయాలను దగ్గర నుండి పరిశీలిస్తున్న వారందరికీ  ఈ విషయాలు తెలిసినవే. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి- విభజన చట్టంలో ఉన్న హక్కులు, కేంద్ర పెద్దలు ఇచ్చిన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అలుపెరుగని ప్రయత్నం చేయవలసిందే. అధికారికంగానే కాక, వ్యక్తిగత స్థాయిలోనూ నరేంద్రమోదీ, మిగిలిన పెద్ద నాయకులతో ఉన్న సత్సంబంధాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది .

తెలంగాణతో ముడివడిన సమస్యలు

పెట్టుబడులను ఆహ్వానించడంలో రాష్ట్రాలు తమవంతు పాత్ర సంపూర్ణంగా, సమగ్రంగా పోషించాలని ప్రధానమంత్రి తాజాగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పాలకులు ఈ అంశం గుర్తెరిగి ముందుకు సాగాలి. నీరు, నిధులు, నియామకాలకు సంబంధించిన అంశాలు ఇంకా చాలా వరకూ అపరిష్కృతంగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంతో ఇవి ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె సి ఆర్ -ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మధ్య మంచి సంబంధాలే ఉండేవి.ఇప్పటికీ ఉన్నాయనే విశ్వసించవచ్చు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నవారిలో కెసిఆర్ కూడా ప్రధానమైన వ్యక్తి. ఈ విషయాలు రాజకీయ పరిశీలకులకు తెలిసినవే. జలాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాల్లోనూ, మరికొన్ని అంశాల్లోనూ ఈ మధ్య కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. ఇవి విభేదాలే కానీ వివాదాలు కాదనుకుంటా. వంగతోట కాడ… సామెతలాగా, స్నేహం స్నేహమే -వ్యవహారం  వ్యవహారమే అన్నట్లుగా,  ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల తీరు కనిపిస్తోంది. ఏ ముఖ్యమంత్రికైనా తన రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం.

ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే సరి

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి, కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఢిల్లీలు, ట్రిబ్యునల్స్ మనకు అవసరం లేదు, మన ఉభయుల సమస్యలు మనమే తీర్చుకుందాం, కాలయాపన కాకుండా చూసుకుందామని, గతంలో కెసిఆర్ వ్యాఖ్యానించారు. బహుశా త్వరలోనే, సామరస్య పరిష్కారం దిశగా రెండు రాష్ట్రాలు కలిసి సాగుతాయని ఆశిద్దాం. అదే అవసరం, అదే వివేకం.ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప ప్రాంతం. విభిన్న రంగాల్లో ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన పుణ్యభూమి. దేశమాత ముద్దుబిడ్డలను అందించిన ధన్యసీమ. సర్వాంగ సుందరంగా, సర్వ సుశోభితంగా, శాంతి కపోతంగా, సంపూర్ణమైన ప్రగతికి ఆలవాలంగా ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణం జరగుతుందని విశ్వసిద్దాం, జరగాలని అభిలషిద్దాం. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా, పూర్వ మహనీయులకు, మహానాయకులకు అంజలి ఘటిద్దాం. జై తెలుగు తల్లీ.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles