- మహారాష్ట్రను చూసైనా ప్రాంతీయ అసమానతలను అధిగమించడం శ్రేయస్కరం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత హరిత ఆంధ్ర ప్రదేశ్ గా రూపు దిద్దుకుంటుంది అనుకున్న ఆంధ్రప్రదేశ్… ఇవాళ కుల రాజకీయాలు, ప్రాంతీయ విబేధాలు, మత విద్వేషాలు, పరస్పర అవిశ్వాసం, మూడు ముక్కల ఆటలో పై చేయి కోసం రాజకీయ నాయకులు ఆడుతున్న నాటకంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలిగిపోతున్నారు. నిధులు, నీళ్లు, నియామకాల పేరిట ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పక్షాల విమర్శలను పక్కన బెట్టి తాను అనుకున్న పనులు మౌనంగా చేసుకుపోతుంటే, ఆంధ్రలో రాజ్యాంగ సంక్షోభాలు, రాజకీయ- అధికార వర్గాలు మధ్య అభద్రతా భావంతో బ్యూరోక్రాట్లు కీలు బొమ్మలు అయ్యారు! పంచాయితీ ఎన్నికల ప్రహసనం అటు ఉంచితే…అధికారుల్లో కూడా కుల విభజన రావడం దురదృష్టకర పరిణామం! శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూల్ ను చేద్దామన్న జగన్ పట్టుదల కార్యరూపం దాల్చడం ఎంత వరకో గానీ ప్రాంతీయ విభేదాలు ప్రజలను వేధిస్తున్నాయి.
ఇది చదవండి: తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయాలు
జగన్ – చంద్రబాబు మధ్య విద్వేషం:
మొదట జగన్-చంద్రబాబునాయుడు పరస్పర వ్యక్తిగత విద్వేషం పెంచుకోవడం వల్ల అమరావతి స్వప్నం ఛిద్రమైంది. తరువాత నోటికొచ్చినట్టు ఆసెంబ్లీ లో తిట్టుకునే వరకు వెళ్ళింది. అనుభవశీలి అయిన చంద్రబాబు కూడా కయ్యానికి కాలు దువ్వడం వల్ల ఆయన అమరావతి పై కన్న కలలు పటాపంచలు అయ్యాయి! నిజానికి చంద్రబాబు ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఆయనకు నమ్మకం అనుకున్న బ్యూరోక్రాట్లు అధికార యంత్రాంగం లో జరుగుతున్న వ్యవహారాలను చిలువలు పలువలు చేసి ఆయనకు చెప్పడం వల్ల జగన్ పై చంద్రబాబు పీకల దాకా కసి పెంచుకున్నాడు! నిజానికి పాద యాత్ర, వైఎస్సార్ సానుభూతి తో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆయనకు పెద్దన్నలా చంద్రబాబు ఉండలేక పోయారు! అమరావతి విచ్ఛిన్నానికి జగన్ ప్రయత్నానికి చంద్ర బాబు ఆజ్యం తోడయింది.
కర్నూలులో హైకోర్టును వ్యతిరేకించడం తప్పు :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రాయలసీమ వాసిగా చంద్రబాబు కర్నూల్ న్యాయరాజధానిగా సమర్థించాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు బెంచ్ ను గుంటూరు లో ఉండాలి అని అప్పుడు ధ్వజమెత్తింది ఈ చంద్రబాబు గారే! ఇక మారుతున్న ప్రపంచంలో ఇంకా ఈ తరం ఆలోచనలకు చంద్రబాబు దూరం అయ్యారు! విశాఖ దేశానికి ప్రధాన నౌకాశ్రయం రక్షణ స్థావరం! అలాంటి ఉత్తరాంధ్ర లో రాజధానిని వ్యతిరేకించి అక్కడ గట్టి పట్టు ఉన్న టిడిపి కేడర్ కు చంద్రబాబు దూరమయ్యారు!
ఇది చదవండి: వ్యక్తులు మారినా న్యాయం మారదన్న చంద్రబాబు
రాజధాని ముక్కలు కావడం ఖాయం :
కర్నూల్ లో న్యాయ రాజధాని ని చంద్రబాబు అడ్డుకుంటున్నారని…జగన్ ప్రచారం వల్ల రాయలసీమలో చంద్రబాబు ప్రతిష్ట దిగజారింది. ఇక అమరావతి దీక్షలు అలసిపోయేవరకు వచ్చాయి. గణతంత్ర దినం రోజు మూడు రాజధానుల జగన్ అభీష్టం గవర్నర్ నోటి వెంట వక్కాణించడం తో అమరావతి పోరాటం పై నీళ్లు చల్లిన్నట్టు అయింది. జగన్ మరో రెండున్నర ఏళ్లలో రాజధానిని మూడు ముక్కలు చేయడం ఖాయం. తరువాత చంద్రబాబు అధికారం లోకి వచ్చినా ఒకే రాజధాని గా తిరిగి మార్చడం ఇక కల్ల. ఈ చంద్ర బాబు- జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడలు కుల రాజకీయాలుగా ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చే వారు కూడా పరిపక్వత తో ఇవ్వడం లేదా? లేక ఇచ్చినా చంద్రబాబు పై ఉన్న ద్వేషం వల్ల జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెడుతున్నారా అర్థం కావడం లేదు. నిజానికి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అధికారాన్ని ఏ కోర్టులూ ప్రశ్నించ లేవు. రాజకీయ నాయకులు చెప్పే కుంటి సాకులు కోర్టులు వినవు! అలాంటప్పుడు హైకోర్టు తీర్పు కు జగన్ తలవంచి పంచాయితీ ఎన్నికలకు పచ్చ జెండా ఊపితే బాగుండేది! సుప్రీం కు వెళ్లడం వల్ల ఆంధ్ర రాజకీయ పరువు ఢిల్లీలో పోయింది.
ముందుంది ముసళ్ళపండుగ :
పర్యవసానాలు ఎన్ని ఉన్నా చంద్ర బాబు పంతం నెగ్గిందని సంబరాలు చేసుకుంటున్న టిడిపి శ్రేణులు ముందు ఉన్న ముసళ్ళ పండుగ లో శాంతియుత వాతావరణం లో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదోననే అంశాన్ని మరుస్తున్నారు. ఇక అమరావతి ప్రహసనం చంద్ర బాబుకు కులంరంగు అంటగట్టింది. పోనీ చంద్రబాబుకు అండగా ఉంటారనుకున్న ఆయన సామాజిక వర్గం కూడా బిజెపి వైపు అడుగులు వేస్తోంది. తమ పారిశ్రామిక ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబుకు ఆయన సామాజికవర్గానికి చెందిన ప్రముఖులు చెప్పారు. ఒక సినిమా నటుడైతే ఏకంగా చంద్రబాబు వల్ల డబ్బు పోగొట్టుకున్న వైనాన్ని ఏకరువు పెట్టడం, కృష్ణ, గుంటూరు లో ఉన్నా చంద్రబాబు సామాజిక వర్గం జగన్ వైపు చేరడం, ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయాల్లో రాజులను రెచ్చగొట్టే వైఖరి వల్ల ఆంధ్రప్రదేశ్ తిరోగమన దిశలో పయనిస్తోంది.
ఇది చదవండి: జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ
ప్రత్యేకవాదాలు తలెత్తుతున్నాయి :
మహారాష్ట్ర రాజధాని ఈ చివరన ఉన్నా మరాఠీ వాళ్ళంతా ముంబయిని అక్కున చేర్చుకుంటారు. నాందేడ్- ముంబయి, యావత్ మాల్- ముంబయి, నాగపూర్- ముంబయి సుదూర తీరంలో ఉన్నా ప్రాంతీయ అసమానతలు రాలేదు. విదర్భ రాష్ట్రం మాట మరాఠీ లు అట కెక్కించారు! అలాగే యూపీ చిన్న రాష్ట్రాల ప్రతి పాదన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. జాతీయ రహదారుల రవాణా సౌకర్యాలు ఉన్న చిన్న రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో గ్రేటర్ రాయలసీమ ఉద్యమం, ఉత్తరాంధ్ర ఉద్యమం వైపు ప్రజలు అడుగులు వేయడం శోచనీయం!