ఏరు తెలుంగు బిడ్డల నొకే ముడియందు బిగించినారొ? ఎ
వ్వారల ప్రాణవాయువుల వల్ల త్రిలింగము తేజమందె? నె
వ్వారలు రక్తకుంకుమలు ఫాలము దిద్దిరి తెన్గుతల్లికి? అ
వ్వారి అపూర్వ సంస్మరణ భాగ్యముచే పులకించి పోయెదన్!
*
గుండెల నొడ్డి ఆంగ్లభట కూటమి కడ్డుగ వోయి, భీషణో
ద్దండ కళాప్రచండ నినదం బొనరించెడు వాని, జాతికిన్
కండలు కోసి యిచ్చిన ప్రకాశము పంతు లఖండకేసరిన్
నిండు మనంబునన్ కొలిచి నిశ్చల భక్తి నమస్కరించెదన్!
*
కలసియు కాలగర్భమున గర్వము నింపెడు వీరగాథ! నా
తెలుగు పసిండి దువ్వలువ తేజము వీడె మరేల నేడు? ఆం
ధ్రుల హృదయాల పొంచి యొక
క్రూరభుజంగము కాటు వేసెనే?
కుల మత ప్రాంత భేదముల క్రుంగెను గాదె విశాల కుడ్యముల్?
నివర్తి మోహన్ కుమార్
తొంభై మూడు సంవత్సరాల క్రిందట ఆంగ్లప్రభుత్వం నియమించిన సైమన్ కమిషన్ ను భారతప్రజానీకం తిరస్కరించింది. “సైమన్ గో బ్యాక్” అనే నినాదాలు దేశమంతా చెలరేగినవి. పల్లెల్లో, పట్టణాలలో, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఊరేగింపులు ఏర్పాటు చేసింది. ప్రతిచర్యగా వలస ప్రభుత్రం సెక్షన్ 144 అమలు చేసి షూట్ అట్ సైట్ ఉత్తర్వులు ప్రకటించింది.
మదరాసు నగరంలో ఊరేగింపులు తీయడానికి తమిళనాయకులు భీతి చెందిన వేళ ఉద్యమకారులతో ఊరేగింది ప్రకాశంగారే. ఒకచోట ఊరేగింపుగా వెళుతున్న ఉద్యమకారులపై సాయుధదళాలు కాల్పులు జరపడంతో ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు పోగొట్టు కున్నాడు. విషయం తెలిసిన ప్రకాశంగారు హుటాహూటిన ఆ స్థలానికి వెళ్ళినారు. యువకుని శవాన్ని తీసుకొని రావడానికై ప్రకాశంగారు ఉద్యమించగా సాయుధ పోలీసులు తమ తుపాకులు ప్రకాశం గారిపై ఎక్కుపెట్టినారు. ఆయన వెనువెంటనే తన చొక్కా గుండీలు చించుకొని, ఛాతీ చూపించి “రండి! కాల్చుకొండి!” అని సవాలు విసిరినాడు. దిగ్భాంతి చెందిన సాయుధదళాల తుపాకులు ఒక్కసారిగా అవనతమైనవి.
ప్రకాశంగారు ఠీవిగా సాయుధ బలగాల లోకి చొచ్చుకొని పోయి శవాన్ని బుజంపై మోసుకున్నారు. యువకుని శవంతో సహా ప్రకాశం గారి ఊరేగింపు నిర్విఘ్నంగా నగరంలో సాగింది. ఆ నాటి నుండి ఆయనకు “ఆంధ్రకేసరి” అనే పేరు స్థిరపడి పోయింది. ఏ చోట ప్రకాశం గారు సాయుధదళాలను ధిక్కరించి ఉద్యమం నడిపినాడో, అక్కడ (జార్జిటౌన్) మదరాసు ప్రభుత్వం ప్రకాశంగారి కాంస్యవిగ్రహాన్ని నెలకొల్పింది.
పుట్టుకతో ప్రకాశం పేదవాడు. న్యాయవాదిగా రెండు చేతులా ధనం ఆర్జించిన ప్రకాశం, స్వాతంత్ర్యోద్యమ మహాయజ్ఞంలో, కోట్లాది విలువ గల ఆస్తిని కర్పూరధూపం వలె కరగించి, కడకు నిరుపేదగా తనువు చాలించినారు. తెలుగువారి ఆత్మగౌరవానికి, ధైర్యసాహసాలకు, అసమాన త్యాగానికి, నిలువెత్తు దర్పణం వంటి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 151 వ జయంతి నేడు.