వోలేటి దివాకర్
హిందుత్వ …. అభివృద్ధి వంటి నినాదాలతో ముందుకు వెళ్లే భారతీయ జనతా పార్టీ తాజాగా లిక్కర్ పాలసీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీస్తోంది. బిజెపి మరీ చీప్ లిక్కర్ గురించి మాట్లాడటం చీప్ గా ఉందని , కనీసం బ్రాండెడ్ మద్యం ధరల గురించి మాట్లాడినా హుందాగా ఉండేదని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కెటిఆర్ ట్వీట్ తో ఎపి బిజెపి లిక్కర్ పాలసీ తెలంగాణాలో కూడా చర్చనీయాంశమవుతోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మొహువా మొయిత్రీ కూడా దీనిపై స్పందించడం విశేషం.
మొన్న విలేఖర్ల సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు తాము అధికారంలోకి వస్తే చీప్లక్కర్ను రూ. 70 కే విక్రయిస్తామని ప్రకటించారు. తాజాగా ఆయనే మరో అడుగు ముందుకేసి విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్ ను అవసరమైతే రూ. 50 కే అమ్ముతామని కూడా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది చీప్ లిక్కర్ తాగుతున్నారని లెక్క చెబుతూ, బిజెపికి ఓటు వేస్తే సీసా లిక్కర్ను 70 కే అమ్ముతామని, రెవెన్యూ బాగుంటే రూ. 50 కే విక్రయిస్తామని సోము వీర్రాజు సభాముఖంగా ప్రకటించారు . ఈ సందర్భంగా కోటి మంది తాగుబోతులు బిజెపికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం కొసమెరుపు. దీనిపై కెటిఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. జాతీయ పార్టీ బిజెపిది ‘వాట్ ఏ స్కీమ్, వాటే షేమ్’ అంటూ ఎద్దేవా చేశారు. ఏపి బిజెపి దిగజారిపోయిందని ధ్వజమెత్తారు. తృణమూల్ ఎంపి మహువా మొయిత్రీ స్పందిస్తూ ఎపి బిజెపి కోటి ఓట్లను కేవలం 70 చొప్పున కొనుగోలు చేయాలని భావిస్తోందా అని నిలదీశారు . బిజెపిది అద్భుతమైన ఎన్నికల వ్యూహం అని ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా ఈసభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న బిజెపి నేత ప్రకాష్ జావడేకర్ ప్రసంగాని కన్నా బిజెపి ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు చీప్ లిక్కర్ ప్రసంగానికి దేశవ్యాప్త ప్రాచుర్యం దక్కడం గమనార్హం .
పదేపదే మద్య విధానంపై బిజెపి నేతలు మాట్లాడుతుండటంతో ఎపిలో బిజెపి ఎన్నికల వ్యూహం మార్చిందా … వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు చీట్లెక్కర్ను ఆధారం చేసుకుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బిజెపి ఆఫర్ మందుబాబులకు వినసొంపుగా ఉన్నా …. మహిళలకు మంట పుట్టిస్తోంది . దీనిపై కూడా బిజెపి నేతలు ఆలోచన చేస్తే మంచిది.
Also read: స్వపక్షంలో విపక్షం, గోదావరి తీరంలో.. అధికార పార్టీలో ఆధిపత్యపోరు!