Sunday, December 22, 2024

2023 ఎన్నికల ఫలితాలపై సోమరి వివరణల వెనుక వాస్తవాలు, ప్రతి విశ్లేషకుడికీ అంతుచిక్కని మార్పులు, బదలాయింపులు

పోలింగ్ పూర్తయిన తర్వాత లోక్ నీతి-సీఎస్ డీఎస్ చేసిన సర్వే అనుసరించి 2023 అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రజలలో నాటుకుపోయిన మిధ్యలను బద్దలు చేయవచ్చు. ఏది పని చేయలేదో, కాంగ్రెస్ చింతించవలసిన అంశాలు ఏమిటో చెప్పవచ్చు.

యోగేంద్ర యాదవ్

శ్రేయస్ సర్దేశాయ్

ఎన్నికల విశ్లేషకులు క్రికెట్ వ్యాఖ్యానం వినాలి. కొన్ని ప్రాథమిక విశ్లేషణాత్మక తప్పిదాల నుంచి అది వారిని కాపాడవచ్చు. గెలిచిన పక్షం అన్ని రకాలుగా అద్భుతంగా ఆడిందని ఏ వ్యాఖ్యాతా చెప్పడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ- అన్నీ నూటికి నూరుపాళ్ళూ విజేతలు అత్యంత ప్రతిభావంతంగా చేశారనీ, అదృష్టం సైతం వారినే సంపూర్ణంగా వరించిందనీ చెప్పజాలడు. ఈ అద్భుతం ఎప్పుడో ఒకప్పుడు అసాధారణంగానే జరుగుతుంది.

ఎన్నికలపైన మీడియా వ్యాఖ్యానం పరిశీలించినట్లయితే ఈ అద్భుతం అన్ని చోట్లా జరిగినట్టు ప్రతి టీవీ చర్చలోనూ కనిపిస్తుంది, వినిపిస్తుంది (దురదృష్టవశాత్తు పత్రికల రిపోర్టింగులోనూ, విశ్లేషణలోనూ అదే ధోరణి కనిపిస్తుంది.) ఈ రకం విశ్లేషణ ‘జో జీతా వహీ సికిందర్ (గెలిచినవాడే మొనగాడు)’ అన్నట్టు సాగుతుంది అనుకోవచ్చు. గెలిచినవారు ప్రభుత్వాన్ని చక్కగా నడిపించారనీ, అత్యుత్తమమైన పథకాలతో, అత్యున్నతమైన నాయకత్వం అందించారనీ అర్థం వచ్చే విధంగా వ్యాఖ్యలు ఉంటాయి. ఓడిపోయిన పార్టీ ప్రభుత్వవ్యతిరేక పవనాలు ఎదుర్కొన్నదని చెబుతారు. ఆ ఒక్క మాటలో అంతా ఉందన్నట్టు మాట్లాడతారు. విజేత గొప్పగా ప్రచారం చేశాడు. అతని వ్యూహాలన్నీ జయప్రదమైనాయి. అదే విధంగా పరాజితుడు అనుసరించిన ప్రతివ్యూహం విఫలమైంది. ఎన్నో పరస్పర విరుద్ధమైన అంశాలపైన ఆధారపడి ఎన్నికల ఫలితం ఉంటుందనీ, విజేత కొన్ని తప్పలు చేసి ఉండవచ్చుననీ, పరాజితుడు కొన్ని సందర్భాలలో సరైన విధంగా వ్యవహరించి ఉండవచ్చుననీ అన్నది మన విశ్లేషకులకు అందని విషయం.

Also read: రాజ్యం-జాతీయత నమూనా ఇప్పటికీ ఆదర్శప్రాయమే 

ఓట్ల లెక్కింపునాడు వినిపించిన రణగుణధ్వనులు సమసిపోయాయి. ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. లోక్ నీతి-సీఎస్ డీఎస్ సంస్థ పోలింగ్ అనంతరం నిర్వహించిన సర్వే ఫలితాలు ఉన్నాయి. ఓటర్ల జాబితా నుంచి అక్కడక్కడ ఎంచుకున్న ఓటర్లతో ముఖాముఖి ఇంటర్వ్యూలు చేసి రాబట్టిన సమాధానాల ఆధారంగా తయారు చేసిన గణాంకాలు ఉన్నాయి. ఈ సంస్థ తయారు చేసిన ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ‘ది హిందూ’ దినపత్రిక ప్రచురించింది. సాంకేతికపరమైన హెచ్చరిక ఏమంటే ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో పోలైన ఓట్లలొ బీజేపీ వాటాను లోక్ నీతి తక్కువగా అంచనావేసింది. తక్కిన రెండు రాష్ట్రాలలోనూ సరిగ్గానే అంచనా ఉన్నది. అయినప్పటికీ మన విశ్లేషణ దానిపైన ఆధారపడిలేదు.

కనుక ఈ ఎన్నికలలో ఏమి జరిగిందనే అంచనాలనూ, మిథ్యలనూ పటాపంచలు చేస్తూ, ఏమి పని చేసిందో, ఏమి చేయలేదో స్పష్టంగా చెప్పవచ్చు.

ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలత అనడం అంత తేలికకాదు

ప్రభుత్వాలకు లేదా ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఈ  ఎన్నికల ఫలితాలను భావించనక్కరలేదు. అధికారపార్టీ ఓడిన రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత నిర్ణాయక అంశం కాదు. నిజానికి, ఇటీవల తిరిగి ఎన్నికైన యూపీ, ఉత్తరాఖండ్, గోవా వగైరా రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ జనామోదం మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంది.సంతృప్తిస్థాయి అతి తక్కువగా ఉన్నదనుకున్న మధ్యప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థులు  పెద్ద ఆధిక్యాలు సంపాదించి అధికారం మళ్ళీ గెలుచుకున్నారు. నాలుగు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులు తమ ప్రత్యర్థులకంటే అధికంగా జనామోదం ఉన్నవారే.

కనుక మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత, సానుకూలత అనే అంశాలపైన ఎన్నికల ఫలితాలను విశ్లేషించడం కుదరదు. ఇక్కడ  మూడు అంశాలు పని చేసినట్టు కనిపిస్తున్నది. నిర్దిష్టమైన సంక్షేమ పథకాలకంటే మామూలు పథకాలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఉదాహరణకు మంచి ప్రభావవంతమైన రెండు పథకాలను – తెలంగాణలో రైతుబంధు (80శాతంమందికి ప్రయోజనం), రాజస్థాన్ లో చిరంజీవి స్వాస్థ్య బీమా యోజన – పరిశీలిద్దాం. చిరంజీవి స్వాస్థ్య బీమా యోజన వల్ల లాభం పొందినవారి ఓటింగ్ సరళిలో కాంగ్రెస్ కు నాలుగు శాతం మాత్రమే బీజేపీ కంటే అధికంగా వచ్చాయి. అదే తెలంగాణలో అయితే రైతుబంధు పథకం వల్ల లబ్ధిపొందినవారిలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కే  రెండు శాతం అధికంగా ఓటు చేశారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల ప్రచారంలో పార్టీలు ప్రచారం చేసేటప్పుడు తేడాలు వస్తాయి. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం బాగా ప్రచారం చేసిన సంక్షేమ పథకాలను ప్రధానిమోదీ ఇచ్చిన బహుమతులుగా ప్రజలకు అర్థమైనాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ కొన్ని మైళ్ళ ముందుగా ఉన్నది. మధ్యప్రదేశ్ లో లాడ్లీ బహన్ యోజన వల్ల లబ్ధి పొందిన మహిళలో బీజేపీకి ఆరు శాతం మంది ఎక్కువగా ఓటు చేశారు.

Also read: హిందూమతవాదానికీ, బహుజనవాదానికీ మౌలికమైన తేడా ఉంది

గతంలో సాధించిన ఘనకార్యాలకంటే రాబోయే కాలంలో ప్రభుత్వాలు ఏమి చేయబోతున్నాయన్న విషయానికి ఓటర్లు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడు పీఠంపైన ఉన్న ప్రభుత్వానికి సరైన ప్రత్యామ్నాయం కనిపిస్తే దాన్ని గెలిపించారు. అంతే కానీ పాత ప్రభుత్వాన్నే కొనసాగించాలని అనుకోలేదు. ‘అవును. అతడు మంచి పనులే చేశాడు. కానీ మార్పు రావలసిన వేళ వచ్చింది.’

విజేతల ప్రచారం మెరుగ్గా ఉన్నదా? అదేమీ లేదు

విజేతలు బాగా ప్రచారం చేసి ఉంటారనీ, ఎన్నికలలో మంచి సమన్వయం పాటించి ఉంటారనీ సోమరులు వేసే అంచనాలను తప్పని కూడా ఈ ఎన్నికలు  నిరూపించాయి. బీజేపీ సర్వసాధారణంగా కట్టుబాటుతో వ్యవహరిస్తుందనీ, ప్రచారం పద్ధతి ప్రకారం చేస్తుందనీ,  నిధుల కొరత ఆ పార్టీకి ఉండదనీ, పోలింగ్  కేంద్రాలలో అజమాయిషీ బాగుంటుందనీ మనకు తెలుసు. కడచిన దశాబ్దంలో ఇది ఒకానొక మారని అభిప్రాయం.

కానీ పోయిన ఎన్నికల కంటే   ఈ సారి రాజస్థాన్ లోనూ, మధ్యప్రదేశ్ లోనూ కాంగ్రెస్ మెరుగైన ప్రచారం సాగించింది, పోలింగ్ కేంద్రాల దగ్గరా పకడ్బందీగా వ్యవహరించింది. రాజస్థాన్, తెలంగాణలో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడంలోనూ, ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయడంలోనూ కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ ల కంటే ముందున్నదని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే చెబుతోంది.

ఎన్నికల ఫలితాల విశ్లేషణలో సోమరిపోతుల లెక్కల ప్రకారం పార్టీలలో ముఠాతగాదాలకు ప్రాధాన్యం ఉంటుంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రచారం పద్ధతి ప్రకారం లక్ష్యశుద్ధితో జరిగింది. రాజస్థాన్ లో బీజేపీ ముఠా తగాదాలు కాంగ్రెస్ ముఠాతగాదాలకంటే ఎక్కువగా సాగాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో పోయిన ఎన్నికలకంటే ఈ ఎన్నికలలో తక్కువ ముఠాపోరు ఉన్నది.

రాజకీయాలలో ధనప్రభావం ఉంటుంది కానీ అదే సర్వస్వం కాదని తెలంగాణ ఎన్నికల ఫలితాలు మనకు ఆశ్వాసం ఇస్తున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ కు సరిసమానమైన పార్టీ లేదు. బీఆర్ఎస్ కి ఉన్న అపారమైన నిధులు ఆ పార్టీకి పెట్టని కోటల వంటి ప్రాంతాలలో ఓటమిని నివారించలేకపోయాయి.

Also read: బీహార్ కులజనగణన బృహత్తరమైన ముందడుగు

మూడు హిందీ రాష్ట్రాలలో బీజేపీ విజయానికి దోహదం చేసిన స్వల్పవిషయాలు టీవీ చర్చాకార్యక్రమాలలో వినిపించలేదు. అవే బీజేపీ ప్రత్యర్థులను వేధించే అంశాలు.

చర్చలలో అందని తరగతి, కులం మార్పులు

రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కంటికి కనిపించని సామాజిక మార్పులు సంభవించాయి. ఛత్తీస్ గఢ్ లో నాటకీయమైన మార్పు సంభవించింది. తెలంగాణలో రాజకీయ మార్పు కులాలకి అతీతంగా జరిగింది. కనుక ఇది మధ్యప్రదేశ్ లో మహిళా ఓటర్లు తెచ్చిన మార్పు కాదు. ఓట్లు వేసిన మహిళల శాతంలొ ఈ ఎన్నికలలో పెద్ద మార్పు ఏమీ లేదు కనుక మహిళా ఓటర్లే తమను గెలిపించారన్నబీజేపీ వాదనలో పస లేదు. ఈ మిథ్యను లోక్ నీతి సర్వే అసత్యమని స్పష్టంగా నిరూపించింది. మహిళల కంటే పురుష ఓటర్లలోనే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఆధిక్యం ఉంది. గ్రామీణ, పట్టణ ఓటర్ల వ్యత్యాసంలో కూడా మార్పు లేదు. పట్టణ ప్రాంతాలలో కాంగ్రెస్ పై న బీజేపీ ఆధిక్యం ఈసారి మరికొంత పెరిగింది.

సామాజిక నిర్మాణంలో (పిరమిడ్ లో) దిగువ సగభాగంలో పార్టీ ప్రాబల్యం పెంచుకోవడానికి కాంగ్రెస్  ఈ సారి దృష్టిపెట్టి పని చేయలేదు. ఎస్సీలూ, ఎస్టీలూ,  ముస్లింలలో తనకు మామూలుగా వచ్చే శాతం ఓట్లు కాంగ్రెస్ కు లభించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ కు పడిన ముస్లిం ఓట్లు పెరిగాయి. అదే విధంగా బీజేపీకి అనుకూలంగా హిందూ అగ్రవర్ణాల ఓట్లు సంఘటితమైనాయి.  తెలంగాణలో కూడా ఈ ధోరణి కనిపించింది. పేదలలో రాజస్థాన్ లో కాంగ్రెస్ తన స్థాయిని పెంచుకున్నది. తెలంగాణలో ఈ విషయంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ బరాబర్ గా నిలిచింది. మధ్యప్రదేశ్ లో ఆధిక్యంలో ఉంది.

దళితులూ, ఆదివాసీలలో కాంగ్రెస్ ఆధిక్యం కనిపించింది. భారతీయ ఆదివాసీ పార్టీ వంటి కొత్త పార్టీలు ప్రధాన పక్షాల ఓట్లకు గండిపెడుతున్నాయి. కులాల నిచ్చెనలో దిగువ భాగంలో రాజస్థాన్ లో మాత్రమే కాంగ్రెస్ నిర్మాణం పెంచుకున్నది. మిగిలిన రాష్ట్రాలలో విఫలమైంది. ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో పేదలూ, ఆదివాసీలు నాటకీయంగా బీజేపీవైపు మొగ్గు చూపించారు.

ఇది కాంగ్రెస్ పార్టీని వేధించవలసిన విషయం. మండల్  రాజకీయాలకు పూర్తిగా అవకాశం కల్పించని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలోని ఓబీసీలలో బీజేపీ ఆధిక్యం అమాంతంగా పెరిగింది. ఈ పెద్ద సామాజికవర్గంలో కాంగ్రెస్ కంటే  బీజేపీ ఆధిక్యం రాష్ట్ర స్థాయి సగటు కంటే అధికం. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ఓబీసీలకి అనుకూలంగా వ్యవహరించినప్పటికీ, ఇద్దరు ముఖ్యమంత్రులూ ఓబీసీలైనప్పటికీ ఓబీసీలు బీజేపీని ఎంచుకోవడం విశేషం. చిన్న చిన్న ఓబీసీ కులాలను సమీకరించి మండలీకరణను సంపూర్ణంగా వినియోగించుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. చిన్న ఓబీసీ కులాలకు మినహాయింపులు ఇవ్వడం, అగ్రకులాల సరసన దీటుగా పీట వేయడం, వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపించడంలో బీజేపీ జయప్రదంగా పావులు కదిపింది. ఇందుకు భిన్నంగా మౌలికంగా బీహార్ తరహా ఓబీసీ రాజకీయాలను కాంగ్రెస్ అనుకరించింది.

కాంగ్రెస్ , ఇతర పార్టీలూ చింతించవలసిన అంశం

ఓటింగ్ సరళిలో కనిపించని లోతైన మార్పులు చోటుచేసుకున్నట్టున్నాయి. 1970, 1980లలో ప్రజలు శాసనసభ ఎన్నికలలో సైతం తాము ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నామన్న ధోరణిలో ఓటు వేసేవారు. 1900లలోనూ, 2000లలోనూ లోక్ సభ ఎన్నికలలో తాము ముఖ్యమంత్రిని ఎన్నుకుంటున్నామన్న ధోరణిలో ప్రజలు ఓటు చేసేవారు. అప్పటి నుంచి ప్రజలు శాసనసభకు ఒక విధంగా, లోక్ సభకు మరో విధంగా ఓటు చేయడం ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగినప్పటి నుంచీ ఈ కథలో మరో మార్పు సంభవించింది. శాసనసభ ఎన్నికలలో పరిశీలనాంశాలలో కేంద్ర ప్రభుత్వ పరపతి ఒక ముఖ్యమైన అంశంగా పరిణమించింది. ఇది మోదీ హయానికి కూడా వర్తిస్తుంది. దీనికి ఆధారాలు దొరకవు కానీ మోదీ అంశం అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజామోదం ఉన్నప్పటికీ వాటి కంటే మోదీ సర్కార్ ఎక్కువ ప్రాబల్యం కలిగి ఉంది. ప్రధాని మోదీ కోసమే తాము బీజేపీకి ఓటు చేశామని చాలామంది ఓటర్లు చెప్పారు.

ఈ రెండు అంశాలు – సామాజిక అనుసంధానం, కేంద్ర ప్రభుత్వం పని తీరు, దాని పేరుప్రతిష్ఠలు ఆధారంగా శాసనసభ ఎన్నికలలో ఓటు వేయడం – సైద్ధాంతిక ప్రాధామ్యాలలో మార్పు కారణంగా బీజేపీ ప్రాథమిక ఓటు స్థాయిని పెరిగి ఉండవచ్చు. దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వాలకు జనామోదం ఉన్నప్పటికీ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో అన్యమనస్కంగా ప్రచారం చేసినప్పటికీ బీజేపీ విజయాలు సాధించింది. నిశ్శబ్దంగా జరిగిన ఈ మార్పు మద్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం పట్ల ఉండిన విసుగుదలను సైతం అధిగమించి అసాధారణ స్థాయిలో విజయం చేకూర్చింది.

ముందుకు దృష్టి సారించి చూస్తే తెలంగాణలో అద్భుతమైన విజయం మూడు హిందీ రాష్ట్రాలలో అపజయం వల్ల మసకబారి పోయినట్టు కనిపిస్తుంది. పార్లమెంటరీ సీట్ల లెక్క ప్రకారం చూసినట్లయితే అది పెద్ద తిరుగులేని పరాజయం మాత్రం కాదు.  ఇదే సరళిలో లోక్ సభ ఎన్నికలలో సైతం ఓట్లు పడితే కాంగ్రెస్ కు అదనంగా 22 సీట్లు దక్కుతాయి. 2019లో ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఈ  ఎన్నికల ఫలితాలు లోతైన సామాజిక పునరేకీకరణకు దారి తీస్తే మటుకు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తిరిగి తమ వ్యూహాలకు పదును పెట్టుకోవడం గురించి తిరిగి చర్చించుకోవడం అవసరం.

Also read: మహిళా రిజర్వేషన్లు మాటవరుసకేనా? పదిహేనేళ్ళ వరకూ అమలులోకి రావా?

Yogendra Yadav Shreyas Sardesai
Yogendra Yadav Shreyas Sardesai
Yogendra Yadav is the National convener of Bharat Jodo Abhiyan. Shreyas Sardesai is a survey researcher associated with the Bharat Jodo Abhiyan.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles