ఇది పాత కథే
మనసు చెప్పేది, మనసుకు మాత్రం అర్థం అయ్యేది.
నేను చెపుతాను… నీకు అర్థం కాదు.
ఒకప్పుడు కాలచక్రం క్రింద నలిగిన
ఆ సుకుమార సుమాలు మళ్ళీ ప్రాణం పోసుకోవు.
అప్పటి నుండి ఎన్ని వసంతాలో, ఎన్ని శిశిరాలో
తళుక్కు న మెరిసి, మసక బారి, మాయ మయ్యాయి.
అయినా నేను ఇక్కడే ఉన్నాను,
ఒక నిశ్చల యోగిలా,
నేలలో నాటుకొని అన్ని వట వృక్షాల లాగునే
నీనుంచి దశాబ్దాల దూరం లో.
కొత్త చిగురులను చిరునవ్వుతో పలుకరించే
పాత ఆనవాయితీ మరిచాను
నేలవాలే పండుటాకులవైపు
దిగులుగా చూడడం మానుకున్నాను.
నీవు క్రిందటి సారి నా కొమ్మ పై వాలినపుడు,
అదే… అప్పుడెప్పుడో
నాలో ఏదో విచిత్రమైన పులకింత…
కొత్తగా ఎదో ఆత్మకు తగిలిన రుచి
ఇంద్రియానుభూతికి అతీతంగా
ఒక వెచ్చని భావన.
అయినా నీ ధోరణి నీదే.
ఎదో పని ఉన్నట్లు వచ్చావు,
కాసేపు కొమ్మలపై ఊగి, నావైపు ఒక చిరునవ్వు విసిరి
కాసిని పండ్లు కొరికి,
క్రింద పడ్డ మగ్గిన ఫలాలను ఆత్రంగా ఆరగించి
ఒక్క మాటైనా చెప్పకుండా
అటూ ఇటూ చూసి ఎగిరి పోయావు…
కొమ్మ ల గొంతులెత్తి, సహస్ర పత్ర నయనాలతో
నీవు పోయిన వైపే చూస్తూ ఉండిపోయాను.
ఆ మన కలయిక కొన్ని నిముషాలే
కాని ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేశావు.
ఇన్నేళ్ల తరువాత నువ్వు మళ్ళి
వార్ధక్యంతో, తీయని పాత జ్ఞాపకాలతో
కీచు మంటున్న
అదే కొమ్మ మీద వచ్చి వాలావు.
నీ చూపులు వింతగా తోచాయి
నేనెవరో తెలియనట్లు,
పొరపాటున వేరేచెట్టుపై వాలినట్లు.
దేవుడా… చెప్పేయాలి,
అప్పుడు నేను చెప్పాలనుకున్న దంతా చెప్పేయాలి,
ఏమో, ఏమి చెప్పేది, ఎలా చెప్పేది
నా కొమ్మ రెమ్మలు విసిరే శూన్య పవనాలు తప్ప,
నా ఆకులు చేసే భావరహిత రెపరెపలు కాక?
ఎలాగోలా చెప్పేయాలి.
గాలి నడిగో, సెలయేరు నడిగో
మూగ మనసు ఊసును మాట సవ్వడి చేయాలి.
నేను చెప్పవలసిందే…
అవును… నీకు ఆ కథ,
ఆ కథే చెప్ప వలసి ఉంది
మరల, మరల, మరల
మన కథ, పాత కథ,
దశాబ్దాల నుండి పెదవులు దాటని కథ
అయినా అదేమిటో నీకు అర్థం కాదు.
Also read: చరిత్ర
Also read: భాష్పాంజలి
Also read: చందమామ
Also read: పగటి కలలు
Also read: భాష