ఎందుకు లేరు
మహానుభావులు!
గాలిలా అంతటా వుండరు
మధూళిలా అక్కడక్కడ.
అది ఒక మారుమూల పల్లె
అతి చిన్న పాఠశాల,
కాని దాని ఆవరణలోని చెట్లన్నీ
అక్షరాలనే వీస్తాయి.
వాటిని చెమట పోసి పెంచాడతను.
పిల్లల్ని ప్రేమించడమంటే ఏమిటో
ముందే అభ్యసించాడు
వారి నేపథ్యాల్ని
పద్యాలుగా మలుచుకున్నాడు.
వారి కళ్లల్లో
వెలుగుల్ని సృష్టించాడు
పుస్తకాల్లోని విజ్ఞానాన్ని
మట్టిలో చల్లి
మళ్లీ మొలిపించాలి.
ఆ స్కూలు చుట్టు
ఎన్నిసార్లు తిరిగినా
తరగని బ్రహ్మాండంలా వుంటుంది
ఏదో తెలియని అతి మానుష ఘోష
మదిని అలముకుంటున్నది.
నా చిన్నతనంలో
అతని నీడ సోకి వుంటే
ఆచార్యుడయ్యే సంగతి తర్వాత
ఇంత కన్న మంచి మనిషిని మాత్రం
అయివుండే వాణ్ని.
అతనితో పాటు
పిల్లబాటలో
ఓ మూడు మైళ్ల దూరం నడిచాను,
అవి త్రివిక్రముని అడుగుల్లా వున్నాయి
అతని ప్రతి మాటా
దారిలో పువ్వై పరిమళిస్తున్నది.
అతణ్ని ముట్టుకుంటే
మనస్సులో ఏదో సున్నితమైన అలజడి,
అతని పాదముద్రల్ని తలుచుకుంటే
సరికొత్త గమ్యాలు
తెరుచుకుంటున్నాయి.
ఎందుకు లేరు
మహానుభావులు!
అందుకే ఈ భూగోళం
పడిపోకుండా వుంది.
Also read: పునర్ఘోష
Also read: గ్రౌండ్
Also read: బ్రెడ్
Also read: సముద్రం ముద్ర
Also read: సామూహిక