- రాష్ట్రంలో కొత్త పుంతలు తొక్కనున్న పాడిపరిశ్రమ
- రాష్ట్ర ప్రభుత్వం, అమూల్ ఒప్పందంతో సహకార డెయిరీలకు జవసత్వాలు
- రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా పాల సేకరణ కేంద్రాలు
ఎన్నికల సందర్భంగా చేసిన మేనిఫెస్టోలో వాగ్ధానాలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్న జగన్ సర్కార్ తాజాగా మరో వాగ్దానాన్ని అమలుపరుస్తోంది. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవలని కాంక్షించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ చేయూత ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పాడి పశువులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమూల్ తో ఎంవోయూ కుదుర్చుకుంది. రాష్ట్రంలోని మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమూల్ తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఇవాళ అమూల్ పాల వెల్లువ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఒప్పందం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో 6551 కోట్ల వ్యయంతో 9,899 గ్రామాల్లో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు.
అమూల్ పాల వెల్లువను ప్రారంభించిన సీఎం జగన్
వైఎస్సార్ చేయూత ద్వారా 4.69 లక్షలమంది మహిళలకు పాడి ఆవులు, గేదెలను పంపిణీ చేస్తారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ పాల వెల్లువ పథకం ప్రారంభమవుతుంది. ప్రతి పదిరోజులకు మహిళా రైతులకు పాల బిల్లులను నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ-అముల్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఏపీ అముల్ వెబ్ సైట్ , డాష్ బోర్డును కూడా ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అముల్ తో ఒప్పందం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని సీఎం అన్నారు.
అమూల్ ఒప్పందంతో బోలెడు లాభాలు
అమూల్ తో ఒప్పందం ద్వారా పాడి రైతులకు 5 నుంచి 7 రూపాయలు ఎక్కువ ధర లభించనుంది. దీని ద్వారా మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వీలుపడుతుందని సీఎం తెలిపారు. సహకార డెయిరీల్లోని పరికరాల పర్యవేక్షణను అమూల్ నిర్వహించే అవకాశం ఉంది. తద్వారా ఆస్తుల రక్షణ, ఉద్యోగులకు భద్రత చేకూరనుంది. మహిళా పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలకు అత్యధిక దిగుబడులు సాధించేందుకు గాను పాల సేకరణ, పశుపోషణపై అమూల్ శిక్షణ నివ్వనుంది. పశువులకు ఉచిత వైద్యం, పోషక విలువలు కలిగిన మేతను అందించనుంది.
స్వయం సమృద్ధి సాధించనున్న మహిళలు
వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కింద మహిళా లబ్ధిదారులకు ఏటా 11 వేల కోట్ల చొప్పున ప్రభుత్వం అందించనుంది. దాదాపు 52 వేల కోట్ల టర్నోవరు కలిగిన అమూల్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో పాల సేకరణ పెరిగి ఇతర రాష్ట్రాలకు పాడి ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఏర్పడనుంది.