• భారీ సంఖ్యలో హాజరైన రైతులు, మహిళలు
• జనభేరి సభను సందర్శించిన చంద్రబాబు
• అమరావతికి మద్దతు తెలిపిన బీజేపీ
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ జేస్తూ రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రక్షణకై జనభేరి పేరుతో రాయపూడిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, బైక్ ర్యాలీలతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు భారీ ప్రధర్శనగా సభాస్థలికి చేరుకున్నారు. జై అమరావతి అంటూ రైతులు చేస్తున్న నినాదాలతో సభావేదిక మార్మోగింది. జనభేరి నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆంక్షలు విధించారు. రాజధానికి వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సభకు వచ్చే వారిని ఎక్కడికక్కడ ఆపి వివరాలు సేకరించారు. అమరావతి కోసం అసువులు బాసిన వారికి నేతలు నివాళులర్పించారు.
శంకు స్థాపన ప్రదేశాన్ని సందర్శించిన చంద్రబాబు:
రాజధాని రైతులు నిర్వహిస్తున్న జనభేరి సభలో పాల్గొనేందుకు వెళుతున్న చంద్రబాబును వెలగపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి వెళ్లేందుకు అనుమతించాలని పార్టీ సీనియర్ నేతలు పోలీసులను కోరారు. ఉన్నాతాధికారులు అనుమతించడంతో చంద్రబాబు ఉద్దండరాయునిపాలెం చేరుకుని శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు అధికారం చేపట్టిన ఏడాదిన్నరలో ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి రైతులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషమని చంద్రబాబు అన్నారు. ఒక్క ఛాన్స్ అంటే ఎన్నికల ముందు ప్రాథేయపడిన జగన్ అధికారం వచ్చాక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అగమ్యగోచరంగా తయారు చేశారని విమర్శించారు.
ఇది చదవండి : అమరావతిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
మూడు రాజధానుల ఏర్పాటు వెనుక కుట్ర:
జనభేరి సభకు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఉపసంహరించాలంటూ తాము ఇదివరకే పలుమార్లు ముఖ్యమంత్రికి లేఖలు రాశామని రామకృష్ణ గుర్తు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటు వెనుక కుట్ర దాగిఉందని దాన్ని బయటపెడతామని రామకృష్ణ అన్నారు.
ఉద్యమానికి బీజేపీ మద్దతు:
అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు జనభేరి సభలోబీజేపీ తరపున పార్టీ ప్రతినిధి వామరాజు సత్యమూర్తి హాజరయ్యారు. అమరావతి రాజధాని ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతిస్తుందని సత్యమూర్తి అన్నారు. త్రికరణశుద్ధిగా రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకుంటున్నట్లు సత్యమూర్తి తెలిపారు. రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు. త్రికరణశుద్ధిగా అమరావతి రాజధానిగా ఉండాలని తాము విశ్వసిస్తున్నామని, ఆఖరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి హామీ ఇచ్చారు. రాజధాని రైతులను రోడ్డున పడేసిన జగన్ కు గుణపాఠం చెప్పాలని సత్యమూర్తి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఉద్యమం చేస్తున్న రైతుల పట్ల సానుభూతి కూడా చూపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చదవండి :రాజధాని రైతుల గోడు