అశ్వినీకుమార్ ఈటూరు
- మజ్లీస్ పార్టీ అంటే బీజేపీ భయపడదు
- టీఆర్ఎస్ కు ఒకే ఒక ప్రత్యామ్నాయం బీజీపీ
- టీఆర్ఎస్ కుటుంబ పాలనను అంతం చేస్తాం
- బీజేపీ 2023లో అధికారంలోకి వస్తుంది
- ఈటల రాజేందర్ కు ఓటు వేయండి
ఆదిలాబాద్ : ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 13 మాసాలకు కానీ హైదరాబాద్ కు స్వాతంత్ర్యం రాలేదనీ, అది కూడా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యూహరచన వల్లా, కార్యాచరణ వల్లా అది సాధ్యమైందని దేశ హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్ లో జరిగిన పెద్ద బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. 17 సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినంగా పరిగణించి పండుగ చేసుకోవాలని అమిత్ షా అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ విమోచన దినం ఘనంగా జరుపుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వాగ్దానభంగం చేసి వెనక్కి వెళ్ళారు ఎందుకని అంటూ ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అమిత్ షా అన్నారు. ఇది నిజాం అరాచక పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తం చేసిన రోజని చెప్పారు. అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఎంఐఎం పార్టీ అంటే తమకు భయం లేదనీ, కేసీఆర్ ఎదుకు భయపడుతున్నారనీ అడిగారు. 2023లో జరిగే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ గెలుపొందుతుందని బలంగా నమ్ముతున్నానని చెప్పారు.
నిర్మల్ లో ఒక చెట్టుకు వెయ్యిమంది స్వాతంత్ర్య సమరయోధులను ఉరి తీసిన కారణంగా ఇక్కడ సభ ఏర్పాటు చేశామని బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. (రజాకార్లు వెయ్యిమందికి ఉరి వేశారని చెబుతున్నారు కానీ వాస్తవంగా ఉరి తీసింది బ్రిటిష్ పాలకులు. ఉరి తీయబడినవారు తిరుగుబాటు చేసింది బ్రిటిష్ పాలకులపైన. ఉరికంబానికి వేళ్ళాడినవారిలో ముస్లింలు కూడా ఉన్నారు.)
ఈటల రాజేంద్ర మంచి నాయకుడని, సిద్దాంతాల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తి కనుకనే టీఆర్ఎస్ టిక్కెట్టు పై గెలిచిన సీటుకు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తున్నారనీ, ఆయనకు ఓట్లు వేసి గెలిపించాలనీ అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.