Monday, December 23, 2024

బీజేపీ విజయం వెనుక అమిత్ షా

  • ఎన్నికల్లో చాణక్య నీతిని ప్రదర్శిస్తున్న అమిత్ షా
  • ప్రత్యర్థులకు అందని రీతిలో వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట
  • ఒడిశా, బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య విజయాలు
  • ప్రతి ఎన్నికలనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ
  • ర్యాలీలు, రోడ్ షోలతో శ్రేణుల్లో ఉత్సాహం

పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంటు ఎన్నికల వరకూ బీజేపీ   అనుసరించే వ్యూహాలు ఇంచు మించు ఒకే రకంగా ఉంటాయి. ఆ వ్యూహాలతోనే ప్రత్యర్థులను చిత్తు చేసి దేశ వ్యాప్తంగా అప్రతిహత విజయాలతో బీజేపీ దూసుకుపోతోంది. కాని ఈ ఎన్నికల వ్యూహాలను రచించేది, క్షేత్ర స్థాయివరకూ పకడ్బందీగా అమలయ్యేటట్లు చూసేది మాత్రం మోదీ అనుంగు సహచరుడు అమిత్ షా మాత్రమే.  అమిత్ షా తన వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల గుండెల్లో భయాన్ని కలిగిస్తారు. విమర్శలతో విపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఎన్నికల్లో విజయానికి అమిత్ షా దీర్ఘకాలిక వ్యూహాలే కారణమని పార్టీ నేతలు భావిస్తారు. షా వ్యూహాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను మించి ప్రాచుర్యం పొందాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలకు అగ్రనేతల ప్రచారం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తరపున అగ్రస్థాయి నేతలు ప్రచారం చేయడాన్ని విపక్షాలు భూతద్దంలో పెట్టి చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు జాతీయస్థాయి నేతల ప్రచారం అవసరమా అని నొసలు చిట్లిస్తున్నాయి. ప్రధానిని కూడా ప్రచారానికి పిలవమంటూ వెటకారం చేస్తున్నాయి. కాని బీజేపీ నేతలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పనిలో నిమగ్నమైపోయారు.  డిసెంబరు 1న  పోలింగ్ జరగబోయే గ్రేటర్ ఎన్నికలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు  ప్రచారం చేయనున్నారు. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ హైదరాబాద్ వచ్చి అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీటు విడుదల చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, స్మృతి ఇరానీలు కూడా ప్రచారంలో పాల్గొని రాజకీయ వాతావరణంలో వేడి పుట్టించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు 2017 లోనే వ్యూహ రచన చేసిన అమిత్ షా

గ్రేటర్ ఎన్నికలకు 2017లో అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది అమిత్ షా సిద్ధాంతం. ఎన్నికలు పంచాయతీ ఎన్నికలయినా లోక్ సభ ఎన్నికలయినా ఓటరును ప్రసన్నం చేసుకోవడం మాత్రం కామన్. ఏ ఎన్నికల్లోనైనా విజయం కోసం శ్రమించాల్సిందే. అందుకే బీజేపీ జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో జాతీయ స్థాయి నేతలు పాల్గొంటున్నారు. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ ప్రతి ఎన్నికల్లో విజయం సాధించాలనేది అమిత్ షా వ్యూహం. ఇదే వ్యూహాలను రచించి ఒడిశాలో అమలు పరచడం ద్వారా పార్టీని విజయ తీరాలకు చేర్చారు.

ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ

 2017 ఒడిశా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దగా పట్టులేకపోయినప్పటికీ అగ్రనేతల ప్రచారం ద్వారా బీజేపీ నాయకులు ఓటర్ల మదిని దోచుకున్నారు. ఆ ఎన్నికలకు నాటి ఛత్తీస్ గడ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, రఘుబర్ దాస్ లతో  ప్రచారం చేయించారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రచారం లో పాల్గొన్నారు. 2017లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో 853 జిల్లా పరిషత్ లకు గాను 297 జిల్లా పరిషత్ లను కైవసం చేసుకుంది. 2012 లో 36 జిల్లా పరిషత్ లలో విజయం సాధించిన బీజేపీ,  అమిత్ షా  వ్యూహాలతో ఊహకందని విజయాలను సొంతం చేసుకుంది. 2012 లో 651 జిల్లా పరిషత్ లలో అధికారం దక్కించుకుని బలంగా ఉన్న బిజూ జనతాదళ్ 2017 ఎన్నికల్లో దాని బలం 451 కి పడిపోయింది. 297 జిల్లా పరిషత్ లను చేజిక్కించుకుని ప్రధాన ప్రతిపక్షమై అధికార బిజూ జనతాదళ్ కు పక్కలో బల్లెంలా మారింది. ఈ ఎన్నికల తర్వాత బీజేపీకి క్షేత్ర స్థాయిలో గట్టి పునాదులు పడ్డాయి. ఎన్నికల్లో విజయం  తర్వాత అమిత్ షా పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ పంచాయతీల నుంచి పార్లమెంటు వరకూ బీజేపీ అధికారం చేపట్టాలని అభిలషించారు.

బృహన్ ముంబయి మున్సిపల్ ఎన్నికలు

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు మంచి జోడిగా పేరు గడించారు. 2017లో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షం శివసేనతో అమి తుమీకి దిగింది బీజేపీ. ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో నువ్వా-నేనా అన్నంతగా పోటీ ఇచ్చింది. రెండు దశాబ్దాలుగా బృహన్ ముంబయి మున్పిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతున్న శివసేనను బీజేపీ  చావు దెబ్బ కొట్టిందనే చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికలకు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు  పదుల సంఖ్యలో రోడ్ షోలు, ర్యాలీలలో పాల్గొని శ్రేణులను ఉత్తేజపరిచారు. అప్పటి వరకు పెద్దగా బలంలేని బీజేపీ  ఈ ఎన్నికల్లో 82 సీట్లు సాధించగా శివసేన 84 సీట్లు మాత్రం విజయం సాధించగలిగింది.

ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు

సీన్ కట్ చేస్తే 150 డివిజన్లు ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటజీని అమలుపరుస్తున్నారు. యుద్ధ క్షేత్రంలో దిగాక బరిలో ఉన్న ప్రతివాడూ గెలవాలనే యుద్ధం చేస్తాడు.  ఎన్నికల రణ క్షేత్రంలో ప్రతి అభ్యర్థి గెలిచేందుకే ప్రయత్నిస్తాడు. అదే వ్యూహాన్ని అమిత్ షా కూడా అమలు చేస్తారు. పంచాయతీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు. చావో రేవో తేల్చుకోవాల్సిందే. గ్రేటర్ ఎన్నికల్లో అమిత్ వ్యూహాలను అమలు చేసేందుకు ఆయనకు అత్యంత సన్నిహితుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన భూపేంద్ర యాదవ్ ను రంగంలోకి దించారు. అమిత్ షా వ్యూహాలతో  టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉన్న దుబ్బాక ఉప ఎన్నికలో  బీజేపీ విజయం సాధించింది.

పార్టీకి రెండు కళ్లుగా మోదీ, అమిత్ షా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వికసిస్తున్న కమలానికి మోదీ, అమిత్ షాలు రెండు కళ్లుగా మారారు. 2014 నుంచి జరుగుతున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శిస్తున్న రణనీతికీ, బలప్రదర్శన తీరుకూ రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 1990 దశకంలో లాల్ కృష్ణ అడ్వానీ, అటల్ బిహారీ వాజ్ పేయిల జమానాలో కూడా బీజేపీ ఇంత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మోదీ, అమిత్ షా ల వలే ఇప్పటిలా పదుల సంఖ్యలో  రోడ్ షోలు, ర్యాలీలు గతంలో నిర్వహించిన దాఖలాలు లేవంటున్నారు.

తెలంగాణలో అధికారం కోసం వేచిచూస్తున్న బీజేపీ

ప్రస్తుత  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీ గండి కొట్టడంద్వారా  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారం చేపట్టేదిశగా అడుగులు వేయాలని అమిత్ షా, మోదీల వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అందరి పార్టీ

ఉత్తరాది పార్టీ అనే అపప్రధను పొగొట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. దక్షిణ భారత దేశంలో ఇప్పటికే కర్ణాటకలో అధికారం చేపట్టగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సత్తా చాటాలని పాగా వేసేందుకు వడి వడి గా అడుగులు వేస్తున్న బీజేపీకీ గ్రేటర్ ఎన్నికలు మంచి ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయనడంలో సందేహం లేదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles