- డిజిటల్ లెవీ టాక్స్ విధించనున్న అమెరికా
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్
- తమ సంస్థల ప్రయోజనాలే ముఖ్యమంటున్న అమెరికా
భారత్‌లో డిజిటల్ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలపై ప్రభుత్వం విధిస్తున్న ఈక్వలైజేషన్ లెవీకి ప్రతీకారంగా వాణిజ్యపరమైన చర్యలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. భారత్‌తో పాటు టర్కీ, ఇటలీ, యూకే, స్పెయిన్, ఆస్ట్రియాలపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. భారత్‌లో డిజిటల్ రంగంలో సేవలు అందించే విదేశీ సంస్థలు వాణిజ్య ప్రకటనల రూపంలో భారీగా ఆర్జిస్తున్నాయి. దీంతో ఈ సంస్థలకు ఏడాదికి లక్ష రూపాయల విలువ దాటి ఇచ్చే వాణిజ్య ప్రకటనలపై భారత ప్రభుత్వం 2016-17లో ఈక్వలైజేషన్ లెవీ పేరుతో పన్ను విధిస్తోంది. ఆయా సంస్థలకు ఇచ్చే వాణిజ్య ప్రకటనల విలువపై ఆరు శాతం పన్ను తగ్గించి వినియోగదారుడే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థల కార్యకలాపాలు భారత్‌లో పెరగడంతో చిల్లర వర్తకుల నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వం ఈ-కామర్స్ వ్యాపార విలువ ఆధారంగా పన్ను విధించింది. రెండు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసే సంస్థలపై ఏప్రిల్ నుంచి రెండు శాతం పన్ను కట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అమెరికా వివక్షాపూరితమైన వాణిజ్య ప్రక్రియలుగా వర్ణిస్తోంది.
Also Read: ఇండియా, అమెరికా రక్షణ మంత్రుల భేటీ
చర్చలకు సిద్ధమంటూనే చర్యలు :
ఇ-కామర్స్ సేవలపై పన్ను విధించటాన్ని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి ప్రతీకారంగా వర్తక చర్యలను తీసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఇండియా డిజిటల్ సర్వీసెస్ టాక్స్ పై యూఎస్ ట్రేడ్ యాక్ట్ లోని 301 సెక్షన్ కింద గత ఏడాది జూన్‌లో అమెరికా విచారణ చేపట్టింది. ఈ వ్యవహారం అమెరికాకు చెందిన డిజిటల్ సేవల కంపెనీలపై పక్షపాతం చూపించేదిగా ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారించారు. తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలతో డిజిటల్ పన్నుల అంశంపై విస్తృతంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ టాయ్ అన్నారు.
అమెరికా ప్రతికార చర్యలను వ్యతిరేకిస్తున్న భారత్:
అమెరికా ప్రతీకార చర్యలను భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. మిత్ర దేశం అంటూ అమెరికా దిగుతున్న ప్రతీకార చర్యలపై పరిశ్రమ వర్గాలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా అమెరికా విచారణలో తేలిన అంశాల అధారంగా, 301 సెక్షన్ కింద అమెరికా యూఎస్‌టీఆర్ ప్రతీకార చర్యలు ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికా చర్యలకు అమల్లోకి వచ్చినట్లయితే మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు, వెదురు, వజ్రాలు, రత్నాలు, ఫర్నిచర్, సిగరెట్ పేపర్ లాంటి ఉత్పత్తులపై అదనంగా యాడ్ వెలారమ్ పన్నులు విధించే అవకాశం ఉంది. యూఎస్ కంపెనీల నుంచి మనదేశం ఎంతమేరకు డిజిటల్ సర్వీసెస్ టాక్స్ వసూలు చేస్తుందో దాదాపు అంతే మొత్తాన్ని మనదేశం నుంచి వచ్చే వస్తువులపై పన్ను రూపంలో వసూలు చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆత్మరక్షణ కోసమే ‘క్వాడ్’