- ప్రమాణ స్వీకారానికి ముస్తాబవుతున్న శ్వేత సౌధం
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు
- హింసకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక
అధ్యక్షుడిగా జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు శ్వేత సౌధం సిద్ధమవుతోంది. ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో అమెరికా పూర్తిగా భద్రతా దళాల చేతుల్లోకి వెళ్లిపోయింది. రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతం పూర్తిగా ఆర్మీ చేతుల్లోకి వెళ్లడంతో ఈ ప్రాంతమంతా మిలటరీ జోన్ ను తలపిస్తోంది. అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ఎఫ్ బీఐ ముందస్తు హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో చరిత్ర లో కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా దళాలు పహరా కాస్తున్నాయి. నిరసనలు చెలరేగే అవకాశమున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కలవరపాటుకు గురవుతున్న అమెరికన్లు:
ఎఫ్ బీఐ నుంచి వచ్చిన హెచ్చరికలతో అమెరికావాసులు భయాందోళనలకు గురవుతున్నారు. బయటి వ్యక్తుల నుంచి ముప్పుఉందని భావించిన భద్రతా బలగాలు ఎఫ్ బీఐ తాజా హెచ్చరికలతో మరింత కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాపిటల్ హౌస్ తో పాటు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆందోళన కారులనను అడ్డుకునేందుకు భారీగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో సహా ఇప్పటికే దాదాపు 25 వేల మంది నేషనల్ గార్డ్స్ పహరాకాస్తోంది.
ఇది చదవండి: బైడెన్ ప్రవేశించనున్న శ్వేతసౌధం
హింసకు పాల్పడితే కఠిన చర్యలు:
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వాషింగ్టన్ సీక్రెట్ సర్వీస్ స్పష్టం చేసింది. అయితే ఆదివారం (జనవరి 17) అమెరికా వ్యాప్తంగా పలుచోట్ల నిరసన కారులు పలు రాష్ట్రాల్లోని క్యాపిటల్ భవనాల వద్ద తుపాకులు, అమెరికా జెండాలు చేతబట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అయా రాష్ట్రాల గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ఆందోళనకారులు హింసకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది చదవండి: అధికార బదిలీకి ముందు అమెరికా పరువు తీసిన ట్రంప్