Sunday, December 22, 2024

అయోమయంలో అమెరికా ఎన్నికల ఫలితాలు

  • కోర్టుకెల్లే ఆలోచనలో ట్రంప్
  • ఓట్ల లెక్కింపు నిలిపివేత
  • పోస్టల్ బ్యాలెట్ ను అనుమతించడంపై ట్రంప్ పేచీ

అమెరికాలో ఊహించినట్లుగానే గందరగోళం నెలకొంది. ఎన్నికల తీరు, లెక్కింపు, ఫలితాలపై  ట్రంప్ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందనే వాదనలు గత కొద్దిరోజులుగా బాగా వినిపించాయి. నేడు అదే నిజమయ్యేట్టుగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ ను అనుమతిస్తున్నారని, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లను అనుమతించడం వెంటనే ఆపాలని ట్రంప్ మరో మారు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే, తామే గెలిచినట్లుగా డోనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. డోనాల్డ్ చేసిన వ్యాఖ్యలను, ప్రకటనలను జోబైడెన్ వర్గం తీవ్రంగా ఖండించింది. ఓట్ల లెక్కింపును నిలిపివేయించేందుకు ట్రంప్ సుప్రీం కోర్టుకు వెళితే చట్టపరంగా ఎదుర్కోడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ బైడెన్ ప్రచార నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు.

ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే గెలుపు ప్రకటన

ఓట్ల  లెక్కింపు జరుగుతూ ఉన్న క్రమంలో, ఫలితాలు పూర్తిగా వెల్లడించక ముందే, తామే గెలిచామని ట్రంప్ ప్రకటించడం వెనకాల పెద్ద వ్యూహం ఉందనీ, ట్రంప్ అమెరికాలో రాజకీయ సంక్షోభం సృష్టించే అవకాశం ఉందని జర్మనీ రక్షణ శాఖ మంత్రి అన్నెగ్రెట్ క్రాంప్ వ్యాఖ్యానించారు. గెలుపుపై ట్రంప్, బైడెన్ ఇద్దరూ ధీమా వ్యక్తం చెయ్యడం సహజమైన అంశమే అయినప్పటికీ, వాస్తవ పరిస్థితులు నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. నిజమైన యుద్ధం ఇప్పుడే ఆరంభమైందని చెప్పాలి. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలను గమనిస్తే, అటు సర్వేలకు-ఇటు అగ్రనాయకుల వ్యాఖ్యలకు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి.

సర్వేలు అటూ, ఇటూ

అధ్యక్ష పీఠాన్ని నిర్ణయించే రాష్ట్రాల్లో ఫ్లోరిడా ఒకటి. ఇక్కడ బైడెన్ కు ఆధిక్యత ఎక్కువగా ఉంటుందని ప్రీపోల్స్ ఆన్నీ చెప్పాయి. కానీ, ఫలితాల సరళిలో ట్రంప్ ముందంజలో ఉన్నారు.కీలక రాష్ట్రాలైన జార్జియా, ఒహైయా, టెక్సస్ లో ట్రంప్ ఆధిక్యం కనిపిస్తోంది.యూటా, అరిజోనా, నెవాడలో బైడెన్ ముందున్నారు. కీలకమైన 12స్వింగ్ స్టేట్స్ లో ఫలితాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతున్నాయి. స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు సర్వేలు చెప్పాయి. ఇక్కడ చాలా చోట్ల ట్రంప్ ఆధిక్యమే కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇక్కడ ఒపీనియన్ పోల్స్ తల్లకిందులయ్యాయి. అర్బన్ ఓటర్లు జో బైడెన్ పట్లే మొగ్గుచూపించినట్లు ఫలితాలు చెబుతున్నాయి.

బైడెన్ 238, ట్రంప్ 213

బుధవారం రాత్రి పదింటి వరకూ అందిన సమాచారం మేరకు జో బైడెన్ కు 238 ఎలక్టోరల్ ఓట్లు, డోనాల్డ్ ట్రంప్ కు 213 వచ్చాయి. ఇంకా ఏడు రాష్ట్రాలలో కౌంటింగ్ పూర్తి కావలసి ఉంది. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలంటే 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాలి. ప్రస్తుతం ఉన్న సంఖ్యలు జో బైడెన్ ఆధిక్యాన్ని  తెలుపుతున్నాయి. అలస్కా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, పెన్సిల్వీనియా రాష్ట్రాల ఫలితాలు తేలాల్సి వుంది.  మిషిగన్ లో ఇద్దరి మధ్య హోరా హోరీగా ఉంది.అమెరికా రాజధాని వాషింగ్ టన్ డి సి (డిస్ట్రిక్ట్ అఫ్ కొలొంబియా)లో డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ క్లీన్ స్వీప్ చేశారు.

పెన్సెల్వేనియాపై ఇరువురి ఆశలు

పెన్సిల్వేనియా చాలా కీలకమైన స్వింగ్ స్టేట్స్ లో అత్యధిక ఓటర్లు కలిగిన మూడవ పెద్ద రాష్ట్రం. ఇక్కడ 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. 2016లో ట్రంప్ గెలుపునకు కీలక భూమిక పోషించింది ఈ రాష్ట్రమే. గతంలో డెమొక్రాట్లకు బాగా పట్టున్న రాష్ట్రం. గత ఎన్నికల్లో రిపబ్లికన్స్ పుంజుకున్నారు. ఈ నేపథ్యంలో, అటు డోనాల్డ్ ట్రంప్-ఇటు జోబైడెన్ ఈ రాష్ట్రంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు.ఈ రాష్ట్రంలో విజయం కోసం బైడెన్ తీవ్రంగా కష్టపడ్డారు. ఇక్కడ కూడా ఒపీనియన్ పోల్స్ నిజమవ్వలేదు. బైడెన్ కు ఆధిక్యమని చెప్పాయి. కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి.

బరాక్ ఒబామా ప్రచారం

ఇక్కడ నల్లజాతీయులను ఆకట్టుకోడానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా రంగంలో దిగారు. ఇక్కడ 84శాతం ఓటర్లు శ్వేతజాతీయులే కావడం ట్రంప్ కు కలిసి వచ్చింది. ట్రంప్ మాటలు వీరిని బాగా ఆకర్షించిన నేపథ్యంలో బైడెన్ పెన్సిల్వేనియాలో  వెనుకంజ వేయక తప్పలేదు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి ఓటింగ్ శాతం బాగా పెరిగింది.కరోనా నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఎక్కువ నమోదయింది.ఈసారి ఓటర్లలో యువతరం పెరిగింది. డోనాల్డ్ ట్రంప్ కు కలిసి వచ్చిన అంశాల్లో శ్వేతజాతీయ నినాదం, చైనా వ్యతిరేక వైఖరి, సంపదలో అభివృద్ధి, ఆర్ధిక ప్రగతి, స్వదేశీ ఉద్యోగాల పెరుగుదల మొదలైనవి చెప్పవచ్చు.

కరోనాపై పోరాటంలో ట్రంప్ వైఫల్యం

కరోనా పోరాటంలో ట్రంప్ ప్రభుత్వ వైఫల్యం, ప్రపంచ ప్రయాణంలో అమెరికా పాత్ర తగ్గడం, ట్రంప్ దురుసు ప్రవర్తన, వైస్ ప్రెసిడెంట్ గా బైడెన్ గతంలో మంచి ముద్ర వేసుకొని ఉండడం, ఈసారి ఉపాధ్యక్ష అభ్యర్థిగా  కమలా హ్యారిస్ ను ఎంపికచెయ్యడం,  అర్బన్ ఓట్లు అనుకూలంగా  ఉండడం మొదలైనవి జో బైడెన్ కు కలిసి వచ్చే అంశాలు.మొత్తంమీద ఈసారి అమెరికా ఎన్నికల తీరు గందరగోళంగా ఉంది. ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే. ప్రపంచమంతా అమెరికా వైపు తీవ్ర ఉత్కంఠతో చూస్తోంది.ఈ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles