- పశువుల కోసం నియోజకవర్గానికి ఒక్కో అంబులెన్స్
- త్వరలో పశుసంవర్ధకశాఖలో పోస్టుల భర్తీ
- కడక్‌నాథ్ కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సీఎం ఆమోదం
రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు అన్నివిధాలా అండగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాలలో విత్తనాల దగ్గర నుంచి పండిన పంట అమ్మే వరకు అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలైన పశువుల అభివృద్ధికి తోడ్పాటునందించాలని తద్వారా గ్రామ సీమల్లో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. పశువులకు సకాలంలో వైద్యం అందించడానికి ప్రత్యేక అంబులెన్సులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో అంబులెన్స్ ను మంజూరు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. లక్షల రూపాయలు పెట్టి ఖరీదైన జాతి పశువులను కొంటున్న సమయంలో జబ్బుపడి చనిపోతే వాటి యజమానులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు మారుమూల గ్రామాల్లో జబ్బు పడే పశువులకు తక్షణం చికిత్స అందించేందుకుగాను అంబులెన్సులను ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి పశువులను ఆసుపత్రికి తరలిస్తారు. పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో నిన్న (మార్చి 22) సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో ఇప్పటికే పశువులకు అంబులెన్సు సేవలు అందిస్తున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.
Also Read: ఏపీలో కొత్త ఒరవడికి సీఎం జగన్ శ్రీకారం
కడక్‌నాథ్ కోళ్లకు భారీ గిరాకీ:
కడక్‌నాథ్ కోళ్లకు మార్కెట్‌లో డిమాండు పెరుగుతున్న దృష్ట్యా కడప జిల్లా ఊటుకూరులో మూతపడిన పౌల్ట్రీ ఫాంను పునరుద్ధరణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకం కింద ప్రతి మూడు నెలలకోసారి చెల్లింపులు చేయాలని, ప్రస్తుతం ఉన్న98 కోట్ల రూపాయల బకాయిలను తక్షణం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పశునష్ట పరిహార పథకం వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో పశువైద్య సేవలు:
ప్రతి పశువైద్యుడు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా కేంద్రాల్లో సేవలందించాలని సీఎం ఆదేశించారు. . రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పశువైద్యులు, పశుసంవర్థక సహాయకులతోపాటు మత్స్యశాఖ సహాయకుల ఖాళీలను త్వరలో భర్తీ చేయాలన్నారు. వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ ల్యాబ్స్ కు సంబంధించిన భవనాలన్నీ జూన్ 1 నాటికి సిద్ధం చేయాలని సీఎం అన్నారు . కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక విభాగాలన్నిటికీ ఒకే కాల్‌సెంటర్, ఒకే నంబరు ఉండాలని అధికారులకు సూచించారు. మూడేళ్లలో అన్ని పశువైద్యశాలలను ఆధునికీకరించాలని సూచించారు.
Also Read: బీజేపీ, జనసేన మధ్య విభేదాలు ?
విత్తనాల నాణ్యతపై అధికారులదే బాధ్యత:
రైతు భరోసా కేంద్రాలలో కియోస్క్ ల ద్వారా పశువుల దాణా, మందులు సరఫరా చేయాలి, విత్తనం, దాణా, వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ చేయూత కింద అందించే పశువులకు ట్యాగ్ చేయించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించారు. రైతులకు ఇస్తున్న విత్తనాలు గ్యారంటీ, టెస్టెడ్, నాణ్యమైనవని ప్రభుత్వం ముద్ర వేసి విత్తనాలు ఇస్తున్నాం. విత్తనాలు నాణ్యంగా లేవని రైతులు ఫిర్యాదు చేస్తే అందుకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు.
గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అమూల్ :
అమూల్ పాల వెల్లువ కార్యక్రమం వచ్చే వారం నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభమవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఏప్రిల్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోనూ ప్రారంభిస్తామని తెలిపారు. చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో అమూల్ పాల వెల్లువ అమలు తీరుపై సేకరించిన వివరాలను సీఎంకు నివేదించారు. అధికారుల సమీక్షలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, ఏపీ మత్స్య విశ్వవిద్యాలయ ఏర్పాట్లపై చర్చించారు.
Also Read: వాలంటీర్లకు ఉగాది సత్కారాలు