పుస్తక పరిచయం
“డజను మంది కర్రలు పట్టుకుని నా ముందు వరసగా ప్రమాదకరంగా నిలబడితే వారి ముందు నేను భయం చూపులతో ప్రాధేయ పడుతూ నిలబడిన దృశ్యం పద్దెనిమిది సంవత్సరాలైనా నేను మరిచిపోలేక పోతున్నాను. ఇప్పటికీ నాకు ఆ ఘటన స్పష్టంగా వివరంగా గుర్తుకొస్తుంది. గుర్తుకు వచ్చిన ప్రతిసారీ కన్నీళ్ళు వస్తాయి. హిందువులకి అంటరాని మనిషి, పార్శీలకి కూడా అంటరానివాడేనని నాకు అప్పుడే మొదటిసారి తెలిసింది.” (పేజి – 13)
న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్శిటీ లో అభ్యసించి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుతూ ప్రపంచ మేధావులెందరితోనో స్నేహం ఉండి అనితరసాధ్యమైన పాండిత్యాన్ని గడించి ఇండియా చేరిన డా.బి.ఆర్. అంబేద్కర్ కి తలదాచుకునే చోటులేక రైల్వేస్టేషన్ లో గంటల కొద్దీ గడిపి చివరికి ఒక పార్శీ మఠంలో మారుపేరుతో ఉన్నందుకు ఎదురైన అనుభవం ఇది!
“తరగతిగదిలో ర్యాంకులని బట్టి పిల్లలని కూర్చోబెడతారు. కానీ నేను అందరితోబాటు నా ర్యాంకుని బట్టి కూర్చోకూడదు. గదిలో ఒక మూలన వేరుగా ఒక్కణ్ణీ కూర్చోవాలి. క్లాస్ రూంలో కింద వేసుకుని కూర్చోడానికి నాకు వేరే గోనె పట్టా ఉండాలి. స్కూలంతా తుడిచేవాడు నేను వాడిన గోనె పట్టా ముట్టుకోడు. నేను ప్రతిరోజు సాయంత్రం గోనెపట్టాని ఇంటికి తీసుకుపోయి స్కూలుకి వచ్చేటప్పుడు వెంట తెచ్చుకోవాలి.” ( పేజి – 7)
ఒకటా రెండా? ఎన్ని అవమానాలకి కుదేలై తట్టుకుని నిలబడగల చేవ చేకూర్చుకుని చరిత్ర గతినే మార్చగలిగిన ధిక్కార స్వరంగా వెలిగి అద్వితీయ వ్యక్తిత్వాన్ని నిర్మించు కోగలిగాడు. హిందువులకి అంటరాని వాడైనవాడు క్రైస్తవులకి, పార్శీలకి, ముస్లింల కి కూడా అంటరానివాడేనని అర్దం చేసుకున్న అంబేద్కర్ బౌద్ధాన్ని మతంగా కాకుండా ఒక విముక్తి మార్గంగా స్వీకరించినట్లు తెలుస్తోంది!
“..చాకలివాళ్ళు లేక కాదు. చాకలికి డబ్బులివ్వలేక కూడా కాదు. మేం అంట రానివాళ్ళం కాబట్టి, అంటరానివాళ్ళ బట్టలని ఏ చాకలీ ఉతకడు…మంగలులు లేకా కాదు, మాకు వారికి డబ్బిచ్చే స్తోమత లేకా కాదు. అంటరానివాళ్ళం కాబట్టి ఏ మంగలీ మా జుత్తు కత్తిరించడు..” (పేజి – 8)
విస్తృతంగా రచనా వ్యాసంగం చేసిన అంబేద్కర్ తన వ్యక్తిగత జీవితం రాసింది తక్కువ. ఆ రాసినవేవైనా ఉంటే అవి ఈ 20 పేజీలు మాత్రమే. Ambedkar – Autobi ographical Notes పేరిట Navayana సంస్థ 2003 లో ప్రచురించిన ఈ చిన్ని బుక్లెట్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చిట్టిబాబు గారి అనువాదంగా అదే సంవత్సరంలో “అంటబడనివాడు: అంబేద్కర్ అనుభ వాలు” అని ప్రచురించింది. ఇరవై పేజీల చిన్ని పుస్తకం వెల 5 రూపాయలు. వసంతమూన్ సంపాదకత్వం వహించిన అంబేద్కర్ రచనలు & ఉపన్యాసాలు వరుసలో 12 వ సంపుటిలో ” వీసా కోసం ఎదురుచూపు” అనే శీర్షికతో ఇవి ఉన్నాయని ముందుమాటలో పేర్కొన్నారు!
తండ్రిని చూడ్డానికని ఊరెళ్ళిన పిల్లాడిగా బండి వాళ్ళతో ఎదురైన చేదు అనుభవం మొదలుకొని తనని బండిమీద తీసికెళ్ళాలనే ఉత్సాహంతో ఎవరూ బండికట్టకపోయే సరికి సాటి దళితులే బండి తోలడం వల్ల కిందపడి తీవ్రంగా గాయపడిన దుర్ఘటన వరకూ అక్షరాలు కావవి అంతరాత్మ పెట్టుకున్న కన్నీళ్ళే!
చివరగా గాంధీజీ పత్రిక “యంగ్ ఇండియా” లో, కులోన్మాదం తలకెక్కిన డాక్టర్ కారణంగా ఒక దళిత టీచరు భార్య మరణించిన ఉదంతాన్ని ప్రచురించిన ఘటన, శివరాం అనే ఒక దళిత కుర్రాడి అనుభవాన్ని కూడా అంబేద్కర్ నోట్ చేశారు. బహుశా ఇలాంటి అనేక సంఘటనలు నమోదు చేసి ప్రచురించాలనే తలంపు ఆయనకి ఉండేది. సామాజిక కార్యకర్తలే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదివి తీరాల్సిన పుస్తకం !
– గౌరవ్