- రాజ్యాంగం వ్యాసాలు, రాజ్యాంగం, పీఠిక 1
అంబేడ్కర్ రాజ్యాంగ రచయిత కాదు. అంబేడ్కర్ మన రాజ్యాంగానికి తండ్రి. కీలకమైన నిర్మాత కూడా. Father of Indian Constitution. రచయిత కన్న తండ్రి, నిర్మాత గొప్పవారు. పార్లమెంటు వేరు. రాజ్యాంగ రచనా సభ వేరు. కేవలం రాజ్యాంగం నిర్మించడానికి పుట్టి, ఆ తరువాత కనుమరుగయ్యేది రాజ్యాంగ రచనా సభ-Constituent Assembly. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికై రాజ్యాంగ నియమాలను అనుసరించి చట్టాలు చేసే సభ పార్లమెంటు. మన రాజ్యాంగ రచనా సభకు అధ్యక్షుడు కలకత్తా హైకోర్టులో ప్రాక్టీసు చేసిన న్యాయవాది రాజేంద్ర ప్రసాద్. ఆయన ఏ పార్టీకీ సంబంధం లేని స్వతంత్ర వ్యక్తి.
తొలి చిత్తుప్రతి రూపకర్త బిఎన్ రావ్
29 ఆగస్టు 1947న అంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన 14 రోజులకు రాజ్యాంగ రచనా సభ ఒక రచనా ఉప సంఘాన్ని రూపొందించింది. ప్రముఖ పరిపాలనాధికారి, న్యాయవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజ్యాంగసభ సలహాదారు అయిన బిఎన్ రావ్ (కన్నడ) రూపొందించిన తొలి చిత్తుప్రతిని ఈ రచనా సంఘం పరిశీలించి రాజ్యాంగసభముందు చర్చకు సమర్పించాలని ఈ సంఘానికి లక్ష్యాన్ని నిర్దేశించారు. ‘‘రాజ్యాంగ నిర్మాణంచేసిన ఘనత నాకు ఇచ్చారు, కాని నిజంగా అది నాకు చెందదు. అందులో కొంత సర్ బి ఎన్ రావ్ కు చెందుతుంది..రాజ్యంగ సభకు ఆయన రాజ్యాంగ సలహాదారుడు. ఆయనే తొలి చిత్తు ప్రతి రూపొందించి మా డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు సిద్ధం చేశారు’’ అంబేడ్కర్ 25 నవంబర్ 1949న రాజ్యాంగ సభలో చెప్పారు.
ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులు మాత్రమే రాజ్యాంగ సభలో ఉంటారు. అంబేడ్కర్ను బొంబాయి గెలిపించలేదు. బెంగాల్ నుంచి ముస్లింలీగ్ మద్దతుతో సభ్యులైనారు. దళితులకు మైనారిటీలకు సమాన హక్కులు సాధించడానికే వస్తున్నానన్నారు. కాని దేశవిభజనతో ఆయన స్థానం పాకిస్తాన్ కి వెళ్లిపోయింది. బొంబాయి రాష్ట్ర ప్రధాన మంత్రి (స్వతంత్రానికి ముందు ఆయారాజ్యాలకు ప్రధానమంత్రులు ఉండేవారు) బిఎన్ ఖేర్ కు రాసిన ఒక ఉత్తరంలో అంబేడ్కర్ ను బొంబాయి నుంచి గెలిపించాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఎం ఆర్ జయకర్ తో రాజీనామా చేయించి, అంబేడ్కర్ను గెలిపించుకుని రాజ్యాంగసభకు పంపారాయన. అంబేడ్కర్ మహోన్నత విద్యావంతుడు, అటు ఆర్థిక శాస్త్రం, ఇటు న్యాయశాస్త్రం ఆపోసన పట్టిన వాడు. పాలనా వ్యవస్థల నిర్మాణం గురించే అధ్యయనం చేసిన వ్యక్తి. కనుక రచనా ఉప సంఘంలో ఉండాలని రాజేంద్రప్రసాద్ సూచించారు. ఇతర సభ్యులు - అల్లాడి క్రిష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కె ఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్ (వీరు అనారోగ్యంతో రాజీనామాచేస్తే ఎన్ మాధవరావు సభ్యులైనారు), డిపి ఖైతాన్ (వీరు 1948లో మరణిస్తే టిటి కృష్ణమాచార్య చేరారు). ఈ సంఘం సభ్యులు 1947 ఆగస్టు చివర తొలిసమావేశంలో అంబేడ్కర్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ‘‘గోపాలస్వామి అయ్యంగార్ రాజ్యవ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. సాదుల్లా, మాధవరావు గార్లకు డిల్లీ వాతావరణం సరిపడలేదు. పాలన, న్యాయ, రాజ్యాంగ రంగాలలో నిపుణుడైన రావ్, ఆయాదేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మనదేశంలో అప్పుడున్న భారత ప్రభుత్వ చట్టం 1935ను విస్తరిస్తూ రాజ్యాంగం మొదటి చిత్తు ప్రతిని బెనెగల్ నర్సింగ్ రావ్ రూపొందించారు. ఆ తరువాత అందులో సూత్రాలను పునర్నిర్మించడంలో కీలకమైన కృషి చేసారు. ఆయన కూడా తరువాత విదేశాల్లో ఉండిపోవడం వల్ల అందుబాటులో లేరు. ఒకరిద్దరి పాత్ర లేనే లేదు. మరికొందరి పాత్ర స్వల్పం, మొత్తం భారం అంబేడ్కర్ పైన పడింది’’ అని టిటి కృష్ణమాచారి చెప్పారు. అంబేడ్కర్ ఆ బాద్యతను నిర్వహించి రాజ్యాంగ పిత అయ్యారు. మరికొన్ని ఉపసంఘాలు కూడా చాలా సహకరించాయి. కేంద్ర అధికారాల కమిటీకి నెహ్రూ, రాష్ట్రాల అధికారాల కమిటీ నేతగా వల్లభ్ బాయ్ పటేల్, ప్రాథమిక హక్కుల కమిటీకి జె బి కృపలానీ, ఇంకా అనేకానేక అంశాలపైన ఎన్నోఉపసంఘాలు పనిని పంచుకున్నాయి. ప్రాథమిక హక్కుల కమిటీకి అంబేడ్కర్ ఇచ్చిన వివరమైన పత్రం చాలా కీలకమైంది. సభలో రాజనీతిజ్ఞులైన ప్రముఖులెందరో బాగా ఆలోచించి 7635 సవరణలను ప్రతిపాదించారు. వాటిలో 2473 సవరణలను చర్చించి ఆమోదించారు. మిగిలినవి చర్చించి తిరస్కరించారు. ప్రతి పదం పైన, వాక్యం పైన వివాదాలు వచ్చాయి. అన్నిటికీ అంబేడ్కర్ సమాధానం చెప్పారు. సరైనవనుకున్న వాటిని ఆమోదించారు. బిఎన్ రావ్ 243 ఆర్టికిల్స్ 13 షెడ్యూళ్లతో ప్రతిని రూపొందిస్తే, అంబేడ్కర్ అధ్యక్షతన ఉన్న రచనా కమిటీ అనేక చర్చలు సవరణల తరువాత 395 ఆర్టికిల్స్ 8 షెడ్యూళ్లతో పూర్తి చేసింది.
4 నవంబర్ 1948 నాడు రాజ్యాంగం తొలి ప్రతిని చదవి రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు. పశ్చిమబెంగాల్ నుంచి ఎన్నికైన సభ్యుడు నజీరుద్దీన్ అహ్మద్ మొదటినుంచి రాజ్యాంగం చిత్తుప్రతిలో లోపాలను ఎత్తిచూపుతూ ఉండేవారు. తొలి చిత్తుప్రతిని కూడా ఆయన దుయ్యబట్టారు. ఇందులో అసంఖ్యాకంగా తప్పులు ఉన్నాయి. లోపాలు ఎన్నెన్నో, పనికిరాని రాతలూ, పదేపదే ఒకే విషయం చెప్పడం వంటివెన్నో అన్నారు. రాజ్యాంగ రచనలో కమిటీ పారదర్శకత పాటించలేదని రాజ్యాంగ సభ ఆమోదం లేకుండా మార్పులు చేసారని కూడా నిరసించారు. నిజానికి ఇది కేవలం ఆయన అనుమానం. దాన్ని ఆరోపణగా మార్చేసారు. వ్యాకరణం తప్పులను కూడా నజీరుద్దీన్ ఎత్తిచూపి తీవ్రంగా విమర్శించే వారు. నజీరుద్దీన్ మాత్రమే కాదు, కె సంతానం (మద్రాస్), ఆర్ ఆర్ దివాకర్ (బాంబే) మౌలానా హస్రత్ మోహానీ (యునైటెడ్ ప్రావిన్సెస్) కూడా రచనను పదే పదే విమర్శించేవారు. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ, చట్టవ్యతిరేకంగా తనను తాను రాజ్యాంగ సంఘం (కానిస్టిట్యూషన్ కమిటీ) గా మార్చుకున్నదని వ్యాఖ్యానించారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గారు రాజ్యాంగ సభ నిర్ణయాలను రచనలో పొందుపర్చడమే కాకుండా ఆ నిర్ణయాలను సమీక్షించారని కొన్ని చోట్ల వాటికి కొత్తరూపం ఇచ్చారని దివాకర్ విమర్శించారు. రాజ్యాంగ లక్ష్య తీర్మానపు (ఆబ్జెక్టివ్ రిజల్యూషన్) పరిధులను అంబేడ్కర్ మించిపోయారని, ఇదివరకు తీర్మానానికి అనుగుణంగా ఉండే బదులు, ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త తీర్మానం(పీఠిక) కావాలని ఆయన అభిలాష అని మోహానీ విమర్శించారు. ఈ రిజల్యూషన్ ఆ తరువాత పీఠిక గా రూపొందింది.
ఇదంతా ఎందుకంటే ఈ పీఠిక (ప్రియాంబుల్) రాసిందెవరు అనే ప్రశ్న కోసం. నిజంగా వెంటనే సమాధానం ఇవ్వడానికి వీలుకాని ప్రశ్న ఇది. రాజ్యాంగ సభ లో జరిగిన చర్చలు, మార్పులు, చేర్పులు ప్రసంగాల వివరాలు ఉన్నాయి కాని రాజ్యాంగ రచనా సంఘం లో సభ్యుల మధ్య జరిగిన చర్చలు, సవరణ ప్రతిపాదనలు, చేసిన మార్పులు, చేర్పులు, తుది రూపం ఇచ్చేముందు జరిపిన సంప్రదింపులకు సంబంధించిన సమాచారం లేదు. ఆ వివరాలు ఎక్కడా రాసిలేవు. రాజ్యాంగ సభలో ఈ పీఠికకు తుదిరూపంపైన చర్చకుముందు జరిగిన వివరాలు లేవు. మనకే కాదు, రాజ్యాంగ సభ సభ్యులకు కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో జరిగిన చర్చల వివరాలు అందుబాటులో లేవు.
యుపిఎస్ సి కోచింగ్ వారంతా పీఠిక ఎవరు రాసారు అనగానే జవహర్లాల్ నెహ్రూ అని జవాబు ఇస్తారు. దానికి కారణమేమంటే నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్య తీర్మానమే భావి భారత రాజ్యాంగానికి లక్ష్య, ఉద్దేశ్య ప్రకటనగా రూపొందింది. మోహానీ చెప్పినట్టు రచనాసభ చర్చావివరాలు లేకపోవడాన్ని ఈ సందర్భంలోనే అంబేడ్కర్ వ్యతిరేకులు విమర్శించడానికి ఉపయోగించుకున్నారు. ఇక్కడే అసలు రాజ్యాంగం మొదటిచిత్తు ప్రతి సేకరించి, అన్ని నియమాలు ఒకచోట గుదిగూర్చి, చర్చకు ప్రాతిపదికగా రూపొందించిందిన ఘనత రాజ్యాంగసభ సలహాదారుడైన బి ఎన్ రావ్ కు దక్కుతుందనే వారు ఉన్నారు. తొలి చిత్తు ప్రతిరూపకల్పనలో రావ్ పాత్ర నిర్వివాదాంశం. అయితే పీఠిక కూడా రావ్ గారే రాసారనడానికి వీలు లేదు. ప్రతిసభ్యుడి ప్రతిస్పందనను ఆధారంగా చేసుకుని, చాలా జాగ్రత్తగా రాజ్యాంగ వాక్యాలను రచనా సంఘం ముఖ్యంగా అంబేడ్కర్ నిర్మించారనేది నిర్వివాదాంశం. అయినా వివాదం చేయదలచుకున్నవారికి వివాదం కావచ్చు కూడా. చాలా సందర్భాలలో అందరు సభ్యులు హాజరు కాలేదు. పీఠికా నిర్మాణ సమయంలో రాజ్యాంగ రచనా ఉపసంఘానికి చెందిన నలుగురు మాత్రమే తొలి సమావేశాల్లో పాల్గొన్నారు. ఏ రోజూ వదలకుండా మొత్తం రచనా ఉపసంఘం సమావేశాలన్నింటికీ వచ్చిన ఏకైక వ్యక్తి అంబేడ్కర్ మాత్రమే. కనుక రాజ్యాంగం నిర్మించిన రచనా ఉపసంఘం అధ్యక్షుడు అంబేడ్కర్ కే పీఠిక నిర్మాణం ఘనత కూడా చెందుతుంది. అయితే రాజ్యాంగ రచన, పీఠిక రచన రెంటికి మధ్య సారూప్యత ఉన్నా కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. నిజానికి రచన, నిర్మాణం అనే పదాల మధ్య తేడాను కూడా అర్థం చేసుకొనవలసిన అవసరం ఉంది. ‘ముఖ్య నిర్మాత’ అన్నంత మాత్రాన అన్ని భాగాలకు రచయిత కూడా వారే అవుతారని అనడానికి వీలుండదు. అంబేడ్కర్ రాజ్యాంగం రచన పూర్తయిన తరువాత ఇచ్చిన ప్రసంగం, నెహ్రూ లోకసభలో 6 డిసెంబర్ 1956 (అంబేడ్కర్ నిర్యాణ దినం) నాడు చేసిన ప్రసంగం కూడా రాజ్యాంగ ముఖ్య నిర్మాత అంబేడ్కర్ అనే విషయాన్ని ధృవీకరిస్తాయి. ‘‘సాధారణంగా రాజ్యాంగ నిర్మాతలలో అంబేడ్కర్ ఒకరు అంటారు. కాని రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కన్న ఎక్కువ శ్రద్ధచూపిన వారుగానీ కష్టపడ్డావారు గానీ మరొకరు లేర’’ని జవహర్లాల్ నెహ్రూ చాలా స్పష్టంగా ప్రకటించారు. అయితే అంబేడ్కర్ తన చివరి ప్రసంగంలో రాజ్యాంగ నిర్మాణ ఘనత తానొక్కడికే ఇవ్వడం సరికాదని ప్రకటించారు. డ్రాఫ్టింగ్ కమిటీలో, రాజ్యాంగ సభలో కూడా అనేక మంది రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించారని ఆయన వివరంగా చెప్పారు. ఈ రకరకాల చర్చల మధ్య రాజ్యాంగ పీఠికకు కర్త ఎవరు అనే విషయం మరుగున పడిపోయింది. ఆకాశ్ సింగ్ రాథోర్ మాత్రం తన పుస్తకానికి ‘‘అంబేడ్కర్స్ ప్రియాంబుల్’’ అని పేరు పెట్టారు. రాజ్యాంగ రహస్య చరిత్ర అని కూడా ఉపశీర్షిక తగిలించారు.
మాడభూషి శ్రీధర్ 26.1.2024