వోలేటి దివాకర్
వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పినట్లు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని ప్రార్ధించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల రైతులు పాదయాత్రగా జాతీయ రహదారిపై మీదుగా నేరుగా అరసవిల్లికి చేరుకోవచ్చు. ఈ విధానం ఉద్యమకారులకు, ప్రజలకు కూడా మేలు చేస్తుంది. అయితే, ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకే గ్రామాల మీదుగా యాత్ర సాగిస్తున్నారన్నది కాదనలేని నిజం. ఉత్తరాంధ్ర ప్రజల ఆమోదాన్ని పొందేందుకే రాజధాని రైతులు రధాన్ని వెంటబెట్టుకుని గ్రామాల్లో ఊరేగింపులు తీస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్రకు ప్రతిగా అధికార వైసిపి ఆయా ప్రాంతాల్లో రౌండుటేబుల్ సమావేశాలను నిర్వహిస్తోంది.
Also read: అధికార పార్టీలో మళ్లీ అంతర్గత పోరు ?! వారు పార్టీలో చేరడం ఆయనకు ఇష్టం లేదా?
రాజధానిగా అమరావతిని కొనసాగించాలా…పాలనా వికేంద్రీకరణ జరగాలా? అన్న అంశంపై అధికార విపక్ష పార్టీలు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాయి. ఈ విషయంలో రాష్ట్రంలోని ఒక్క పార్టీ కూడా తటస్థ … వాస్తవ వైఖరిని అనుసరించడం లేదు. మొన్నటి వరకు బిజెపి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడినా … రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అనుకూలంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాలు మొదటి నుంచీ టిడిపితోనే అంటకాగుతున్నాయి. అమరావతికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఉద్యమబాట పట్టగా … వికేంద్రీకరణకు మద్దతుగా అధికార పైసిపి రౌండుటేబుల్ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే, విచిత్రం ఏమిటంటే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన పత్రికలు, మీడియా కూడా చెరోపక్షం చేరిపోయాయి. అమరావతికి అనుకూలంగా కొన్ని పత్రికలు పుంఖానుపుంఖాలుగా వార్తల ప్రచురిస్తూ .. అధికార పార్టీ రౌండుటేబుల్ సమావేశాల వార్తలను తోసిపుచ్చుతున్నాయి. అధికారపక్ష మీడియా కూడా అమరావతి రైతుల యాత్రను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయమై రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. అమరావతి మంచిదా … అధికార వికేంద్రీకరణ మంచిదో వివరించే రాజకీయ, ప్రజాసంఘాలు కరవయ్యాయి.
Also read: గోదావరి తీరంలో బుల్డోజర్ నడిపిస్తారా?!
వైసిపి అధికారంలోకి రాగానే ఒక బలమైన వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు రాజధాని వికేంద్రీకరణ చేపట్టిందన్నది కూడా కాదనలేని వాస్తవం. రాజధానిలో గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా వైసిపి ప్రభుత్వం పక్కనపెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ఎక్కడున్నా అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలన్నది ప్రజల ఆకాంక్ష.
Also read: అధికార పార్టీలో అంతా ఆసమర్థులేనా?