Sunday, December 22, 2024

ఏకపక్ష నిర్ణయాలతోనే రాజధాని విషాదం

  • ఎప్పటికైనా ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారం
  • తటస్థమైన, అందరికీ ఆమోదమైన రాజధానే శాశ్వత పరిష్కారం
  • అందరినీ కలుపుకొని పోయే లక్షణం ఇద్దరికీ లేకపోవడం దురదృష్టం

పరకాల ప్రభాకర్ గారు రాజధాని విషాదం పేరుతో ఒక వీడియో ని రిలీజ్ చేశారు. ఇది ఈ అంశంపై ఒక మంచి చర్చను ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. కొన్ని అంశాలను ఎక్కువ ప్రాధాన్యం తో ఆ వీడియోలో ప్రస్తావించి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. వాటిని ఇక్కడ పంచుకుంటున్నాను.

అది ఏకపక్ష నిర్ణయం

2014 లో  కొత్తగా తెలంగాణ విడిపోయిన పిదప ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అని నిర్ణయించే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి గారు విస్మరించిన ప్రధానమైన అంశం రాజధాని ఏర్పాటు విషయంలో ఉన్న చారిత్రక నేపథ్యం. 1952-53 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి వచ్చినప్పుడు రాజధాని ఏర్పాటు నల్లేరుపై నడకలాగా సులభంగా జరగలేదు. వివిధ ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోటీపోటీగా రాజధాని ఏర్పడటానికి అనేక పట్టణాలు ప్రతిపాదించడం జరిగింది. చాలా సలహాలు సంప్రదింపుల తర్వాత చివరకు కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఉండేవిధంగా నాటి సీనియర్ నాయకులు ప్రకాశం పంతులుగారు నిర్ణయించారు. ఆయన పట్ల గౌరవం వల్లకానీ, ఎటు తిరిగి  అనతికాలంలోనే విశాలాంధ్ర ఏర్పడుతుందనే నమ్మకం, హైదరాబాద్ కు రాజధాని తరలిపోతుంది అనే విశ్వాసం వల్ల కానీ పెద్దగా వివాదం లేకుండానే ఆనాడు కర్నూలు లో  రాజధాని ఏర్పడటానికి దోహదపడ్డాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మిగిలిన ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రాంతీయ వ్యక్తిత్వాలు (sub regional identities) చాలా బలంగా ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలు బలమైన గుర్తింపు ఉన్న ప్రాంతాలు. రాజధాని నిర్ణయం ఎవరు చేసినా ఈ వైవిధ్యాన్ని గుర్తించి, అంగీకరించి అన్ని ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, విస్తృత అవగాహనతో, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నిర్ణయం తీసుకోవాలి. ఏ రాజధాని కూడా అందరూ అంగీకరించి, అందరూ తమదిగా భావిస్తేనే (inclusive capital) ఎక్కువ కాలం మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. 2014 సంవత్సరంలో ఇటువంటి  ప్రక్రియ లేకుండానే ఏకపక్షంగా రాజధాని నిర్ణయం జరిగిపోయింది. ఈనాడు రాజధాని అస్తిత్వానికి సంబంధించి జరుగుతున్న వివాదానికి బీజం ఆనాడే పడింది. అమరావతిని ఒక తటస్థ రాజధానిగా, అందరూ తమదిగా భావించే రాజధానిగా (inclusive capital) ప్రజలు అనుకోలేదు.

ఇదీ ఏకపక్ష నిర్ణయమే

ఆనాడు అమరావతిని రాజధానిగా నిర్ణయించటం ఎంత ఏకపక్షంగా జరిగిందో, అదే ధోరణిలో ఇంకా ఎక్కువ ఏకపక్షంగా ఈరోజు మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్షనేత. కారణాలు ఒత్తిడులు ఏమైనా అసెంబ్లీలో మనస్ఫూర్తిగా అమరావతిని రాజధానిగా ఈయన ఆహ్వానించడం ప్రజలందరూ చూశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విస్తృత చర్చ తరువాత అన్ని ప్రాంతాల అంగీకారంతో ఒక రాజీ మార్గం ద్వారా రాని ఈ నిర్ణయం కూడా దీర్ఘకాలంలో మనజాలదు.

ఇక అమరావతి విషయంలో సమస్యను జటిలం చేసే మరో అంశం అవసరానికి మించి, పెద్ద ఎత్తున భూ సమీకరణ. భూ సమీకరణ జరిగింది రాజధాని కోసం కాదు. ఒక మహా నగర నిర్మాణానికి. ఊహాజనిత లాభాలను ఆశ గా చూపి, కొంతవరకు బలవంత మార్గాలు అనుసరించి ఈ భూ సమీకరణ చేయడం జరిగింది. అంతవరకు భూ సమీకరణ లో ఉన్న అనుభవం నగరాలకు దగ్గరగా ఉండేచిన్న చిన్న కమతాల కు ప్లాట్లకు పరిమితం. నగరాల మధ్య లో నో దగ్గరగా నో ఉన్నాయి కాబట్టి ఆ భూములకు విలువ రావటానికి పెద్ద సమస్య లేకపోయింది. కానీ ఒక గ్రామీణ ప్రాంతంలో 30 వేల ఎకరాలకు విలువ చేసే విధంగా ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాని మీద ఒక అవగాహన లేకుండానే ఈ మొత్తం కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రాజధాని అక్కడ ఉన్నా లేకపోయినా మీ ఊహా జనిత దశ (speculative phase ) అయిపోగానే భూముల విలువలు తగ్గిపోయి ఉండేవి. ఈ మొత్తం రాజధాని వ్యవహారాన్ని ఈ విస్తృతమైన భూ సమీకరణ మరింత క్లిష్టతరం చేసింది.

భూసమీకరణతో సమస్య జటిలం

ఇక రాజధాని అక్కడ వస్తుంది అనే సమాచారం తెలిసి  కొందరు భూములు కొని లబ్ధి పొందారనే ఆరోపణ మూడవ అంశం. ఇది ఏ స్థాయిలో ఉన్నది మొత్తం 30 వేల ఎకరాల్లో ఎన్ని వేల ఎకరాలకు ఇది వర్తిస్తుంది అనే అంశం పై ప్రతిపక్షంలో ఆరోపణలు చేసిన ప్రస్తుత అధికార పక్షం ఒకటిన్నర సంవత్సరం తర్వాత కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. అది ఎంత విస్తృతిలో జరిగింది అనే అంశం తెలియకపోతే దీనిపై ఒక నిర్ణయానికి రావడానికి కానీ దీనికనుగుణంగా రాజధాని అంశాన్ని నిర్ణయించటానికి కానీ వీలుపడదు.

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన రాజధానుల చరిత్ర పరిశీలిస్తే, తటస్థ ప్రాంతాలలో ఏర్పడిన, అందరూ తమవిగా భావించే రాజధానులు (neutral and inclusive capital)మాత్రమే ఎక్కువ కాలం మనగలిగాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులలో ఇటువంటి అర్థవంతమైన చర్చకు, విస్తృత అవగాహనకు, రాజీ మార్గం ద్వారా ఈ సమస్య పరిష్కారానికి సరైన పరిస్థితి లేకుండా పోయింది. అంతకు ముందు అమరావతి నిర్ణయం ఎంత ఏకపక్షంగా నడిచిందో ఈనాడు మూడు రాజధానుల నిర్ణయం కూడా అంతే ఏకపక్షంగా నడుస్తున్నది. ప్రస్తుతం సమస్యలు కోర్టుల పరిధిలో ఉన్నా కోర్టు తీర్పు ఎటు వచ్చినా, విస్తృత చర్చ జరిగి రాజీ మార్గం ద్వారా ఒక తటస్థ ప్రదేశంలో అందరూ అంగీకరించే విధంగా రాజధానిని ఏర్పరుచుకోనంతవరకు ఈ సమస్య ఇలాగే కొనసాగితే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి రాజకీయ నాయకుల లో దార్శనికత చాలా అవసరం. మన దురదృష్టం ఈనాడు ఇరువురు నాయకులకు దార్శనికత లోపించటం.

IYR Krishna Rao
IYR Krishna Rao
రచయిత ఐఏఎస్ విశ్రాంత అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి. సుప్రసిద్ధ పుస్తక, వ్యాస రచయిత. బీజేపీ నాయకులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles