ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు 2014లో జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయడానికి ముందే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగో రోజే సుప్రసిద్ధ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావూ, నేనూ కలిసి మాజీ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్ళాం. ఎన్నికలలో గెలిచినందుకు ఆనందంగా కనిపించిన చంద్రబాబునాయుడిని అభినందించిన తర్వాత నేనే చొరవతీసుకొని ‘‘రాజధానికోసం కొత్తనగరం నిర్మించాలని మీరు అనుకుంటున్నారని విన్నాం. దానికి అమరావతి అని పేరు పెడితే బాగుంటుంది. అలనాడు ఇంద్రుడి రాజధాని అమరావతి, ఈ నాడు ఈ చంద్రుడి రాజధాని అమరావతి. బాగుంటుంది’’ అన్నాను. పొత్తూరి కూడా ‘బాగుంటుంది, మంచి సూచన’ అన్నారు. చంద్రబాబునాయుడు నవ్వి ‘ఇంకా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’ అన్నారు. అప్పటికే నిర్ణయించుకున్నారో లేక రామోజీరావు చెప్పిన తర్వాతనే ఖరారు నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. అది అంత ముఖ్యం కూడా కాదు. అమరావతి అనే ఒక నగరం కొత్తగా నిర్మాణం అవుతుందనే ఆలోచనే సంతోషం కలిగించింది.
భారత దేశం పల్లెల నుంచి నగరాలకు వలస వెడుతున్న దశలో ఒక కొత్త నగరం నిర్మించాలనీ, దానికి అన్ని రకాల ఆధునిక హంగులూ కల్పించాలనీ సంకల్పించడం ఆనందం కలిగించింది. విశాఖపట్టణానికి తోడు మరో నగరం ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తారనే అనుకున్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కొన్నిమాసాలలోనే చంద్రబాబునాయుడు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు అకస్మాత్తుగా బైబై చెప్పి విజయవాడకు మకాం మార్చారు. రాజధాని నగరంగా అమరావతిని ప్రకటించారు. సింగపూర్, లండన్, వివిధ ప్రపంచ నగరాలలో చంద్రబాబునాయుడు, ఆయన బృందం పర్యటించి హడావుడి చేశారు. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అమరావతిని విశాలమైన ప్రాంతంలో పెద్దగా నిర్మించాలని శాసనసభ సాక్షిగా అన్నారు. అమరావతి పరిధిలోనే తన నివాసం కూడా నిర్మించుకున్నారు.
అనంతరం డిజైనింగ్, బాహుబలి సెట్లూ, రాజమౌళి సలహాసంప్రతింపులూ వగైరా పత్రికలలో వచ్చినవే. మహానగరం నిర్మించాలనే ఉద్దేశంతోనూ, తానే ముఖ్యమంత్రిగా రెండో సారి కూడా ఎన్నిక కాబోతున్నాననే గట్టి నమ్మకంతోనూ చంద్రబాబునాయుడు ప్రణాళికాబద్దంగా, నింపాదిగా, వివరంగా కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ నివేదికను బుట్టదాఖలు చేశారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ముఖ్యమంత్రి హోదాలో ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీ కృష్ణానదీ తీరంలోనే కొత్త రాజధాని నిర్మించాలని సిఫార్సు చేసింది. ఆ కమిటీ సభ్యుల జాబితా చూస్తే వారు ముఖ్యమంత్రి అభీష్టం మేరకే సిఫార్సు చేస్తారనే విషయం తెలిసిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ వద్దని సిఫార్సు చేసిందో అక్కడే రాజధాని నిర్మాణం జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసింది.
భూసమీకరణకు కొత్త పుంతలు తొక్కారు. అమరావతి ప్రాంతంలోని రైతులను ఒప్పించి అవసరానికంటే కొంత అదనంగానే భూమి సేకరించారు. ఆ ప్రక్రియ జయప్రదం కావడం విశేషం. కొన్ని గ్రామాలవారు భూములు ఇవ్వడానికి నిరాకరించారు. మొత్తం మీద ముఖ్యమంత్రి ప్రేరణ, మంత్రి నారాయణ కృషి ఫలితంగా భూసమీకరణ అనే పెద్ద సమస్య పరిష్కారమైంది. భూములు ఇచ్చిన రైతులంతా అభివృద్ధి చెందిన అమరావతి నగరంలో తమకు తెలుగుదేశం ప్రభుత్వం వాగ్దానం చేసినట్టు విలువైన నివేశన, వాణిజ్య స్థలాలకు యజమానులు కాబోతున్నామనే ఆశతో ఉన్నారు.
అంతర్జాతీయ డిజైనింగ్ సంస్థల నుంచీ, ముంబయ్ కి చెందిన సంస్థ నుంచీ డిజైన్లు తెప్పించారు. అమరావతి కోర్ కెపిటల్ రీజియన్ కు మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ కు చెందిన సుర్బానా జురాంగ్ రూపొందించింది. ఆ ప్లాను ప్రకారం నగరం నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది. చాలా వ్యయం అవుతుంది. నిధులు సేకరించడం మహాయజ్ఞం. అంతవరకూ వ్యవహారం నడిపించేందుకు తాత్కాలిక ప్రాతిపదికపైన సచివాలయ భవనాల సముదాయం, శాసనసభ, శాసనమండలి భవనం నిర్మించారు. హైకోర్టు నిర్మాణం కూడా దాదాపు పూర్తయింది. ఎంఎల్ ఏ లకూ, ప్రభుత్వాధికారులకూ క్వార్టర్ల నిర్మాణం చివరి దశలో ఉంది. శాశ్వత ప్రాతిపదికపైన నిర్మించవలసిన భవనాల పని ప్రారంభమైంది. రోడ్లు కొంత మేరకు నిర్మించారు.
ఇంతలో 2019 ఎన్నికలు వచ్చేశాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ ఆర్ సీపీకి కనీవినీ ఎరుగని మెజారిటీ వచ్చింది. తెలుగు దేశం పార్టీకి అనూహ్యంగా ఘోరపరాజయం ఎదురైంది. ఓట్ల శాతంలో వ్యత్యాసం అంతగా లేకపోయినా సీట్ల సంఖ్యలో తేడా కొట్టవచ్చినట్టు కనిపించింది.వైసీపీకి వచ్చిన 151 స్థానాలు ఎక్కడ, టీడీపీకి దక్కిన 23 స్థానాలు ఎక్కడ? అధికారంలోకి వచ్చిన కొన్నాళ్ళకు జగన్ మోహన్ రెడ్డి అడ్డం తిరిగారు. అమరావతి ఒక్కటే రాజధాని కాదు. మొత్తం మూడు రాజధానులు ఉంటాయి. వాటిలో ఒకటిగా, శాసనరాజధానిగా (లేజిస్లేటివ్) అమరావతి ఉంటుంది, కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటీవ్) రాజధానిగా విశాఖపట్టణం ఉంటుంది. న్యాయరాజధానిగా (జుడీషియల్) కర్నూలు ఉంటుందని కొత్త పాట అందుకున్నారు. దీనిని వికేంద్రీకరణ అంటున్నారు.
దాదాపు ఆ సమయంలోనే ప్రముఖ పాత్రికేయుడు, ‘ద ప్రింట్’ సంపాదకుడు శేఖర్ గుప్తా అమరావతి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చిత్రాలతో కాఫీ టేబుల్ బుక్ ను ఎమెస్కో పబ్లిషర్స్ అందంగా ప్రచురించింది. మిత్రుడు విజయకుమార్ (ఎమెస్కో అధినేత) కోరిక మేరకు శేఖర్ గుప్తాను పిలిస్తే ఆయన వచ్చారు. ‘జయహో’ టైటిల్ తో బ్రహ్మాండంగా వచ్చిన పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రితో శేఖర్ గుప్తా, నేనూ కలిసి మధ్యాహ్న భోజనం చేశాం. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి అంటే మంచి అభిప్రాయంతో శేఖర్ దిల్లీ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అమరావతి ఒక్కటే రాజధాని కాదనీ, మొత్తం మూడు రాజధానులు ఉంటాయనీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిందో వెంటనే శేఖర్ గుప్తా తన చానల్ లో ‘అది తుగ్గక్ చర్య’ అంటూ విమర్శించారు. అంతవరకూ ‘సాక్షి’లో వారంవారం వచ్చే శేఖర్ గుప్తా కాలమ్ ఆగిపోయింది. నేను శేఖర్ గుప్తాకి ఫోన్ చేసి ఎందుకంత కటువుగా మాట్లాడారని అడిగాను. ‘‘దేశంలో ఎక్కువ నగరాలు కావాలి. అమరావతిలో మరో మహానగరం ఏర్పాటైతే అది దేశానికి మంచిది, సముద్రతీరానికి దగ్గరలో మరో మహానగరం ఏర్పడటం అవసరం. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన నగరాన్ని రాజధాని కాదని అనడం అవివేకం’’ అని అన్నారు.
‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’ అనే టైటిల్ తో కందుల రమేష్ రాసిన పుస్తకం సమగ్రమైనది. అమరావతి ఒకే ఒక రాజధానిగా ఎందుకు ఉండాలో వాదిస్తూ ఆయన పుస్తకం రచించారు. ఒక రైతు వ్యథ, మద్రాసు కథ, వయా కర్నూలు, భాగ్యనగరంతో బంధం, ఒక సవాలు-ఒక అవకాశం, ఆంధ్రనగరి ఆవిష్కరణ, భూసేకరణ మహాయజ్ఞం, రైతుల పేరు మీద రచ్చ, భూస్వాములా? బక్కరైతులా?, ‘కమ్మ’రావతి, రాజధాని-దళితులు, ఎన్ని భూములు – దేనికోసం? పర్యావరణానికి ప్రమాదం? ఇన్ సైడర్ కథాకమామిషు, గ్రాఫిక్ మాయాజాలమా? అమరావతిలో వసతులు, అందరి చూపు ఆంధ్రవైపు, అమరావతికి నిధులెక్కడివి? ప్రపంచబ్యాంకును వెళ్ళగొట్టిందెవరు? శిదిల నగరం, మూడురాజధానుల ముచ్చట, నేతిబీరకాయలో నెయ్యి, పార్టీలు, ప్రజాసంఘాలు, రైతులు, శ్రీబాగ్ ఒప్పందం, కుంటిసాకులు, అమరావతే రాజదాని, కోర్టు చెప్పినా కాదంటే..? ఎలా ముందుకు వెళ్ళాలి? అనే శీర్షికలతో 28 చాప్టర్లు సకారాత్మకంగా రాశారు. చివరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను చేసిన ఇంటర్వ్యూ ప్రచురించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలలో కొన్నింటిని రచయిత చంద్రబాబునాయుడిని అడిగారు. ఆయన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పారు. ఆ వివరాలు కూడా ప్రచురించారు. అనుబంధంలో శ్రీబాగ్ ఒప్పందం, జస్టిస్ వాంఛూ కమిటీ సిఫార్సు, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు సారాంశం, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీం వివరాలు, వగైరా తబ్సీళ్ళు ఇచ్చారు. ఫొటోలు, పట్టికలూ ప్రచురించారు. ఈ 328 పేజీల పుస్తకం సులభగ్రాహ్యంగా, చదివించే విధంగా ఉంది.
అమరావతి ఒకేఒక రాజధానిగా ఉండాలనే వాదనను సమర్థిస్తూ రాశారు కనుక దీనికి కొన్ని పరిమితులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రతివాదన వినిపించాలని కోరేవారు మరో పుస్తకం రాయడం ఒక్కటే మార్గం. ఈ ఉదంతాలకు సంబంధించి అదనపు సమాచారం ఏమైనా ఉంటే అందులో పొందుపరచవచ్చు. అమరావతిని ఎందుకు వద్దని అనుకుంటున్నారో. మూడు రాజధానుల వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటో వాదించవచ్చు. చర్చ అన్నది ప్రజాస్వామ్యంలో ప్రాణవాయువు వంటిది. ప్రజలకు అన్ని విషయాలూ స్పష్టంగా, వివరంగా చెబితే వారు తీసుకునే నిర్ణయాలు వారు తీసుకుంటారు. ఎన్నికల తీర్పు సమయం సమీపిస్తూనే ఉంది. మహా అయితే ఒకటిన్నర సంవత్సరాలు. వాస్తవాలు మన కళ్ళ ఎదుటే ఉన్నాయి. ఇదంతా ఎనిమిది సంవత్సరాలలో జరిగిన పరిణామాల సమాహారమే. మీడియా ఎవరికి కొమ్ముకాసినా, ఎంత గందరగోళం సృష్టించినా నిజాలు తెలుసుకోవడం అసాధ్యం కాదు. అమరావతి రైతులు నిరశన దీక్షలు చేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ ఒకసారి పాదయాత్ర చేశారు. అమరావతి నుంచి అరిసెవెల్లి మరో యాత్ర సాగింది. ఈ యాత్ర సందర్భంగా అధికారపార్టీ స్పందించి పోటీ ఉద్యమం ప్రారంభించింది. ఉత్తరాంధ్ర జాయంట్ యాక్షన్ కమిటీనీ, రాయలసీమ జాయంట్ యాక్షన్ కమిటీనీ నెలకొల్పారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమాలు నిర్మించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని సమస్యకు ఒక నేపథ్యం ఉంది. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నేపథ్యాన్ని తెలుసుకొని ఉంటారు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జిల్లాలు విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడే రాజధాని ఎక్కడ ఉండాలనే వివాదం తలెత్తింది. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు జిల్లాలు విడిపోవాలనే నిర్ణయం జరిగిన మరుక్షణమే మద్రాసు విడిచి వెళ్ళిపోవాలని ఆంధ్రనాయకులకు నాటి ముఖ్యమంత్రి రాజాజీ స్పష్టం చేశారు. తెన్నేటి విశ్వనాథం విశాఖపట్టణం రాజధాని అయితే బాగుంటుందని అన్నారు. గౌతు లచ్చన్న తిరుపతి సరైన రాజధాని అవుతుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. కమ్యూనిస్టులు విజయవాడ కావాలని పట్టుపట్టారు. కాంగ్రెస్ నాయకులు విజయవాడ వద్దని గొడవ. స్థూలంగా చెప్పుకోవాలంటే కమ్మవారు విజయవాడ రాజధాని కావాలనీ, రెడ్లు వద్దనీ వాదులాడుకున్నారు. తుది నిర్ణయాన్ని నాటి ముఖ్యమంత్రి ప్రకాశానికి అధికారపార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన నాయకులు వదిలిపెట్టారు. ఆయన ఒక్కరే కూర్చొని ఒక కాగితంపైన కర్నూలు అని రాసి విశ్వనాథానికి ఇచ్చారు. అదే ఖరారయింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర అస్థిత్వ ఉద్యమాలు ఉండనే ఉన్నాయి. దక్షిణకోస్తాలోని అమరావతిని ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించలేదు. జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల విధానం సహజంగానే ఉత్తరాంధ్ర. రాయలసీమ ప్రజలకు నచ్చుతుంది. వచ్చే ఎన్నికలలో ఇది బలమైన నిర్ణాయకాంశం కాగల అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికలలో ఓట్లు సాధించే అంశమైనా అది న్యాయమైన, సమంజసమైన విధానం కానక్కరలేదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ఒకే రాజధాని ఉండేది. అందులో అరవై శాతం భూభాగం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరమా? పరిపాలనా సంబంధమైన, చట్టసంబంధమైన, న్యాయసంబంధమైన వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటే రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ, సాధారణ ప్రజలకు కానీ చాలా సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్రావతారంలో రాజధానిది ప్రధానమైన భాగం. శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో రాజకీయనాయకులూ, ప్రభుత్వ ఉన్నతాధికారులూ అమరావతిలో మజిలీ చేయడం, కోర్టు వ్యవహారాలు ఉంటే అధికారులు విశాఖపట్టణం నుంచి కర్నూలు పోయిరావడం కష్టతరమైన తతంగం. ఉత్తరప్రదేశ్ జనాభా (30కోట్లు)లో నాలుగో వంతు కంటే తక్కువ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లోమూడు విభిన్నమైన సంస్కృతులూ, ఆకాంక్షలూ, నేపథ్యాలూ గల ప్రాంతాలు ఉన్నాయనుకుంటే ఉత్తరప్రదేశ్ లో అటువంటివే నాలుగు ఉన్నాయి (పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, సెంట్రల్ యూపీ, బుందేల్ ఖండ్). అంత పెద్ద రాష్ట్రానికి లక్నో ఒక్కటే రాజధాని. అక్కడే కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభలు, ఉన్నత న్యాయస్థానం కూడా ఉన్నాయి. హైకోర్టు బెంచ్ అలహాబాద్ లో అదనంగా ఉంది. చంద్రబాబునాయుడు ముందుగానే అభివృద్ధి చెందిన విశాఖపట్టణం రాజధానిగా ప్రకటించి ఉంటే బాగానే ఉండేది. డిజైన్లూ, ప్రపంచ పర్యటనలూ, అప్పులూ లేకుండా సూక్ష్మంలో అయిపోయేది. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలన్న నియమం ఏమీ లేదు. ముంబయ్ మహారాష్ట్రకు మధ్యలో లేదు. ముంబయ్ లోనే చట్టసభలూ, కార్యనిర్వాహక సంస్థ, న్యాయస్థానం ఉన్నది. నాగపూర్ లో హైకోర్టు అదనపు బెంచి ఉంది. చెన్నై తమిళనాడుకు మధ్యలో ఉన్న నగరం కాదు. మూడు విభాగాలూ ఒకే నగరంలో ఉన్నాయి. కాకపోతే కర్నూలులోనూ, విశాఖలోనూ అదనంగా హైకోర్టు బెంచీలు సుప్రీంకోర్టు అనుమతితో పెట్టుకోవచ్చు. కానీ మూడు విభాగాలూ మూడు చోట్ల ఏర్పాటు చేయడం అంటే అంత సమంజసంగా లేదు.
అమరావతిలో భూసేకరణకోసం రైతులతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది. కమ్మవారు ఎక్కువగా ఉన్నారనీ, వారి ఆధిక్యం అధికమనీ, అది అమరావతి కాదు ‘కమ్మ’రావతి అనీ వాదించేవారికి కందుల రమేష్ దీటుగా సమాధానం చెప్పారు. అమరావతి జనాభాలో ఏ కులంవారు ఎంతమంది ఉన్నారో నిగ్గుతేల్చారు. రాజధాని భూసమీకరణలో భూములు ఇచ్చిన రైతులలో 32 శాతం ఎస్సీలూ, ఎస్టీలనీ, బీసీలు 14 శాతమనీ, రెడ్డి కులస్థులు 20 శాతమనీ, కమ్మవారు 18 శాతమనీ తేల్చారు. సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ పెత్తనం అగ్రకులాలవారి చేతుల్లోనే ఉండవచ్చు. అది వేరే విషయం. అగ్రకులాలలో కూడా రెడ్లు కమ్మవారి కంటే అధికంగా ఉన్నారని రమేష్ ప్రచురించిన జాబితా స్పష్టం చేస్తున్నది. రెండూ ఆధిపత్య కులాలే.
ఇన్ సైడర్ ట్రేడింగ్ వంటి వ్యవహారం అమరావతిలో జరిగిందనీ, అమరావతి రాజధాని ప్రాంతాన్ని గుర్తించి ప్రకటించే లోపు నూజివీడు వైపు రాజధాని ఉండవచ్చునంటూ పుకార్లు వచ్చాయనీ, వాటిని పుట్టించింది నాటి ముఖ్యమంత్రి అనుయాయులేననీ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవేనని రమేష్, చంద్రబాబునాయుడు కొట్టివేశారు. నిరాధారం కాదని, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పడానికి తగిన సామగ్రి ఎవరి దగ్గరా ఉన్నట్టు లేదు.
2014 నుంచి అయిదేళ్ళు పరిపాలించిన చంద్రబాబునాయుడు తాత్కాలిక కట్టడాలూ, శాశ్వత కట్టడాలూ అని పని విభజన చేయకుండా శాశ్వత ప్రాతిపదికపైనే రాజధానికి అవసరమైన ప్రాథమిక హంగులు సమకూర్చి ఉన్నట్లయితే జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం కష్టమయ్యేది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా వచ్చి అమరావతికి వివిధ నదుల నుంచి సేకరించిన జలాలూ, పలు పవిత్రస్థలాల నుంచి సేకరించిన మట్టితో శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టి ఉంటే శాశ్వత సదుపాయాల కల్పనకు సమయం సరిపోయేది. అప్పుడు తాత్సారం చేయడం, దేశాలు పట్టుకొని తిరగడంతో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక చట్టసభ అవసరం ఏర్పడింది. న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు అమరావతికి అనుకూలంగా ఇచ్చినప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం ఉండాలని జగన్ మోహన్ రెడ్డి విధానాన్నిబలపరిచేవారు వాదిస్తున్నారు. చంద్రబాబునాయుడు చేసిన పొరపాటే జగన్ కూడా చేస్తున్నారు. కోర్టుల జోక్యం కారణంగా విశాఖపట్టణానికి ఇంతవరకూ తరలి వెళ్ళలేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ ప్రాంతంలో వెడతామంటున్నారు. అప్పటికి ఎన్నికలకు సంవత్సరం గడువు ఉంటుంది. 2014-19లో చంద్రబాబునాయుడు మరోసారి గెలుపు ఖాయం అని అనుకున్నట్టే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి 2024 లో తన పార్టీకి 175 సీట్లు వచ్చి తీరతాయని అంటున్నారు. అంచనాలు తారుమారై, చంద్రబాబునాయుడు మళ్ళీ అదికారంలోకి వస్తే అప్పుడు విశాఖ నుంచి తిరగి చలో అమరావతి అనడం ఖాయం. అప్పుడు విశాఖపట్టణం చరిత్రలో మరో దౌలతాబాద్ అవుతుంది. ఈ క్రమంలో పదేళ్ళ విలువైన సమయం వృథా అవుతుంది. రమేష్ చెప్పినట్టు ఇప్పటికైనా మించి పోయింది లేదు. అమరావతిని రాజధానిగా ఖాయం చేసి మిగిలిన సదుపాయాలను కల్పించవచ్చు. మహానగరం ఒకరు కడితే నిర్మాణం కాదు. దానంతట అదే కాలక్రమేణా ఆవిష్కృతం అవుతుంది. హైదరాబాద్ ను ముహమ్మద్ కులీకుతుబ్ షా 1591లో నిర్మించాడు. తర్వాత సహజంగానే మహానగరంగా ఎదిగింది. కాకపోతే రాజకీయ నాయకులు తీసుకునే కొన్ని చొరవలు నగర విస్తరణకు కొంత మేరకు దోహదం చేస్తాయి. అమరావతి విశాల నగరంగా రూపొందడానికి అవసరమైన భూములు ఎట్లాగూ ఉన్నాయి. ఎస్ఆర్ఎం యూనిర్శిటీ వంటి విద్యాసంస్థలూ వచ్చాయి. మూడేళ్ళ కిందట బ్రేక్ పడకపోతే ఈ పాటికి అమరావతి ప్రభుత్వ ప్రమేయం లేకుండానే చాలా ప్రగతి సాధించి ఉండేది. పరిశ్రమలకు విశాఖను కేంద్రంగా చేసుకోవచ్చు. రాయలసీమలో కూడా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు. అనంతపురం సమీపంలో కియా కార్ల సంస్థ నెలకొల్పినట్టే బెంగళూరుకో, చెన్నైకో దగ్గర ఉండాలని కోరుకునే పారిశ్రామికవేత్తలు రాయలసీమను ఎంచుకోవచ్చు. తిరుపతిని మరో విద్యా కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మూడు ప్రాంతాలనూ (దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలను) సమదృష్టితో చూడాలి. హైదరాబాద్ లో చేసినట్టు అభివృద్ధినంతటినీ అమరావతిలో కానీ విశాఖపట్టణంలో కానీ కేంద్రీకృతం చేయకూడదు. రాజధాని నగరంగా సహజంగానే అమరావతి అభివృద్ధి చెందుతుంది.
రమేష్ రచన ‘అమరావతి, వివాదాలు-వాస్తవాలు’ అందరూ తప్పని సరిగా చదువవలసిన పుస్తకం. అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకునేవారూ, మూడు రాజధానులే మేలని అనుకునేవారూ, ఎక్కడైనా పర్వాలేదనుకునే తటస్థులు కూడా ఈ పుస్తకం చదవాలి. చదవడం, విషయం తెలుసుకోవడం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రతిస్పందించడం అవసరం. ఆంధ్రప్రదేశ్ లో (తెలంగాణలో సైతం) పౌరసమాజం స్తబ్దుగా, చైతన్యరహితంగా, నిర్వికారంగా కనిపిస్తున్నది. రాజకీయాలు మాత్రం నాటుగా, ఘాటుగా, పూటుగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలోనే రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు. ప్రభుత్వాల, రాజకీయ నాయకుల చర్యల పట్ల ప్రజలు స్పందించకపోతే ప్రభువులు నియంతలవుతారు. అందుకు ప్రభువులను నిందించి ప్రయోజనం లేదు. చైతన్య రహితమైన పౌరసమాజం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. చదవడం, అర్థం చేసుకోవడం, చర్చించడం, హితవు చెప్పడం, వాదించడం, వ్యతిరేకించడం, ప్రతిఘటించడం, పోరాడటం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్ఠం చేసే ప్రక్రియలు. పౌరులు ఈ పనులు చేయకపోవడం బాధ్యతారాహిత్యం. బాధ్యత గుర్తెరగని పౌరులకు హక్కులను అడిగే హక్కు ఉండదు. కందుల రమేష్ రాసిన ఎన్ టి రామారావు జీవిత చరిత్ర మావెరిక్ మెసయ్య కూడా చదవండి. ప్రామాణికమైన రచన.
(అమరావతి, వివాదాలు-వాస్తవాలు, రచన, ప్రచురణకర్త: కందుల రమేష్. ముద్రణ: రెయిన్ బౌ ప్రింట్ ప్యాక్, అమీర్ పేట్, హైదరాబాద్, పేజీలు 328. ఈ-బుక్ రూపంలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.)