స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం నవంబరు 6 నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగ్ జరిపేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్ణయించింది. కరోనా కల్లోలం, లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఏడు నెలల విరామం తరువాత స్పీడ్ అందుకోనుంది. అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా పై అటు సినీ పరిశ్రమలో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో విలన్ గా విజయ్ సేతుపతి నటించవలసిఉండగా .. పలు కారణాలరీత్యా ప్రకాష్ రాజ్ , జగపతి బాబులను తీసుకున్నారు. భారీ యాక్షన్ సన్ని వేశాల్ని వైజాగ్ లో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇది ఈ చిత్రానికి హైలెట్ గా చెప్పవచ్చు.
తిరుమల కొండలకు దగ్గర్లో ఉన్న శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, లారీ డ్రైవర్ పుష్పరాజ్ రోల్‌లో అలరించనుండగా.. పల్లెటూరు పిల్లలా రష్మిక అలరించనుంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి.
ఈ చిత్రం షూటింగ్ నవంబరు 3 నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని రంప చోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో చిత్రీకరించవలసి ఉండగా … సడన్ గా షెడ్యూల్ ని వైజాగ్ కి మార్చబడింది. అయితే దీనికి గల కారణాలను మాత్రం చిత్ర యూనిట్ వెల్లడించలేదు.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. మిగిలిన తారాగణాన్ని చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది.
తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ.