- వైఎస్ షర్మిలతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి భేటి
- బ్రదర్ అనిల్ తోనూ సుదీర్ఘ మంతనాలు
- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు
తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో వైఎస్ షర్మిల వేగం పెంచారు. అనుచరగణంతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలతో వైసీపీ నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. గంటకు పైగా ఆమెతో సమావేశమైన ఆళ్ల అనంతరం ఆమె భర్త బ్రదర్ అనిల్‌తో కూడా సుదీర్ఘ మంతనాలు జరిపారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పంపిన దూతగానే ఆళ్ల వచ్చిఉంటారని, ఆయన అనుమతితోనే షర్మిల, బ్రదర్ అనిల్‌తో మంతనాలు జరిపి ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ పెట్టే విషయంలో జగన్ మోహన్ రెడ్డికి, ఆయన సోదరి షర్మిల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షర్మిల పార్టీ నిర్ణయంలో తమకు సంబంధం లేదని వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు భేటీ అయి ఉంటారని రాజకీయ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి.
ఇదీ చదవండి:కేసీఆర్ వ్యూహం: తెలంగాణలో షర్మిల?
భేటీ ఆంతర్యం ఏమిటో?
షర్మిల, బ్రదర్ అనిల్‌తో ఎమ్మెల్యే ఆళ్ళ ఏం చర్చించారన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వేడిని రగుల్చుతోంది. వైఎస్ జగన్ కు సన్నిహితుడిగానే కాకుండా ఆయన కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి రాయబారిగానే చర్చలకు వచ్చారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు షర్మిల పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుండగా ఆమెను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా పేరున్న రామకృష్ణారెడ్డి షర్మిలతో, బ్రదర్ అనిల్‌తో మంచి సంబంధాలున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో ఆళ్ల తరపున షర్మిల ప్రచారం చేశారు.
ఇదీ చదవండి: అన్న వీడిన తెలంగాణ గడ్డపై…అయ్యారే… చెల్లె షర్మిలమ్మ సాము ?
ఆందోళనలో ప్రధాన పార్టీలు:
ఏది ఏమైనా వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. వచ్చే సంవత్సరంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో రెండు రాష్ట్రాలలో అధికారం నిలుపుకునేందుకు వైసీపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణలో ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీడీపీ ఈ సారైన అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెడుతుండటంతో ఎవరి విజయావకాశాలు దెబ్బతింటాయోనని ఆయా పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. షర్మిల పార్టీ తెలంగాణకు పరిమితమైనా దాని ప్రభావం పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పైనా కచ్చితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనవేస్తున్నారు.
ఇదీ చదవండి: గందరగోళం సృష్టిస్తున్న ధర్మాన వ్యాఖ్యలు