Sunday, December 22, 2024

తాజా కేసు మాత్రమే కాదు, గత  UAPA కేసులన్నిటినీ ఎత్తివేయాలి:హెచ్ ఆర్ ఎఫ్

ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజాషా, ప్రొఫెసర్ లక్ష్మణ్, తదితరులపైన ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు పెట్టిన ఎఫ్ ఐ ఆర్ ను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన మానవ హక్కుల వేదిక (హ్యూమన్ రైట్స ఫోరమ్- హెచ్ ఆర్ ఎఫ్) ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఒక్క కేసు ఉపసంహరించడంతో సరిపోదని, ఇటువంటి కేసులు డజను పైగా ఉన్నాయనీ, వాటన్నిటినీ ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేసింది. ప్రకటన పూర్తి పాఠం ఇది:

తాడ్వాయి పోలీస్ స్టేషన్లో గత ఏడాది నమోదై, తాజాగా సంచలనం సృష్టించిన ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కేసును ఎత్తివేయటానికి ముఖ్య మంత్రి అదేశాలు ఇచ్చినట్లు వార్తలు తెలుపుతున్నాయి. రానున్న ఎన్నికల దృష్ట్యా జరుగబోయే రాజకీయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి  ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. కానీ ఈ తాజా కేసు ఒక్కటే కాదు కనీసం డజనుకు పైగా ఇటువంటి ఎఫ్ ఐ అర్ లు చేస్తూ ఒక్కొక్క ఎఫ్ ఐ ఆర్ లో వందలాది మందిపై ‘తీవ్రవాద నిరోధక చట్టం’ పరిధిలోకి వచ్చే నేరాలను పొలీసులు ఇష్టారాజ్యంగా మోపుతున్నారు. ఎంత సులువుగా వాళ్ళు ఆ పని చేయగలరో ఈ తాజా కేసే ఉదాహరణ.

ప్రొఫెసర్ హరగోపాల్ , ప్రొఫెసర్ పద్మజా షా, ఒక దివంగత హై కోర్టు న్యాయమూర్తి (అని తెలిసి కూడా ) పై ఇంత నిర్లక్ష్యంగా UAPA కేసు నమోదు చేసినందుకు తెలంగాణా ప్రభుత్వం, పోలీసు అధికారులు కొంచెం సిగ్గు పడాలి.  మూకుమ్మడిగా ఇంతమందిపై ఇటువంటి కేసుల నమోదు ఒక మారుమూల ప్రాంత సీఐ, ఎస్ఐ లు చేయలేరు. ఈ కుట్రకేసుకు భారీ స్ధాయిలో సంప్రదింపులు జరుగుతాయి. అందులో పోలీసుల కంటే రాజకీయ నాయకత్వం తాలూకు కోరికలే కీలకంగా ఉంటాయి.  హరగోపాల్ లాంటి అందరి మనిషికి పెరుగుతున్న మద్దతు, రాబోవు ఎన్నికల కాలం నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేసును వెనక్కి తీసుకున్నా ఇంత విచ్చలవిడిగా ‘ఉపా’ కేసులు నమోదు చేయటం అనేది ఏడెనిమిది ఏళ్లుగా ఒక కొత్త అణచివేత విధానం లాగా జరుగుతూనే ఉంది.

తెలంగాణ పోలీసుల ఇష్టారాజ్యం

తెలంగాణా పొలీసులు ఇష్టా రాజ్యంగా ఇటువంటి ఎఫ్ ఐ ఆర్ లు చేయటం, ఆ తర్వాత ఈ కేసులను NIA కి అప్పగించటం, వాళ్ళు వాళ్ళ తరహాలో అందర్నీ వేధించటం అంతా ఒక సీక్వెన్స్ లో జరుగుతుంది. ఇప్పటికే ఇటువంటి అనేక అక్రమ ఎఫ్ ఐ ఆర్ లలో ఒక్క తెలంగాణా లోనే కొన్ని వందలమంది బలహీన వర్గాల కోసం ఆరాటపడే మనుషులు బందీలై ఉన్నారు.

  ఇటువంటి తీవ్రవాద సంబంధిత నేరారోపణలతో జైలుకు పంపబడుతున్న వేలాది మంది వివిధ సామాజిక, హక్కుల రంగాల్లో రాజ్యాంగ బద్దంగా, చట్టాలకు లోబడి పనిచేసే బలహీన వర్గాల శ్రేయోభిలాషులూ, ప్రజాస్వామికవాదులు. వీళ్లంతా ఇతరుల కోసం పనిచేయటం అనే అంతరించిపోతున్న మానవ లక్షణాన్ని కాపాడాలని చూసే అరుదైన వ్యక్తులు. అందరూ, వారి రాజకీయ దృక్పథాలు ఏమున్నా(అధికారపార్టీ దృక్పథానికి భిన్నంగా ఉన్నా)  రాజ్యాంగాన్ని గౌరవిస్తూ,  చట్టాలకు లోబడే పని చేస్తున్నారు. ఇటువంటి వారిని ఏరుకుంటూ అందర్నీ జైళ్లకు పంపిస్తే సమాజంలో మిగిలేది నోరులేని అభాగ్యులు లేదా పశుబలం ఉన్న అణచివేత దారులు. ఇది ఈ దేశంలోని నూటికి తొంబై అయిదు శాతం ప్రజలకు అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ఇప్పటికే బిజేపీ ద్వారా జాతీయ స్ధాయిలో అమలౌతున్న ఈ నియంతృత్వ విధానం ఇప్పుడు తెలంగాణా లోనూ మొదలైంది.

ఒకవైపు ఇలా నియంతను తలపించే కేసీఆరూ, మరోవైపు ఫాసిజాన్ని మరిపించే బీజేపీ, ఆరెస్సెస్ లు ఇప్పటికే రాష్ట్ర, దేశ ప్రజాస్వామిక సాంప్రదాయాన్ని కొన్ని వందల ఏళ్లు వెనక్కి తిప్పారు. ఫలితంగా సమాజం  తరతరాల పాటు కష్టపడి సాధించుకున్న ప్రజాస్వామిక విలువలూ, హక్కులూ అడుగంటిపోయాయి.

పౌర సమాజానికి విజ్ఞప్తి

పౌర సమాజం యొక్క సామాజిక చైతన్యం మీడాధారపడే పాలకుల విధానాలు ఉంటాయి. మేధావులనే జైళ్లకు పంపే కాలంలో ప్రజాస్వామ్యాన్ని అదే మేధావులు రక్షించలేరు. ఇటువంటి పాలనతో సాగే ప్రభుత్వాల చర్యలను ప్రజలంతా వారికి అవకాశం ఉన్న అన్ని మార్గాల ద్వారా ఎండ గట్టాలి. ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలించే ప్రభుత్వాల ఇతర విధానాలు ఎలా ఉన్నా అటువంటి వాళ్ళను భవిష్యత్తులో అధికారంలోకే రాకుండా చూడటమే కాదు, అసలు రాజకీయ రంగంలోనే అటువంటి  పార్టీలు లేని విధంగా ప్రక్షాళన చేయాలి.

ప్రభుత్వం తీసుకోవాల్సిన భాధ్యత:

     1, ఈ కొత్త ఎఫ్ ఐ ఆర్ ను మాత్రమే కాదు, ప్రజాసంఘాల బాధ్యులపై బనాయించిన UAPA  కేసులతో కూడిన అన్ని కుట్ర కేసులనూ ఉపసంహరించాలి.

  2, తాజా కేసు ఉపసంహరణ విషయంలో కూడా నోటిమాటతో సరిపెట్టకుండా తక్షణమే పోలీసులు నిర్వహించిన తదనంతర విచారణలో అందరిపై మోపబడిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని తేలిన కారణంగా కేసును క్లోజ్ చేస్తున్నట్లు సంబంధిత కోర్టులో అంతిమ నివేదిక దాఖలు చేసి కోర్టు ద్వారా కేసును మూసి వేయాలి. ఆ విషయం పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం త్వరలో ప్రకటించాలి.

3, ప్రజాసంఘాలను మూసివేయించటమే లక్ష్యంగా వారిపై అక్రమ కేసులు బనాయించే అనైతిక విధానాన్ని విడనాడాలి.

4, ఏ నేరమూ చేయక పోయినా కేవలం (అదికార పార్టీ దృక్పథానికి భిన్నమైన) రాజకీయ దృక్పథానికి సూత్రప్రాయంగా అనుకూలురు అయినంత మాత్రాన (అటువంటివారిపైన) UAPA కేసులు బనాయించకూడదు.

5, ప్రభుత్వం పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ రాజ్యాంగ బద్దంగా నడుచుకోవాలి.

   మానవ హక్కుల వేదిక, తెలంగాణ

1. డా. ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

2. ఆత్రం బుజంగారావు , రాష్ట్ర అధ్యక్షులు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles